భూ సర్వే తరువాత 45 రోజుల్లో కొత్త పాస్‌బుక్‌! | New passbook within 45 days after land survey | Sakshi
Sakshi News home page

భూ సర్వే తరువాత 45 రోజుల్లో కొత్త పాస్‌బుక్‌!

Nov 26 2026 3:54 AM | Updated on Nov 26 2026 3:55 AM

New passbook within 45 days after land survey

అందులోనే భూ విస్తీర్ణ మ్యాప్‌; క్యూఆర్‌ కోడ్, అక్షాంశాలు, రేఖాంశాలు 

క్యూఆర్‌ కోడ్‌ను స్కాన్‌ చేస్తే భూమికి సంబంధించిన పూర్తి వివరాలు 

పొరుగు రైతుల వివరాలు కూడా..; తొలిదశలో 2,500 గ్రామాల్లో సర్వే

సాక్షి, హైదరాబాద్‌: భూ సర్వే పూర్తయిన 45 రోజుల్లో, పూర్తి వివరాలతో కొత్త పాస్‌బుక్‌ ను రైతులకు అందజేయనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. ఒక గ్రామంలో సర్వే పూర్తయిన తరువాత 25 రోజుల్లోగా అభ్యంతరాలు వస్తే.. వాటిని పరిష్కరించిన తరువాత మొత్తంగా మరో 20 రోజుల్లో, అంటే సర్వే పూర్తయిన 45 రోజుల్లోగా కొత్త పట్టాదార్‌ పాస్‌పుస్తకం రైతులకు ఇవ్వాలని నిర్ణయించింది. అభ్యంతరాలు రాని పక్షంలో నెల రోజుల్లోనే పాస్‌బుక్‌ను అందజేసే అవకాశం ఉంది. 

ప్రస్తుతం ఉన్న పాస్‌పుస్తకాల్లో.. భూమి యజమాని పేరు, తండ్రి పేరు, గ్రామం, సర్వే నంబర్‌తో భూమి వివరాలున్నాయి. సర్వే అనంతరం ఇచ్చే కొత్త పాస్‌ పుస్తకాల్లో భూమి విస్తీర్ణానికి సంబంధించిన మ్యాప్‌ (కొలతల పటం), క్యూఆర్‌ కోడ్, అక్షాంశాలు, రేఖాంశాల వివరాలు కూడా పొందుపర్చనున్నారు. అందులోని క్యూఆర్‌ కోడ్‌ను స్కాన్‌ చేస్తే.. రైతు పొలం ఏ గ్రామంలో, ఏ ప్రాంతంలో, ఎంత ఉంది అనే వివరాలతో పాటు, ఆ భూమికి పొరుగున ఉన్న రైతుల పేర్లు కూడా పూర్తిస్థాయిలో కనిపిస్తాయి.  

పూర్తి భూవివరాలు.. 
కాలిబాట, రహదారులు, కాలువలు, కుంటలు, చెరువులు, వాగులు, వంకలు వంటివి రైతు భూమిలో ఉంటే.. ఆ మేరకు వాటి విస్తీర్ణాన్ని తగ్గించి, మీ సాగు భూమి కచ్చితంగా ఎంత ఉందన్నది స్పష్టతనిస్తూ పాస్‌ పుస్తకాలు జారీ కానున్నాయి. అందువల్ల రైతు భూమి కొంతమేరకు తగ్గే అవకాశాలున్నాయని రెవెన్యూ శాఖ ఉన్నతాధికారి ఒకరు వివరించారు. సర్వే తరవాత ధాన్యం సేకరణలో అవకతవకలను అరికట్టవచ్చని, అధిక మద్దతు ధర కోసం పక్క రాష్ట్రాల నుంచి ఇక్కడి మార్కెట్లకు ధాన్యం తరలించడాన్ని కూడా అడ్డుకోవచ్చని అధికారులు భావిస్తున్నారు. 

అలాగే, పీఎం కిసాన్‌ సమ్మాన్, రైతు భరోసా లాంటి పథకాలకోసం ఈ డేటాను ప్రామాణికంగా తీసుకొని లబ్దిదారులను నిర్ణయించనున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో మొత్తం 10,900 ల రెవెన్యూ గ్రామాలుంటే, మొదటి విడతగా 2,500 గ్రామాల్లో ఈ సర్వే కొనసాగుతోంది. రోజుకు 25 నుంచి 30 ఎకరాల చొప్పున ఇప్పటివరకు 2.37 కోట్ల ల్యాండ్‌ బిట్ల సర్వే జరిగింది. అగ్రికల్చర్‌ ఎక్స్‌టెన్షన్‌ ఆఫీసర్ల పర్యవేక్షణలో ఈ భూముల కొలత ప్రక్రియ సాగుతోంది.

కేంద్రం సూచించిన అంశాల ఆధారంగానే..
వ్యవసాయ రంగంలో సంస్కరణలు అమలు చేస్తే ప్రోత్సాహకాలు ఇస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అందులో భాగంగా రాష్ట్రాలకు ఐదు షరతులను విధించింది. ‘అగ్రి స్టాక్‌ పేరట ప్రొక్యూర్‌మెంట్‌ కోసం కమిషనరేట్‌ ఏర్పాటు, ఎరువులు, విత్తనాలు, పంటల బీమా వివరాలు, ఎంఎస్పీ ధాన్యం సేకరణ మొదలైనవి వాటిలో ఉన్నాయి. అలాగే కేవలం యాప్‌ ద్వారా మాత్రమే ఎరువులను బుక్‌ చేసుకొని కొనుగోలు చేయాల్సి ఉంటుంది.

భూ రికార్డులను పూర్తిస్థాయిలో డిజిటలైజ్‌ చేయడంతో పాటు రైతు రిజిస్ట్రీల నిర్వహణకు వీలుగా సమగ్ర భూ సర్వేను చేపట్టాలని కేంద్రం సూచించింది. ఈ సర్వే ద్వారా రైతు వద్ద ఎంత భూమి ఉందన్నది స్పష్టమైన లెక్కలు వస్తే.. కేంద్రం ఇచ్చే పీఎం కిసాన్‌ సమ్మాన్‌ పథకంలో కేవలం అర్హులే లబ్ధి పొందేలా చూడవచ్చని కేంద్రం భావిస్తోంది. కేంద్ర ప్రభుత్వం సూచించిన ఈ ఐదు అంశాలలో భాగంగానే రాష్ట్రంలో ప్రస్తుతం భూముల సర్వే కొనసాగుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement