71 మంది ప్రాణాలు కాపాడిన ఆ ఇద్దరు | Bus driver loses consciousness: Telangana | Sakshi
Sakshi News home page

71 మంది ప్రాణాలు కాపాడిన ఆ ఇద్దరు

Nov 27 2026 12:40 AM | Updated on Nov 27 2026 12:40 AM

Bus driver loses consciousness: Telangana

ఆ ఎలక్ట్రికల్‌ ఆర్టీసీ బస్సు ఇదే

బస్సు నడుపుతుండగా స్పృహ కోల్పోయి స్టీరింగ్‌పై పడిపోయిన డ్రైవర్‌

ప్రయాణికుడు, కండక్టర్‌ సమయస్ఫూర్తితో తప్పిన పెనుముప్పు 

బానోత్‌ రాంకోటికి మంత్రి పొన్నం అభినందనలు

హన్మకొండ/కాజీపేట: టీజీఎస్‌ ఆర్టీసీ ఎలక్ట్రిక్‌ జేబీఎం ఎక్స్‌ప్రెస్‌ బస్సు నడుపుతున్న డ్రైవర్‌ ఒక్కసారిగా స్టీరింగ్‌పై పడిపోవడం.. ఓ ప్రయాణికుడు, కండక్టర్‌ సమయస్ఫూర్తితో వ్యవహరించడంతో 71 మంది ప్రయాణికులు ప్రమాదంనుంచి బయటపడ్డారు. ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆర్టీసీ వరంగల్‌–2 డిపోకు చెందిన ఎలక్ట్రిక్‌ ఎక్స్‌ప్రెస్‌ బస్సు గురువారం మధ్యాహ్నం హనుమకొండ బస్‌స్టేషన్‌ నుంచి 71మంది ప్రయాణికులతో ఉప్పల్‌కు బయలు దేరింది.

కాజీపేట డీజిల్‌ కాలనీ బాపూజీనగర్‌ ప్రాంతానికి మధ్యాహ్నం 2.15 గంటల సమయానికి చేరుకోగా ఆ సమయంలో బస్సు డ్రైవర్‌ రాజు అకస్మాత్తుగా స్పృహ కోల్పోయి స్టీరింగ్‌పై పడిపోవడాన్ని కండక్టర్‌ విజయ్‌ గమనించారు. డ్రైవర్‌ వద్దకు చేరుకుని ఆయనను లేపి బ్రేకులు వేసేందుకు ప్రయత్నించారు. అదే బస్సులోని ప్రయాణికుడు బానోత్‌ రాంకోటి పరిస్థితిని గమనించి డ్రైవర్‌ వద్దకు చేరుకుని బ్రేకులు వేసి బస్సును నియంత్రించి పక్కకు నిలిపివేశాడు. దీంతో బస్సులో ఇద్దరు మహిళలకు స్వల్ప గాయాలు కాగా, 108లో ఎంజీఎంకు తరలించారు. మిగతా వారందరూ సురక్షితంగా బయటపడ్డారు.

 కాగా, బానోత్‌ రాంకోటి గతంలో ఆర్టీసీ జనగామ డిపోలో ఐటీఐ అప్రెంటిస్‌ చేయగా ఆ అనుభవంతో ప్రయాణికులను కాపాడగలిగాడు. కాజీపేట ఏసీపీ ప్రశాంత్, సీఐ జక్కుల శ్యాంసుందర్‌ వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని అస్వస్థతకు గురైన ఆర్టీసీ డ్రైవర్‌ను తమ వాహనంలో చికిత్స నిమిత్తం హనుమకొండలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. వరంగల్‌ డిపో–2 డిపో మేనేజర్‌ విజయ్‌చంద్ర సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించి మరో బస్సును తెప్పించి ప్రయాణికులను ఉప్పల్‌కు చేరవేశారు.

సమయస్ఫూర్తి, ధైర్యసాహసాలతో వ్యవహరించి ప్రయాణికులతోపాటు రోడ్డుపై వెళ్తున్న వాహనదారులను, పాదచారులను కాపాడిన రాంకోటిని మంత్రి పొన్నం ప్రభాకర్‌ ఈ సందర్భంగా అభినందించారు. ఆయన చూపిన మానవత్వం, సమయస్ఫూర్తి అందరికీ ఆదర్శమని ప్రశంసించారు. కాగా, డ్రైవర్‌ రాజుకు ఆ సమయంలో అకస్మాత్తుగా ఫిట్స్‌ వచ్చాయని, ఆస్పత్రిలో చికిత్స అనంతరం ఆయనను కుటుంబ సభ్యులు ఇంటికి తీసుకెళ్లారని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి.

కొద్దిలో ప్రమాదం తప్పింది.. 
డ్రైవర్‌ పూర్తిగా స్పృహ తప్పి స్టీరింగ్‌పై పడిపోగా కండక్టర్‌ వెళ్లి ఆయనను లేపేందుకు ప్రయత్నిస్తున్నారు. బస్సులో ప్రయాణికులనుంచి ఒక్కసారిగా అరుపులు వచ్చాయి. ఈ క్రమంలో బస్సు అదుపుతప్పి క్షణాల్లోనే చెట్టుకు ఢీకొట్టేది. నేను ముందుకెళ్లి స్టీరింగ్‌ అందుకుని కంట్రోల్‌ చేసి బ్రేక్‌ వేశాను. దీంతో పెద్ద గండం తప్పింది. నేను రైలులో వెళ్దామనుకున్నా. నా భార్య బస్సులో వెళ్దామనేసరికి బస్సు ఎక్కాను.    – ప్రయాణికుడు బానోత్‌ రాంకోటి 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement