కోచింగ్ కేంద్రాలుగా మారుతున్న స్మార్ట్ ఫోన్లు
ఉద్యోగమైనా,ఉన్నత చదువైనా.. అరచేతిలో స్టడీ మెటీరియల్
ఒక్క క్లిక్‌తో వీడియో పాఠాలు, ఆన్‌లైన్ పరీక్షలు, వేలాది ప్రాక్టీస్ ప్రశ్నలు, సందేహాల నివృత్తి
2025 నాటికే ఆన్‌లైన్ కోచింగ్ బాటలో 7.5 కోట్ల మంది
దేశవ్యాప్తంగా రూ.వేల కోట్ల వ్యాపారం
సాక్షి, హైదరాబాద్: ఒకప్పుడు పోటీ పరీక్షలకు సిద్ధమవ్వాలంటే కోచింగ్ సెంటర్లకు వెళ్లాలి. ఉద్యోగం కోసం అయినా, ఉన్నత చదువు కోసమైనా..పుస్తకాలు, స్టడీ మెటీరియల్, క్లాస్ నోట్స్ కొనుగోలు చేయాలి. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. విద్యార్థుల చేతిలోని స్మార్ట్‌ఫోనే కోచింగ్ కేంద్రంగా మారుతోంది. యూపీఎస్సీ, గ్రూప్స్, ఎస్‌ఎస్‌సీ, బ్యాంకింగ్, రైల్వే, పోలీస్ నియామకాలు, నీట్, జేఈఈ, టీజీ సెట్.. ఇలా ప్రతి పోటీ పరీక్షకు ప్రత్యేక యాప్‌లు, సాఫ్ట్‌వేర్ ప్లాట్‌ఫాంలు అందుబాటులోకి వస్తున్నాయి.
వీడియో పాఠాలు, ఆన్‌లైన్ పరీక్షలు, రోజువారీ కరెంట్ అఫైర్స్, వేలాది ప్రాక్టీస్ ప్రశ్నలు, ర్యాంకింగ్‌లు, వ్యక్తిగత పనితీరు విశ్లేషణ, ఏఐ ఆధారిత సందేహ నివృత్తి.. ఇలా ఒక్కటేమిటి ఏవి అవసరమో అన్నీ అందుబాటులో ఉంటున్నాయి. ఒకే యాప్‌లో వివిధ రకాల కంటెంట్ అందుబాటులో ఉంటోంది. విద్యార్థులు, ఉద్యోగార్థులకు సౌకర్యంగా మారిన ఈ విధానం, భారీ వ్యాపారంగా రూపాంతరం చెందుతోంది. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే లక్షలాది మంది అభ్యర్థులే ఈ సంస్థలకు ప్రధాన మార్కెట్‌గా మారుతున్నారు.
స్క్రీన్‌లోనే సంసిద్ధత
భారత్‌లో పోటీ పరీక్షల ప్రిపరేషన్ మార్కెట్ భారీగా విస్తరిస్తోంది. ఫిజిక్స్ వాలా సంస్థ డ్రాఫ్ట్ రెడ్ హెర్రింగ్ ప్రాస్పెక్టస్ పొందుపరిచిన గణాంకాల ప్రకారం.. దీని ఆధారంగా దాదాపు రూ.లక్ష కోట్లకుపైగా వ్యాపారం నడుస్తోంది. 2025 ఆర్థిక సంవత్సరంలో దేశీయ టెస్ట్ ప్రిపరేషన్ మార్కెట్, ఆన్‌లైన్ టెస్ట్ ప్రిపరేషన్ మార్కెట్ ఇదే లెక్కలు చెప్పాయి. ఈ నివేదిక ప్రకారం 2025లో దేశవ్యాప్తంగా పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థుల సంఖ్య 6.5–7.5 కోట్లుగా అంచనా వేశారు. 2030కి ఇది 8–9 కోట్లకు చేరవచ్చని పేర్కొన్నారు.
