కళ్యాణి
ఆదిలాబాద్ జిల్లా: నిశ్చితార్థం జరగాల్సిన ఆ ఇంట్లో చావు డప్పు మోగింది. ప్రేమ వ్యవహారం హత్యకు దారి తీసింది. కన్నతండ్రే కూతురిని కడతేర్చి ఆత్మహత్యగా చిత్రీకరించాడు. కుటుంబ సభ్యులను సైతం నమ్మించి నాలుగు గంటల్లోపే అంత్యక్రియలు సైతం పూర్తి చేశాడు. ఈ అమానవీయ ఘటన ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండలం ఉమ్రి గ్రామంలో చోటు చేసుకుంది. అనుమానాస్పద మృతిపై విచారణ చేపట్టిన పోలీసులు సాయంత్రంలోపు గుట్టు రట్టు చేశారు.
నార్నూర్ సీఐ గురుస్వామి తెలిపిన వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన అడే కైలాస్–సమిత్ర దంపతుల కుమార్తె కళ్యాణి (18)కు ఈనెల 25న నార్నూర్‌కు చెందిన ఓ యువకుడితో నిశి్చతార్థం జరగాల్సి ఉంది. ఈనెల 23న ఉదయం తల్లిదండ్రులతో పాటు కళ్యాణి, మరో బాలుడు కలిసి పత్తి ఏరేందుకు చేనుకు వెళ్లారు. కొద్దిసేపటి తర్వాత కడుపునొప్పిగా ఉందని కళ్యాణి ఇంటికి తిరిగి వచి్చంది. పని ముగించుకుని సాయంత్రం వచ్చిన తల్లిదండ్రులు బిడ్డ దిగులుగా ఉండటాన్ని గమనించారు.
నిశ్చితార్థం సమీపిస్తుండగా ఇలా ఎందుకు ఉన్నావని ప్రశ్నించారు. తండ్రి గట్టిగా నిలదీయడంతో తన మేనత్త కుమారుడితో ప్రేమ సంబంధం ఉన్నట్లు చెప్పింది. దీంతో ఆమెపై తండ్రి ఆగ్రహం వ్యక్తం చేశాడు. రాత్రి కుటుంబ సభ్యులంతా నిద్రించిన తర్వాత మంగళవారం వేకువజామున సుమారు 3 గంటల సమయంలో కుమార్తె ఉన్న గదికి వెళ్లి గొంతు నులిమి హత్య చేశాడు. విషయం బయటపడకుండా ఉండేందుకు మృతదేహాన్ని మరో గదిలోకి తీసుకెళ్లి చున్నీతో ఉరేసుకున్నట్లు చిత్రీకరించాడు. అనంతరం తన గదిలోకి వెళ్లి నిద్రపోయినట్లు నటించాడు. ఉదయం 5 గంటలకు నిద్రలేచిన తల్లి కుమార్తెను లేపేందుకు వెళ్లింది. మంచంపై కనిపించకపోవడంతో మరోవైపు చూడగా ఉరికి వేలాడుతూ విగతజీవిగా కనిపించింది. ఆమె పెద్దగా కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు అక్కడికి చేరుకున్నారు.
తొలుత ఆమె ఆత్మహత్య చేసుకుందని అంతా భావించారు. అయితే ఘటన తీరు, అనంతరం చోటుచేసుకున్న పరిణామాలు అనుమానాలకు కారణమయ్యాయి. మృతి చెందిన కొద్ది గంటల్లోనే అంత్యక్రియలు పూర్తి చేయడం సందేహాలకు తావిచ్చింది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని విచారించారు. అయితే తన కుమార్తె పెళ్లి ఇష్టం లేక ఆత్మహత్య చేసుకుందని తండ్రి చెప్పాడు. లంబాడా సంప్రదాయం ప్రకారం పెళ్లికాని యువతి చనిపోతే ఖననం చేస్తారని స్థానికులు చెబుతుండగా, మృతదేహాన్ని దహనం చేయడం చర్చనీయాంశమైంది. ఈమేరకు పోలీసులు కేసు నమోదు చేసి మృతిపై దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో మృతురాలి తండ్రిని విచారించగా, పరువు పోతుందనే కారణంతో కుమార్తెను తానే హత్య చేసినట్లు అతడు అంగీకరించినట్లు సీఐ తెలిపారు.


