భువనేశ్వర్: మానవ మూత్రం అంటే వ్యర్థం. కానీ అందులోని పోషకాలను సేకరించి మొక్కలకు ఉపయోగపడే ఎరువుగా మార్చవచ్చని రూర్కెలా ఎన్‌ఐటీ పరిశోధకులు నిరూపించారు. విద్యుత్ ఆధారిత నూతన సాంకేతికతతో మూత్రం నుంచి స్ట్రువైట్ అనే నెమ్మదిగా పోషకాలను విడుదల చేసే ఎరువును తయారు చేశారు. ప్రయోగశాల పరీక్షల్లో ఏకంగా 98 శాతానికిపైగా పాస్పరస్‌ను తిరిగి పొందడం ఈ పరిశోధనలోని విశేషం. ఇది కేవలం ఒక ప్రయోగశాల విజయమే కాదు. మానవ వ్యర్థాన్ని సమస్యగా కాకుండా విలువైన వ్యవసాయ వనరుగా మార్చే మార్గాన్ని ఈ ఆవిష్కరణ చూపిస్తోంది. ఒకవైపు వ్యర్థాల నిర్వహణకు పరిష్కారం లభిస్తే.. మరోవైపు పంటలకు అవసరమైన పోషకాలను తిరిగి పొందే అవకాశం ఏర్పడుతుంది.
వ్యర్థం నుంచి విలువైన వనరు
మొక్కల పెరుగుదలకు నైట్రోజన్, పాస్పరస్, పొటాషియం అత్యంత అవసరం. వీటితోనే ఎన్‌పీకే ఎరువులను తయారు చేస్తారు. అయితే సంప్రదాయ ఎరువుల తయారీకి భారీగా వనరులు, ముడి పదార్థాలు, డబ్బు ఖర్చవుతాయి. ముఖ్యంగా పాస్పరస్ వంటి పోషక వనరులు పరిమితంగా ఉండటంతో వాటిని వృథా చేయకుండా తిరిగి వినియోగంలోకి తీసుకురావడం భవిష్యత్ వ్యవసాయానికి కీలకం. ఇక్కడే ఎన్‌ఐటీ రూర్కెలా పరిశోధన ప్రాధాన్యం సంతరించుకుంది. మూత్రంలోని పాస్పరస్, నైట్రోజన్‌ను వేరు చేసి మళ్లీ ఉపయోగించుకోవచ్చా? అనే ప్రశ్నకు శాస్త్రవేత్తలు ప్రయోగాత్మక సమాధానం కనుగొన్నారు.
విద్యుత్‌తోనే ప్రక్రియ
సాధారణంగా మూత్రం నుంచి పోషకాలను వేరు చేయడానికి కొన్ని రసాయనాలను బయట నుంచి కలపాల్సి ఉంటుంది. దీని వల్ల ఖర్చు పెరుగుతుంది. ఎన్‌ఐటీ బృందం అభివృద్ధి చేసిన విధానంలో మాత్రం మెగీ్నíÙయం ఎలక్ట్రోడ్లను విద్యుత్‌తో పనిచేయించి అవసరమైన మెగీ్నíÙయం అయాన్లను అక్కడికక్కడే ఉత్పత్తి చేస్తారు. ఈ మెగీ్నషియం మూత్రంలోని ఫాస్ఫరస్, ఇతర పదార్థాలతో కలిసి స్ట్రువైట్ అనే ఘన పదార్థాన్ని ఏర్పరుస్తుంది. ఇదే తరువాత నెమ్మదిగా పోషకాలను విడుదల చేసే ఎరువుగా ఉపయోగపడుతుంది. సులభంగా చెప్పాలంటే.. మూత్రంలోని పోషకాలను బయటకు పారబోసే బదులు, వాటిని పట్టుకుని మళ్లీ పొలానికి పంపించే ప్రక్రియ ఇది.
