బాచుపల్లి ఘటన కేసును మానవ హక్కుల కమిషన్ సుమోటోగా స్వీకరణ | Human Rights Commission takes suo motu cognizance of Bachupally incident | Sakshi
Sakshi News home page

బాచుపల్లి ఘటన కేసును మానవ హక్కుల కమిషన్ సుమోటోగా స్వీకరణ

Nov 25 2026 8:34 PM | Updated on Nov 25 2026 8:34 PM

 Human Rights Commission takes suo motu cognizance of Bachupally incident

హైదరాబాద్: నగరంలోని బాచుపల్లిలో దినేష్ ఆరిక్ అపార్ట్‌మెంట్స్‌లో సెప్టిక్ ట్యాంక్/సీవేజ్ ట్రీట్‌మెంట్ ప్లాంట్ (STP) సంప్‌ను శుభ్రం చేస్తుండగా విషవాయువులు పీల్చడం వల్ల ముగ్గురు కార్మికులు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ విషాద ఘటనను తెలంగాణ మానవ హక్కుల కమిషన్ (TGHRC) చైర్‌పర్సన్ డా.జస్టిస్ షమీమ్ అక్తర్ నేతృత్వంలో సుమోటోగా విచారణకు స్వీకరించింది.

ఈ ఘటనకు సంబంధించిన వార్తలు సాక్షి, తదితర పత్రికల్లో ప్రచురితమయ్యాయి. తగిన భద్రతా చర్యలు, రక్షణ పరికరాలు లేకుండానే సెప్టిక్ ట్యాంక్/ఎస్టీపీ సంప్ శుభ్రపరిచే పనులు చేపట్టినట్లు వార్తా కథనాలు పేర్కొంటున్నాయి. ఈ క్రమంలో ముగ్గురు కార్మికులు ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. ఈ విషాద ఘటనపై కమిషన్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ప్రమాదకరమైన శుభ్రపరిచే పనుల సమయంలో పారిశుద్ధ్య కార్మికుల భద్రత, గౌరవం, రక్షణకు సంబంధించిన అంశాలతో పాటు నిర్దేశిత భద్రతా ప్రమాణాలను పాటించడంలో జరిగినట్లు ఆరోపిస్తున్న ఉల్లంఘనలపై తీవ్ర సందేహాలు తలెత్తుతున్నాయని కమిషన్ అభిప్రాయపడింది.

ఈ నేపథ్యంలో కమిషన్ కింది అధికారుల నుంచి వివరణాత్మక నివేదికలను కోరింది.
1. తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ ప్రభుత్వ కార్యదర్శి ఘటనకు దారితీసిన పరిస్థితులు, సెప్టిక్ ట్యాంకులు / ఎస్టీపీ సంప్‌ల శుభ్రపరిచే పనులకు వర్తించే భద్రతా చర్యలు నిబంధనలు, అపార్ట్‌మెంట్ యాజమాన్యం కాంట్రాక్టర్ బాధ్యతలు, నిర్వహించిన తనిఖీలు/విచారణ వివరాలు, బాధ్యులపై తీసుకున్న చర్యలు ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చేపట్టిన నివారణ చర్యలపై నివేదిక సమర్పించాలి.

2. మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా కలెక్టర్, జిల్లా మేజిస్ట్రేట్–ముగ్గురు కార్మికుల మృతికి దారితీసిన పరిస్థితులు, సంబంధిత శాఖల సమన్వయంతో చేపట్టిన విచారణ వివరాలు, మృతుల కుటుంబాలకు అందించిన లేదా అందించనున్న సహాయం, ఎక్స్‌గ్రేషియా పరిహారం, ఇతర సహాయ చర్యల వివరాలు, అలాగే బాధిత కుటుంబాల సంక్షేమం కోసం తీసుకున్న చర్యలపై నివేదిక సమర్పించాలి. సంబంధిత అధికారులు తమ నివేదికలను డిసెంబరు 22లోగా సమర్పించాలని కమిషన్ ఆదేశించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement