అమృత్‌సర్: పంజాబ్‌లో గురునానక్ జయంతి సందర్భంగా బుధవారం ఓ వ్యక్తి వినూత్న సేవా కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. లూధియానాలోని తాజ్‌పూర్ రోడ్డులో ఉన్న పెట్రోల్ బంకు వద్ద వాహనదారులకు ఉచితంగా పెట్రోల్, డీజిల్ పంపిణీ చేశారు. ఒక్కొక్కరికి రూ.300 వరకు విలువైన ఇంధనాన్ని అందించారు. ఈ విషయం తెలుసుకున్న ప్రజలు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకోవడంతో పెట్రోల్ బంకు వద్ద వాహనాల బారులు తీరాయి.
నగరానికి చెందిన పంకజ్ కుమార్ ప్రతి ఏడాది గురుపర్వ సందర్భంగా ఈ సేవా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. తన సంపాదనలో పదో వంతును ఇందుకోసం కేటాయిస్తున్నారు. ఏటా సుమారు రూ.50 వేల నుంచి రూ.60 వేల వరకు ఖర్చు చేస్తున్నారు. తొలుత గంటపాటు మాత్రమే ఉచిత ఇంధన పంపిణీ చేయాలని నిర్ణయించినప్పటికీ, ప్రజల నుంచి భారీ స్పందన రావడంతో దాన్ని గంటన్నర నుంచి రెండు గంటల వరకు పొడిగించారు.
అయితే, తొలుత నిర్ణయించిన రూ.60 వేల బడ్జెట్‌లో కొంత మొత్తం మిగిలిపోవడంతో పంకజ్ కుమార్ మరోసారి పంపిణీని ప్రారంభించారు. మిగిలిన మొత్తంతో ప్రజలకు ఉచితంగా పెట్రోల్ అందించారు. గురునానక్ దేవ్ బోధించిన సేవాభావాన్ని కొనసాగించడమే తన లక్ష్యమని ఆయన తెలిపారు. ప్రజలంతా ప్రేమ, సామరస్యంతో జీవించాలని, గురుపర్వ సందర్భంగా గురుద్వారాలను సందర్శించి గురుమహారాజ్ ఆశీస్సులు పొందాలని కోరారు.
ఈ కార్యక్రమాన్ని పెట్రోల్ బంకు యజమాని అజ్జు కూడా ప్రశంసించారు. ఎలాంటి ప్రచారాన్ని ఆశించకుండా సొంత డబ్బుతో ప్రజలకు సేవ చేయడం గొప్ప విషయమని కొనియాడారు. పంకజ్ కుమార్, ఆయన కుటుంబానికి ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు కలగాలని ఆకాంక్షించారు.
ఇదీ చదవండి: అమెరికా: సముద్రంలో కూలిన విమానం.. ఆరుగురి మృతి!


