డిజిటల్ ఆర్ట్ పేరుతో రూ.కోట్లు కొల్లగొట్టిన ’1st pe’
చైనీస్ గేమింగ్ దందాను ఛేదించిన ఐటీ శాఖ
రాజర్షి ద్వివేది, ఫణి రాజు బృందం దర్యాప్తు
దుబాయ్‌లో రెండు విలాసవంతమైన ఫ్లాట్ల గుర్తింపు
డొల్ల కంపెనీలు, నకిలీ వెబ్‌సైట్లతో విదేశాలకు నిధులు
సాక్షి, హైదరాబాద్: ఆన్‌లైన్ గేమింగ్, బెట్టింగ్ యాప్‌ల ముసుగులో భారతీయుల నుంచి రూ. వేల కోట్లు కొల్లగొట్టి, అక్రమ మార్గాల్లో విదేశాలకు తరలిస్తున్న భారీ చైనీస్ ఆర్థిక నెట్‌వర్క్‌ను ఆదాయపు పన్ను శాఖ అధికారులు బట్టబయలు చేశారు. సుమారు రూ.2,700 కోట్ల మేర జరిగిన ఈ భారీ కుంభకోణాన్ని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిశా రాష్ట్రాల ఐటీ ఇన్వెస్టిగేషన్ డైరెక్టర్ జనరల్ రాజర్షి ద్వివేది, ప్రిన్సిపల్ డైరెక్టర్ ఆఫ్ ఇన్‌కమ్ ట్యాక్స్ (ఇన్వెస్టిగేషన్) హెచ్.ఫణిరాజు సారథ్యంలోని ప్రత్యేక బృందాలు అత్యంత చాకచక్యంగా ఛేదించాయి. అ
క్టోబర్ మూడో వారంలో ఐటీ అధికారులు నిర్వహించిన విస్తృత సోదాల్లో లెక్కల్లో చూపని సుమారు రూ.6.2 కోట్ల విలువైన క్రిప్టో కరెన్సీని జప్తు చేశారు. క్రిప్టో కరెన్సీ రూపంలో రూ.10 కోట్లు చెల్లించి దుబాయ్‌లో కొనుగోలు చేసిన రెండు విలాసవంతమైన ఫ్లాట్ల వివరాలను కూడా అధికారులు గుర్తించారు. ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించిన కీలక సర్వర్ డేటా, బ్యాంకు లావాదేవీల ఆధారాలను అధికారులు స్వాదీనం చేసుకున్నారు.
’డిజిటల్ ఆర్ట్’ ముసుగులో..
భారతీయ నిబంధనల ప్రకారం చైనాకు చెందిన బెట్టింగ్, గేమింగ్ యాప్‌లు నేరుగా దేశీయ వినియోగదారుల నుంచి నగదు వసూలు చేయడానికి వీలుండదు. ఈ అడ్డంకిని అధిగమించేందుకు నిర్వాహకులు ’1st pe’ (ఫస్ట్ పే) అనే నకిలీ డిజిటల్ ఆర్ట్ ప్లాట్‌ఫామ్‌ను ప్రధాన కేంద్రంగా చేసుకున్నారు. ఈ సంస్థ నిర్వాహకులు దేశవ్యాప్తంగా అనేక డొల్ల (షెల్) కంపెనీలను ఏర్పాటు చేశారు. నామమాత్రపు డైరెక్టర్లు, వర్చువల్ కార్యాలయాలు, నకిలీ వెబ్‌సైట్లను సృష్టించి.. అవన్నీ నిజమైన డిజిటల్ ఆర్ట్ ఉత్పత్తులను విక్రయించే వ్యాపార సంస్థలేనని నమ్మించారు. ఈ నకిలీ పత్రాల ఆధారంగా ’ఎయిర్‌పే’ వంటి భారతీయ పేమెంట్ గేట్‌వేల నుంచి మర్చంట్ ఐడీలు పొందారు.
పక్కా వ్యవస్థ ద్వారా..
వినియోగదారులు గేమింగ్ యాప్‌లో యూపీఐ ద్వారా నగదు డిపాజిట్ చేసినప్పుడు, ఆ లావాదేవీ ముందుగా వైట్‌లిస్ట్ అయిన ఫస్ట్‌పేకి వెళ్లి, అక్కడి నుంచి ఈ డొల్ల కంపెనీల ఖాతాల్లోకి మళ్లేది. రికార్డుల్లో మాత్రం వినియోగదారులు ’డిజిటల్ ఆర్ట్’ ఉత్పత్తులను కొనుగోలు చేసినట్టు నమోదయ్యేది. ఒకే ఖాతాలో భారీగా నగదు జమ అయితే అనుమానం వస్తుందనే ఉద్దేశంతో లావాదేవీలను పలు కంపెనీలకు విభజించారు. ఏదైనా బ్యాంకు లేదా పేమెంట్ సంస్థ అనుమానంతో ఒక ఖాతాను ఫ్రీజ్ చేస్తే, తక్షణమే కొత్త డొల్ల కంపెనీలను సృష్టించి లావాదేవీలను వాటిలోకి మళ్లించేలా పక్కా వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నారు.
40 నెలల్లో రూ.2,700 కోట్లు..
2023 జూలై నుంచి 2026 అక్టోబర్ వరకు దాదాపు 40 నెలల పాటు ఈ అక్రమ వ్యవహారం యథేచ్ఛగా సాగింది. ఈ వ్యవధిలో చైనీస్ గేమింగ్ యాప్‌ల తరఫున సుమారు రూ.2,700 కోట్లు వసూలు కాగా, అందులో కేవలం కమీషన్ రూపంలోనే ఫస్ట్‌పే నిర్వాహకులు రూ.170 కోట్లు ఆర్జించినట్లు సర్వర్ డేటా ప్రాథమిక విశ్లేషణలో తేలింది. వసూలైన నగదును క్రిప్టో కరెన్సీ రూపంలోకి మార్చి విదేశాల్లోని అసలు సూత్రధారులకు చేరవేసినట్టు అధికారులు ఆధారాలు సేకరించారు.
పట్టుబడిన ప్రధాన యాప్‌లు ఇవే..
ఐటీ అధికారుల సర్వర్ విశ్లేషణలో చైనీస్ గేమింగ్ యాప్‌లకు సంబంధించిన మొత్తం 113 క్లయింట్ లాగిన్‌లు బయటపడ్డాయి. ఇందులో ప్రధానంగా కుమార్‌పే, బడ్డీపే, రమ్మీపెప్పర్, బ్లూబెర్రీ రమ్మీ, జూమ్‌నక్కీ, డీప్‌రమ్మీ, ఎక్స్‌ఎక్స్‌వీ 918 వంటి యాప్‌లు ఉన్నాయి. వీటిలో కుమార్‌పే, ఎక్స్‌ఎక్స్‌వీ 918, రమ్మీపెప్పర్ యాప్‌లు ’హోప్’ అనే ఒకే ఉమ్మడి పేరెంట్ లాగిన్ కింద పనిచేసినట్టు గుర్తించారు. వీటితో పాటు కింగ్‌గేమ్ రమ్మీ, వైల్డ్‌బేర్ రమ్మీ, విస్టన్ గేమ్, లక్కీ స్టార్, 1విన్ తదితర ప్లాట్‌ఫామ్‌లు కూడా ఈ నెట్‌వర్క్ ద్వారానే కార్యకలాపాలు నిర్వహించాయి. లైసెన్స్ లేని పేమెంట్ అగ్రిగేటర్‌గా వ్యవహరించిన ఫస్ట్‌పే పాత్రపై, విదేశాలకు తరలిన నిధుల అసలు లబ్దిదారులపై ఆదాయపు పన్ను శాఖ అధికారులు మరింత లోతైన దర్యాప్తు కొనసాగిస్తున్నారు.


