ఐఫోన్ 18 ప్రో యూజర్లకు ఆ ఖర్చు 3 రెట్లు! | Apple charging iPhone 18 Pro users up to 3x cost for storage upgrades | Sakshi
Sakshi News home page

ఐఫోన్ 18 ప్రో యూజర్లకు ఆ ఖర్చు 3 రెట్లు!

Nov 8 2026 5:30 PM | Updated on Nov 8 2026 5:35 PM

Apple charging iPhone 18 Pro users up to 3x cost for storage upgrades

ప్రముఖ టెక్నాలజీ సంస్థ యాపిల్ తన ఐఫోన్‌ల విక్రయాల్లో స్టోరేజ్ అప్‌గ్రేడ్‌లను లాభదాయక ఆదాయ వనరుగా మార్చుకుంటోంది. తాజా ఐఫోన్ 18 ప్రో మోడళ్లలో అదనపు స్టోరేజ్ కోసం వినియోగదారుల నుంచి భారీ మొత్తాలను వసూలు చేస్తున్నట్లు ‘ది వాల్ స్ట్రీట్ జర్నల్’ (WSJ) విశ్లేషణ వెల్లడించింది. ఫ్లాష్ మెమరీ భాగాల కోసం కంపెనీ పెట్టే ఖర్చుతో పోలిస్తే వినియోగదారుల నుంచి వసూలు చేసే అదనపు ధర గణనీయంగా ఎక్కువగా ఉంది.

1TB అప్‌గ్రేడ్‌పై రూ.38 వేలకుపైగా మార్జిన్!

వాల్ స్ట్రీట్ జర్నల్ విశ్లేషణ ప్రకారం.. ఐఫోన్ 18 ప్రోలో 256GB నుంచి 1TB స్టోరేజ్‌కు అప్‌గ్రేడ్ చేయడానికి యాపిల్‌కు సుమారు 192 డాలర్లు (దాదాపు రూ.18 వేలు) ఖర్చవుతోంది. అయితే, ఇదే అప్‌గ్రేడ్ కోసం వినియోగదారుల నుంచి అదనంగా 600 డాలర్లు (సుమారు రూ.56 వేలు) వసూలు చేస్తోంది. అంటే కాంపోనెంట్ ఖర్చును మినహాయిస్తే ఒక్కో ఫోన్‌పై సుమారు 408 డాలర్ల (రూ.38 వేలకుపైగా) స్థూల లాభం వస్తోంది.

512GB స్టోరేజ్ విషయంలోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. అదనపు మెమరీ కోసం యాపిల్‌కు సుమారు 66 డాలర్లు ఖర్చవుతుండగా.. కస్టమర్ల నుంచి 200 డాలర్లు అదనంగా తీసుకుంటోంది. దీంతో ఈ అప్‌గ్రేడ్‌పై అంచనా స్థూల లాభం 134 డాలర్లుగా ఉంది.

2TB వేరియంట్‌పై రూ.70 వేలకుపైగా!

2TB స్టోరేజ్ మోడల్ యాపిల్‌కు మరింత లాభదాయకంగా కనిపిస్తోంది. 1TB వేరియంట్‌తో పోలిస్తే 2TB మోడల్‌కు వినియోగదారులు అదనంగా 1,200 డాలర్లు చెల్లించాలి. అయితే, అదనపు స్టోరేజ్ కోసం కంపెనీకి అయ్యే అంచనా ఖర్చు 450 డాలర్లు మాత్రమే. ఈ లెక్కన ఒక్కో ఫోన్‌పై సుమారు 750 డాలర్ల (రూ.70 వేలకుపైగా) స్థూల లాభం వస్తోంది.

భారత్‌లో స్టోరేజ్ ధరల పెరుగుదల ఇలా..

భారత్‌లో ఐఫోన్ 18 ప్రో 256GB వేరియంట్ ధర రూ.1,64,900గా ఉంది. 512GB మోడల్‌కు రూ.1,89,900, 1TB మోడల్‌కు రూ.2,39,900, 2TB వేరియంట్‌కు రూ.3,14,900 చెల్లించాలి. అంటే ప్రతి స్టోరేజ్ స్థాయికి అప్‌గ్రేడ్ కావడానికి అదనంగా రూ.25 వేల నుంచి రూ.75 వేల వరకు ఖర్చు చేయాల్సి వస్తోంది.

మెమరీ ధరల పెరుగుదల ప్రభావం

మరోవైపు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) డేటా సెంటర్ల విస్తరణతో ప్రపంచవ్యాప్తంగా మెమరీ చిప్‌లకు డిమాండ్ పెరుగుతోంది. దీంతో ఫ్లాష్ మెమరీ ధరలు కూడా పెరిగి యాపిల్ వంటి సంస్థలపై వ్యయ భారం పడుతోంది. ఐఫోన్ 17 ప్రోలో 1TB అప్‌గ్రేడ్ కోసం యాపిల్‌కు గతంలో 42 డాలర్లు మాత్రమే ఖర్చయ్యేది. ఐఫోన్ 18 ప్రోలో అది 192 డాలర్లకు చేరింది. అయినప్పటికీ అప్‌గ్రేడ్ ధరను పెంచడం ద్వారా కంపెనీ తన స్థూల లాభాన్ని మరింత పెంచుకోగలిగింది.

ఇదీ చదవండి: ఒకేసారి 3 ఏళ్ల రీచార్జ్‌ ప్లాన్‌.. జియో సెన్సేషన్‌!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement