బావర్చీ హోటల్‌లో ఆందోళన
ఆర్టీసీ క్రాస్‌రోడ్స్ బావర్చీ హోటల్‌లో బీఆర్‌ఎస్ వినూత్న నిరసన
రాహుల్ గాంధీ చిత్రపటానికి బిర్యానీ తినిపిస్తున్నట్లు నిరసన
బీఆర్‌ఎస్‌ను అడ్డుకొనేందుకు తరలివచ్చిన కాంగ్రెస్ శ్రేణులు
ఇరువర్గాల ఘర్షణతో అర్ధరాత్రి వరకు ఉద్రిక్తత
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ లోని ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లో ఉన్న ప్రముఖ హోటల్ బావర్చి గురువారం రాత్రి రణరంగంగా మారింది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చిత్రపటం (బొమ్మ)తో బీఆర్‌ఎస్ నేతలు వినూత్న నిరసనకు దిగగా, కాంగ్రెస్ శ్రేణులు అడ్డుకోవడంతో ఇరువర్గాల మధ్య తీవ్ర ఉద్రిక్తత, ఘర్షణలు చోటుచేసుకున్నాయి.
అసెంబ్లీ ఎన్నికల సమయంలో రాహుల్‌గాంధీ ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లోని బావర్చి హోటల్‌లో నిరుద్యోగ యువతతో కలసి బిర్యానీ భోజనం చేస్తూ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఏడాదిలో రెండు లక్షల ఉద్యోగాలతో జాబ్ క్యాలెండర్ ఇస్తామని, తెలంగాణలో నిరుద్యోగాన్ని నిర్మూలిస్తామని హామీ ఇచ్చారు. ఆ హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటి వరకు నెరవేర్చలేదని చెబుతూ అదే బావర్చీ హోటల్‌లో బీఆర్‌ఎస్ సోషల్ మీడియా ఇంచార్జీ కృశాంక్ నేతృత్వంలో పార్టీ కార్యకర్తలు వినూత్న నిరసన చేపట్టారు.
రాహుల్‌గాంధీ చిత్రపటానికి బిర్యానీ తినిపిస్తున్నట్లుగా చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంపై బీఆర్‌ఎస్ సోషల్ మీడియా గురువారం ఉదయం నుంచే పెద్ద ఎత్తున ప్రచారం చేసింది. దాంతో, ఈ కార్యక్రమాన్ని అడ్డుకొనేందుకు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు యువజన కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎంపీ అనిల్‌కుమార్ యాదవ్ తమ్ముడు అరవింద్‌కుమార్ యాదవ్ నేతృత్వంలో పెద్దఎత్తున తరలివచ్చారు. బీఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ హోటల్‌లోకి దూసుకెళ్లారు.
దాంతో, హోటల్‌లో ఇరువర్గాల మధ్య ఘర్షణ నెలకొంది. అప్పటికే అక్కడికి చేరుకున్న పోలీసులు కాంగ్రెస్, బీఆర్‌ఎస్ వర్గాలను చెదరగొట్టి, కాంగ్రెస్ నాయకులను బయటకు పంపించేందుకు ప్రయత్నించారు. అయినప్పటికీ కాంగ్రెస్ శ్రేణులు హోటల్‌లో బీభత్సం సృష్టించాయి. టేబుళ్లను ధ్వంసం చేసి, ప్లేట్‌లను బీఆర్‌ఎస్ నేతలపైకి విసిరారు. దీంతో ఉద్రిక్తత మరింత పెరిగింది.
పరిస్థితి చేయిదాటిపోతుందని భావించిన పోలీసులు బీఆర్‌ఎస్ నాయకులు కృశాంక్, ముఠా జయసింహ, వల్లాల శ్రీనివాస్, శ్రీనివాస్‌గుప్తా, తదితరులను హోటల్ వెనుక మార్గం గుండా బయటకు పంపించారు. అనంతరం యువజన కాంగ్రెస్ నాయకులు చిక్కడపల్లి పోలీస్‌స్టేషన్‌లో బీఆర్‌ఎస్ నాయకులపై ఫిర్యాదు చేశారు. మరోవైపు, కాంగ్రెస్ కార్యకర్తలు తమపై దాడి చేశారని ఆరోపిస్తూ బీఆర్‌ఎస్ కార్యకర్తలు, నాయకులు ధర్నాకు దిగారు. ఒకవైపు బీఆర్‌ఎస్ ధర్నా, మరోవైపు కాంగ్రెస్ శ్రేణుల ఫిర్యాదులు, ఇరు వర్గాల ఘర్షణలతో గురువారం అర్ధరాత్రి వరకు ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.


