చీజ్ తయారీకి ప్రాణాధారమైన ‘కేసిన్’ఉత్పత్తి సాధ్యమే అంటున్న పరిశోధనలు
జన్యుమార్పిడి పంటల సాగు ద్వారా చీజ్ తయారీపై పరిశోధనలు కొలిక్కి!
పశువుల ప్రమేయం లేకుండానే పాల ప్రొటీన్ల ఉత్పత్తికి మార్గం సుగమం
సోయా గింజల్లో ఆవు పాలలో ఉండే ఆల్ఫా ఎస్1, బీటా, కప్పా కేసిన్ ప్రోటీన్లు గుర్తింపు
సాక్షి, స్పెషల్ డెస్క్ : పాలు, జున్ను (చీజ్) వంటి డెయిరీ ఉత్పత్తుల తయారీ కోసం ఆవులు, గేదె పాలపైనే ప్రస్తుతం ఆధారపడుతున్నాం. అయితే ఆధునిక పరిశోధనల్లో పురోగతి నేపథ్యంలో పశువులపై ఆధారపడే పరిస్థితుల్లో వేగంగా మార్పులు వస్తున్నాయి. పశువుల ప్రమేయం లేకుండా, నేరుగా పంటల ద్వారా పండించే గింజల్లోనే స్వచ్ఛమైన పాల ప్రోటీన్లను ఉత్పత్తి చేసే ‘మాలిక్యులర్ ఫార్మింగ్’ఇందుకు అవకాశం కల్పిస్తోంది. ఈ సాంకేతికత అమెరికాలో ప్రయోగశాలలు దాటి పొలాల్లో వాణిజ్య సాగు దశకు చేరుకుంది. ముఖ్యంగా చీజ్ తయారీకి ప్రాణాధారమైన ‘కేసిన్’ప్రోటీన్‌ను పంట పొలాల్లో పండించడం సాధ్యమేనని రుజువైంది. ఈ మేరకు అంతర్జాతీయంగా బలమైన శాస్త్రీయ ఆధారాలు, నియంత్రణ సంస్థల నివేదికలు వెలుగులోకి వచ్చాయి.
సోయా గింజల్లో కేసిన్ ప్రోటీన్లు
అమెరికా వ్యవసాయ శాఖ (యూఎస్‌డీఏ) పరిధిలోని ‘యానిమల్ అండ్ ప్లాంట్ హెల్త్ ఇన్‌స్పెక్షన్ సర్వీస్’ఇటీవల జారీ చేసిన ఫెడరల్ రిజిస్టర్ నోటీసు మాలిక్యులర్ ఫార్మింగ్ విప్లవానికి తిరుగులేని సోపానమైంది. కాలిఫోర్నియాకు చెందిన ‘మోజ్జా ఫుడ్స్’సంస్థ జన్యుమార్పిడి ద్వారా రూపొందించిన ‘ఎంఎఫ్ 1786–1’సోయా గింజల్లో.. ఆవు పాలలో ఉండే ఆల్ఫా ఎస్1, బీటా, కప్పా కేసిన్ ప్రోటీన్లు చక్కగా ఉత్పత్తి అవుతున్నాయని యూఎస్‌డీఏ శాస్త్రవేత్తలు ధ్రువీకరించారు. సాధారణ సోయాబీన్స్ సాగులో మాదిరిగా ఈ పంట వల్ల పర్యావరణానికి ఎటువంటి తెగుళ్ల ముప్పు లేదని ప్రాథమిక నివేదిక స్పష్టం చేసింది.
చీజ్ తయారీకి కేసిన్ ఎందుకు కీలకం?
ఆవు పాలలోని మొత్తం ప్రోటీన్లలో 80 శాతం ‘కేసిన్’, 20 శాతం ‘వే’ఉంటాయి. ఇప్పటివరకు మార్కెట్లో ఉన్న సోయా, బాదం, ఓట్స్ పాలతో తయారు చేసిన వేగన్ చీజ్ వేడి చేసినప్పుడు అసలైన జున్నులా కరగదు, సాగదు. ఈ రెండు గుణాలు లేకపోవటానికి ప్రధాన కారణం అందులో కేసిన్ లేకపోవటమే. కేసిన్ అణువులు ప్రత్యేకమైన మైసెల్స్ నిర్మాణంతో ఉండటం వల్లే పాలకు తెల్లని రంగు, చీజ్‌కు ప్రత్యేకమైన రుచి, సాగే లక్షణం వస్తాయి.
అయితే మొక్కల్లోనే అచ్చమైన ఆవుపాల కేసిన్ జన్యువులను ప్రవేశపెట్టటం ద్వారా, పశువుల పాలు వాడకుండానే అసలైన మొజారెల్లా, చెడ్డార్ చీజ్ తయారు చేయటం సుసాధ్యమైందని శాస్త్రవేత్తలు తెలిపారు. కేవలం జన్యుమార్పిడి సోయాబీన్స్‌లో మాత్రమే కాకుండా ‘ఆల్పైన్ బయో’వంటి సంస్థలు పసుపు బఠానీల ద్వారా కూడా కేసిన్ ప్రోటీన్లను భారీ స్థాయిలో పండిస్తున్నాయి. ఐరోపా పరిశోధకులు బంగాళాదుంపల నుంచి పాల ప్రోటీన్లను వెలికితీసే ప్రయోగాల్లో ఇప్పటికే విజయం సాధించారు.
ఇవీ ప్రయోజనాలు
సంప్రదాయ పాడి పరిశ్రమతో పోలిస్తే పంటల ద్వారా కేసిన్ ప్రోటీన్లను ఉత్పత్తి చేయటం వల్ల 90 శాతం సాగునీటి వినియోగం, 80 శాతం భూమి అవసరం తగ్గుతాయని అంతర్జాతీయ నివేదికలు వెల్లడిస్తున్నాయి. పారిశ్రామిక పద్ధతుల్లో పశువుల పెంపకం ద్వారా వెలువడే మీథేన్ ఉద్గారాల సమస్య లేకపోవటం మరో ముఖ్యమైన అంశం. ఈ నేపథ్యంలో భవిష్యత్తులో తక్కువ ఖర్చుతోనే జన్యుమార్పిడి పంటల ద్వారా పాల ప్రోటీన్లు మార్కెట్‌లోకి అందుబాటులోకి వస్తాయని భావిస్తున్నారు.


