యాదాద్రి, భువనగిరి: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి కొండ చుట్టూ అయ్యప్ప మాలధారణ స్వాముల మహాగిరి ప్రదక్షిణ డిసెంబర్ 1న ఉన్నందున ఆరోజు ఆలయ వేళల్లో మార్పులు చేసినట్లు ఈవో భవానీశంకర్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.
1వ తేదీన వేకువ జామున 3 గంటలకే ఆలయాన్ని తెరవనున్నట్లు వెల్లడించారు. 3.30 గంటల వరకు సుప్రభాతం, 4 గంటల వరకు బిందె తీర్థం, ఆరాధన, 4 నుంచి 4.45 గంటల వరకు బాలభోగం, 4.45 గంటల నుంచి 5.45 గంటల వరకు శ్రీస్వామి వారికి నిజాభిషేకం, 5.45 నుంచి 6.30 గంటల వరకు శ్రీస్వామి వారికి సహస్ర నామార్చన, అమ్మవారికి కుంకుమార్చన, క్షేత్రపాలకుడు ఆంజనేయస్వామికి సహస్రనామార్చన, 6.30 గంటల నుంచి 6.45 వరకు తోమాల సేవ నిర్వహిస్తారు.
6.45 నుంచి 8.30 గంటల వరకు గిరి ప్రదక్షిణ నిర్వహించిన అయ్యప్పస్వాములకు గర్భాలయ దర్శనం, అదే సమయంలో ప్రతి మంగళవారం స్థానిక ప్రజలకు కల్పించే గర్భాలయ దర్శనం అనుమతి ఉంటుంది. 8.30 నుంచి 9.30 వరకు సర్వ దర్శనాలు, 9.30 నుంచి 10.30 వరకు బ్రేక్ దర్శనానికి భక్తులను అనుమతిస్తారు. అనంతరం అభయ దర్శనాలు, ఆలయ పూజా కైంకర్యాలు యథావిధిగా ఉంటాయని ఈవో తెలిపారు.
ఇదీ చదవండి: అయ్యప్ప దీక్షలో ఏం చేయాలి? ఏ తప్పులు చేయొద్దు? ఫుల్ డీటెయిల్స్