98 శాతం పాస్పరస్ రికవరీ
ఐదు లీటర్ల సామర్థ్యం ఉన్న రియాక్టర్‌లో నిర్వహించిన పరీక్షల్లో 98 శాతానికిపైగా పాస్పరస్‌ను రికవర్ చేశారు. 35 లీటర్ల స్థాయిలోనూ 91 శాతానికిపైగా రికవరీ సాధించారు. ఆధునిక శాస్త్రీయ పరీక్షల ద్వారా సేకరించిన పదార్థం స్వచ్ఛమైన స్ట్రువైట్ అని నిర్ధారించారు. అంతేకాదు.. తులసి, అలసంద, బెండకాయ మొక్కలపై చేసిన ప్రయోగాల్లో ఈ ఎరువు పంటల పెరుగుదలకు ఉపయోగపడుతున్నట్లు గుర్తించారు. వాణిజ్యపరంగా లభించే ఎన్ పీకే ఎరువులతో పోలి్చనప్పుడు కూడా ఫలితాలు ఆశాజనకంగా ఉన్నాయని పరిశోధకులు తెలిపారు.
ఇంకా ఒక అడుగు ముందుకు..
అయితే పరిశోధన ఇంకా ప్రయోగశాల, పైలెట్ దశల్లోనే ఉంది. 35 లీటర్ల వ్యవస్థలో స్ట్రువైట్‌ను మాత్రమే ఉత్పత్తి చేయడం ప్రస్తుత ఖర్చులతో ఆర్థికంగా అంతగా లాభదాయకం కాదని పరిశోధకులు గుర్తించారు. అందుకే స్ట్రువైట్‌తోపాటు అమ్మోనియం సల్ఫేట్ వంటి ఇతర పోషకాలను కూడా ఒకేసారి రికవరీ చేసే సమీకృత విధానంపై దృష్టి పెట్టారు. 500 లీటర్ల పైలట్ వ్యవస్థపై నిర్వహించిన సాంకేతిక–ఆర్థిక అంచనాల్లో 6.55 ఏళ్లలో పెట్టుబడి తిరిగి వచ్చే అవకాశం, 13 శాతం అంతర్గత రాబడి ఉంటుందని అంచనా వేశారు. తదుపరి దశలో పొలాల్లో స్ట్రువైట్ ఎరువును పరీక్షించడం, నిరంతర ప్రవాహ వ్యవస్థలను అభివృద్ధి చేయడం, హరిత హైడ్రోజన్ రికవరీ వంటి అంశాలపై పరిశోధనలు చేయనున్నారు. వ్యర్థంగా కనిపించే ఒక పదార్థంలోనూ విలువైన వనరును గుర్తించి, దాన్ని వ్యవసాయానికి ఉపయోగపడే ఎరువుగా మార్చే దిశగా ఎన్‌ఐటీ రూర్కెలా పరిశోధకుల ప్రయత్నం సాగుతోంది. శాస్త్రం మన రోజువారీ జీవితంలోని సమస్యలకు ఎంత సృజనాత్మకమైన పరిష్కారాలు చూపగలదో చెప్పడానికి ఇది ఒక మంచి ఉదాహరణ.
రైతుకు ఎలా ఉపయోగం?
మానవ వ్యర్థాల నిర్వహణ భారం తగ్గుతుంది.
మూత్రంలోని విలువైన పోషకాలు వృథా కాకుండా తిరిగి ఉపయోగపడతాయి.
∙పాస్పరస్ వంటి పరిమిత వనరులపై
ఆధారపడటం తగ్గుతుంది.
సంప్రదాయ ఎరువుల తయారీపై అయ్యే ఖర్చును తగ్గించే అవకాశం ఉంటుంది.
స్థానికంగా పోషకాలను రికవరీ చేసి ఎరువుగా మార్చే చిన్నస్థాయి వ్యవస్థలను ఏర్పాటు చేయవచ్చు.
భవిష్యలో పట్టణ వ్యర్థాల నుంచి వ్యవసాయానికి అవసరమైన పోషకాలను తిరిగి అందించే చక్రీయ ఆర్థిక వ్యవస్థకు ఇది దోహదపడవచ్చు.