రీడర్ స్ట్రాటజీ కన్సల్టెంట్స్ 2026 ఆగస్టులో వెలువరించిన నివేదికలో భారత టెస్ట్ ప్రిపరేషన్ మార్కెట్‌ను 14.8 బిలియన్ డాలర్లు (సుమారు రూ. 1.37లక్షల కోట్లు)గా అంచనా వేసింది. 2030 నాటికి 23–26 బిలియన్ డాలర్లకు (గరిష్టంగా 2.4 లక్షల కోట్లు) చేరవచ్చని పేర్కొంది. ఇవి జేఈఈ, నీట్, యూపీఎస్సీ, బ్యాంకింగ్, ఇతర పోటీ పరీక్షలకు వీడియో తరగతులు, ఆన్‌లైన్ కోర్సులు, మాక్ టెస్టులు నిర్వహిస్తున్నాయి. లైవ్ క్లాసులు, సబ్‌్రస్కిప్షన్లు, అధ్యాపకుల ఆధారిత కోర్సులు, పరీక్షల ప్రిపరేషన్ చేపడుతున్నాయి.
విద్యార్థులను ఆకర్షించేలా ఆఫర్లు
విద్యార్థులను తమ ఉచ్చులోకి లాగేందుకు ఆకర్షణీయమైన ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. కొన్ని మాక్ టెస్టులు ఉచితంగా అందిస్తామంటున్నారు. పూర్తి టెస్ట్ సిరీస్‌కు డబ్బులు తీసుకుంటున్నారు. కొన్ని వీడియో పాఠాలు శాంపిల్‌గా ఉచితంగానే ఇస్తున్నారు. పూర్తి కోర్సుకు ప్రత్యేక ఫీజు ఉంటుంది. ప్రాథమిక విశ్లేషణ ఉచితం అంటూ అవగాహన సదస్సులతో ఆకట్టుకుంటున్నారు.
సమగ్ర పనితీరు విశ్లేషణకు ప్రీమియం సభ్యత్వం పేరుతో పెద్ద మొత్తం వసూలు చేస్తున్నారు. ఈ విధానం ద్వారా ఒక్కో విద్యార్థి నుంచి వచ్చే ఆదాయాన్ని పెంచుకునే ప్రయత్నం జరుగుతోంది. అయితే విద్యార్థులు కొనుగోలు చేసే ప్రతి కోర్సు నాణ్యమైనదేనా? ఇచ్చే ప్రశ్నలు తాజా సిలబస్‌కు అనుగుణంగా ఉన్నాయా? అనేది నిర్ధారించుకోవాల్సి ఉంటుంది.
రాష్ట్రంలో ప్రాంతీయ యాప్‌ల వ్యాపారం
రాష్ట్రంలోని పోటీ పరీక్షల శిక్షణా కేంద్రాలు కూడా హైటెక్ హంగులు సమకూర్చుకుంటున్నాయి. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థులను లక్ష్యంగా చేసుకుని చిన్న సంస్థలు, స్టడీ సర్కిళ్లు కూడా యాప్‌లు రూపొందిస్తున్నాయి. ప్రభుత్వ ఉద్యోగ పరీక్షలకు తెలుగు, ఉర్దూ, ఇంగ్లిష్ భాషల్లో ప్రశ్నల బ్యాంక్, రోజువారీ ప్రాక్టీస్, వివరణలతో కూడిన అభ్యసన సేవలను అందిస్తున్నాయి. 25,600కు పైగా ప్రాక్టీస్ ప్రశ్నలు, 1,200కు పైగా ఉచిత పాఠాలు వీటిల్లో ఉంటున్నాయి.
యువత హైదరాబాద్‌లో కోచింగ్ కేంద్రాలకు రాకుండానే వారి దృష్టిని ఆకర్షించేలా చేస్తున్నాయి. నెలవారీ, వార్షిక సభ్యత్వ రుసుము, ప్రత్యేక పరీక్షలకు చెల్లింపు కోర్సులకు ప్రీమియం కోర్సులు, ఆన్‌లైన్ ద్వారా మాక్ టెస్టులు నిర్వహిస్తున్నాయి. ఒక సంస్థ రూ.499 వార్షిక సభ్యత్వంతో లక్ష మంది విద్యార్థులను చేర్చుకుంటే రూ.4.99 కోట్ల స్థూల ఆదాయం వస్తుంది. ఐదు లక్షల మంది చెల్లింపు సభ్యులుంటే రూ.24.95 కోట్ల ఆదాయం వస్తుంది.
