తొలి ఐఫోన్.. ఆ తర్వాత యాపిల్‌ ఏం చేసింది? | Apple Has Done Nothing New Says PayPal Co Founder Peter Thiel | Sakshi
Sakshi News home page

తొలి ఐఫోన్.. ఆ తర్వాత యాపిల్‌ ఏం చేసింది?

Oct 25 2026 8:13 PM | Updated on Oct 25 2026 8:19 PM

Apple Has Done Nothing New Says PayPal Co Founder Peter Thiel

టెక్‌ దిగ్గజం యాపిల్‌పై ప్రముఖ పెట్టుబడిదారుడు, పేపాల్‌ సహ వ్యవస్థాపకుడు పీటర్‌ థీల్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. స్టీవ్‌ జాబ్స్‌ మరణం తర్వాత యాపిల్‌ నుంచి చెప్పుకోదగ్గ కొత్త ఆవిష్కరణలు రాలేదని ఆయన అభిప్రాయపడ్డారు. కొత్త ఉత్పత్తులను తీసుకురావడం కంటే వ్యాపారాన్ని విస్తరించడం, బ్రాండ్‌ విలువను పెంచుకోవడంపైనే కంపెనీ ఎక్కువగా దృష్టి పెట్టిందని విమర్శించారు.

వ్యాపారపరంగా యాపిల్‌ విజయవంతమైన సంస్థగా కొనసాగుతున్నప్పటికీ.. ఒకప్పుడు ఉన్న ఆవిష్కరణల వేగం ఇప్పుడు కనిపించడం లేదనేది అన్నారు. 'ది బిల్డర్స్' పాడ్‌కాస్ట్‌లో రచయిత వాల్టర్ ఐజాక్సన్‌తో జరిగిన ఒక ఇంటర్వ్యూలో థీల్ ఈ వ్యాఖ్యలు చేశారు.

తొలి ఐఫోన్‌.. విప్లవాత్మక మార్పులు
2007లో స్టీవ్‌ జాబ్స్‌ తొలి ఐఫోన్‌ను పరిచయం చేయడంతో స్మార్ట్‌ఫోన్‌ రంగంలో విప్లవాత్మక మార్పులు వచ్చాయి. మొబైల్‌ ఫోన్ల వినియోగం, ప్రజల జీవనశైలి పూర్తిగా మారిపోయాయి. అయితే.. 2011లో జాబ్స్‌ మరణించిన తర్వాత యాపిల్‌ నుంచి అంతటి స్థాయిలో కొత్త ఆవిష్కరణలు రాలేదని థీల్‌ పేర్కొన్నారు.

టిమ్‌ కుక్‌ నాయకత్వంపై కూడా థీల్‌ పరోక్షంగా విమర్శలు చేశారు. టిమ్‌ కుక్‌తో పోలిస్తే స్టీవ్‌ జాబ్స్‌ లేదా ఎలాన్‌ మస్క్‌ సమాజానికి ఎక్కువగా ఉపయోగపడ్డారని వ్యాఖ్యానించారు. అయితే.. యాపిల్‌ వ్యాపార విజయాన్ని మాత్రం ఆయన అంగీకరించారు. కంపెనీని సమర్థంగా నిర్వహిస్తున్నారని, స్థిరమైన విలువ కలిగిన సంస్థగా కొనసాగుతోందని పేర్కొన్నారు.

యాపిల్‌కు సవాళ్లు
కాగా.. ప్రస్తుతం ఏఐ రంగంలోనూ యాపిల్‌కు సవాళ్లు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా సిరి వాయిస్‌ అసిస్టెంట్‌ను మరింత అభివృద్ధి చేయడం, ఓపెన్‌ఏఐ, ఆంథ్రోపిక్‌ వంటి సంస్థలతో పోటీ పడటం కంపెనీకి కీలకంగా మారింది. స్మార్ట్‌ఫోన్లు, కంప్యూటర్లు, ఇతర ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తుల్లో యాపిల్‌కు ఇప్పటికీ బలమైన మార్కెట్‌ ఉంది. అయితే.. ఏఐ సాంకేతికత వేగంగా అభివృద్ధి చెందుతున్న పరిస్థితుల్లో కొత్త ఫీచర్లు, వినూత్న ఉత్పత్తులను అందించడంలో వెనుకబడితే.. పోటీ మరింత పెరిగే అవకాశం ఉంది.

యాపిల్‌ భవిష్యత్తుపై పీటర్‌ థీల్‌ విమర్శలు చేయడం ఇదే మొదటిసారి కాదు. 2017లోనే స్మార్ట్‌ఫోన్లలో కొత్త ఆవిష్కరణలకు అవకాశాలు తగ్గిపోయాయని, యాపిల్‌ శకం ముగిసిందని వ్యాఖ్యానించారు. అయితే.. ఆ తర్వాత కంపెనీ షేరు విలువ గణనీయంగా పెరిగింది. దీనిని బట్టి చూస్తే, వ్యాపారపరంగా యాపిల్‌ సాధించిన విజయాన్ని ఎవరూ తక్కువ చేయలేరు. కానీ, స్టీవ్‌ జాబ్స్‌ కాలంలో మాదిరిగా ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచే కొత్త ఉత్పత్తులను కంపెనీ తీసుకురాగలదా అన్న ప్రశ్న మాత్రం కొనసాగుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement