సామాన్యులపై మరోసారి పాల ధరల భారం పడనుంది. ప్రముఖ డెయిరీ సంస్థలు అమూల్, మదర్ డెయిరీ తమ పాల ధరలను పెంచుతున్నట్లు ప్రకటించాయి. నవంబర్ 12, గురువారం నుంచి కొత్త ధరలు అమల్లోకి రానున్నాయి. పాల రకాన్ని బట్టి లీటరుకు రూ.2 నుంచి రూ.4 వరకు ధరలు పెరగనున్నాయి.
అమూల్ బ్రాండ్‌తో పాల ఉత్పత్తులను విక్రయించే గుజరాత్ కో-ఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ (జీసీఎంఎంఎఫ్) తాజా ధరల సవరణను ప్రకటించింది. అమూల్ తాజా, గోల్డ్, శక్తి, టీ స్పెషల్ వంటి ప్రధాన వేరియంట్లపై ఈ పెంపు ప్రభావం చూపనుంది. కొత్త ధరల ప్రకారం అమూల్ తాజా టోన్డ్ పాలు లీటరు రూ.62కు, అమూల్ గోల్డ్ ఫుల్ క్రీమ్ పాలు రూ.80కు చేరనున్నాయి. అంటే వీటి ధరలు వరుసగా రూ.2, రూ.4 చొప్పున పెరగనున్నాయి.
ధరల పెంపునకు పశువుల దాణా, పాల సేకరణ, ప్రాసెసింగ్, ప్యాకేజింగ్, ఇంధన రవాణా ఖర్చులు పెరగడమే కారణమని అమూల్ వెల్లడించింది. తక్కువ, అసమాన వర్షపాతం వల్ల పశుగ్రాసం లభ్యతపైనా ప్రభావం పడిందని తెలిపింది. రైతులకు చెల్లించే పాల సేకరణ ధరలను గత ఏడాది కాలంలో సభ్య సంఘాలు 4-5 శాతం పెంచాయని పేర్కొంది. వినియోగదారుల నుంచి వచ్చే ఆదాయంలో సుమారు 80 శాతం 36 లక్షల మంది పాల ఉత్పత్తిదారులకు తిరిగి అందిస్తున్నట్లు వివరించింది.
ఇదిలా ఉండగా, ఢిల్లీ-ఎన్‌సీఆర్ ప్రాంతంలో ప్రముఖ పాల సరఫరా సంస్థ మదర్ డెయిరీ కూడా లీటరుకు రూ.2 నుంచి రూ.4 వరకు ధరలు పెంచింది. సవరించిన ధరలు నవంబర్ 12 నుంచి అమల్లోకి వస్తాయి. కొత్త ధరల ప్రకారం ఫుల్ క్రీమ్ పాలు లీటరు రూ.76కు (గతంలో రూ.72), ప్యాకెట్ టోన్డ్ పాలు రూ.62కు (రూ.60), డబుల్ టోన్డ్ పాలు రూ.56కు (రూ.54) చేరనున్నాయి. ఆవు పాలు లీటరు రూ.65కు (రూ.62), బల్క్ టోన్డ్ పాలు రూ.60కు (రూ.58) పెరగనున్నాయి.
మదర్ డెయిరీ రోజుకు ఢిల్లీ-ఎన్‌సీఆర్ ప్రాంతంలో సుమారు 35 లక్షల లీటర్ల పాలను విక్రయిస్తోంది. దేశవ్యాప్తంగా ఈ విక్రయాలు 50 లక్షల లీటర్లకు పైగా ఉన్నాయి. రైతుల నుంచి పాల సేకరణ ధరలు పెరగడంతోనే వినియోగదారులపై కొంత భారాన్ని మోపాల్సి వస్తోందని కంపెనీ వర్గాలు తెలిపాయి. ఈ ఏడాది మే 14 తర్వాత మదర్ డెయిరీ చేపడుతున్న రెండో ధరల సవరణ ఇది. అమూల్ కూడా ఈ ఏడాది మే తర్వాత తొలిసారిగా తాజా పాల ధరలను సవరిస్తోంది.