అందుబాటులో ఆరు సాఫ్ట్‌వేర్లు
విద్యార్థికి కనిపించేది యాప్ మాత్రమే. కానీ దాని వెనుక అనేక సాఫ్ట్‌వేర్ వ్యవస్థలు పనిచేస్తాయి. ప్రధానంగా ఆరు రకాల సాఫ్ట్‌వేర్‌లు అందుబాటులో ఉన్నాయి. లెరి్నంగ్ మేనేజ్‌మెంట్ సిస్టమ్, ఆన్‌లైన్ ఎగ్జామ్ సాఫ్ట్‌వేర్, క్వశ్చన్ బ్యాంక్, ఏఐ బేస్డ్ ఎనలిటిక్స్, ఆన్‌లైన్ పరీక్షలో మోసాలను గుర్తించే ప్రోక్టరింగ్ సాఫ్ట్‌వేర్, విద్యార్థుల వివరాలు, ఫీజులు పొందుపరిచే సీఆర్‌ఎం అండ్ పేమెంట్ సిస్టమ్ సాఫ్ట్‌వేర్ వాడుతున్నారు. ఏఐ ఆధారిత సాఫ్ట్‌వేర్‌లు ఈ వ్యాపారానికి కొత్త అవకాశాలను తెస్తున్నాయి.
విద్యార్థి ఏ ప్రశ్నల్లో తప్పులు చేస్తున్నాడు? ఏ సబ్జెక్టులో వెనుకబడ్డాడు? ఎన్ని రోజుల్లో సిలబస్ పూర్తి చేయగలడు? వంటి వివరాలను విశ్లేíÙంచి వ్యక్తిగత అధ్యయన ప్రణాళికలను రూపొందిస్తున్నాయి. ఇప్పటి యాప్‌లు కేవలం వీడియో పాఠాలకే పరిమితం కావడం లేదు. ఏఐ ట్యూటర్ ద్వారా 24 గంటలూ సందేహ నివృత్తి చేస్తున్నాయి. విద్యార్థి స్థాయికి అనుగుణంగా ప్రశ్నల తయారు చేస్తున్నాయి. సమాధానాల్లో తప్పులను గుర్తించి వివరణ ఇస్తున్నాయి. ప్రిలిమ్స్, మెయిన్స్ సమాధానాల మూల్యాంకనం చేపడుతున్నాయి. విద్యార్థి సామర్థ్యాన్ని బట్టి వ్యక్తిగత టైమ్‌టేబుల్ రూపొందిస్తున్నాయి.
సబ్జెక్టు ఎక్కడ?
సబ్జెక్టు లేకుండా ప్రశ్నావళి ఉంటోంది. ఆన్‌లైన్‌లో అన్నీ ఏఐ ఆధారితంగానే ఉంటున్నాయి. విద్యార్థి సందేహాలు తీర్చే వ్యవస్థ ఉండదు. ఈ మోజులో పడి టీచర్లు చెప్పేదీ వినడం లేదు. సబ్జెక్టుపై కమాండ్ ఉంటేనే ఏ పోటీ పరీక్షలోనైనా ముందుకెళ్ళడం సాధ్యం.
– రవీంద్రకుమార్ (గణితశాస్త్ర అధ్యాపకుడు)
కొత్త యాప్‌లు అడుగుతున్నారు
పోటీ పరీక్షల కోసం విద్యా సంస్థలు కొత్త యాప్‌లు కోరుతున్నాయి. ఏఐ ఆధారిత సాఫ్ట్‌వేర్ కావాలంటున్నాయి. ప్రశ్నల రూపకల్పనకు ఓపెన్ ఏఐని ఎక్కువగా వాడుతున్నాం.
– నీరబ్ సుశేన్ (సాఫ్ట్‌వేర్ యాప్‌ల నిర్వాహకుడు)


