అమూల్, మదర్ డెయిరీ సంస్థలు పాల ధరలను పెంచాయి. కొత్త ధరలు మే 14 నుంచి అమల్లోకి రానున్నాయని తాజాగా ఆయా సంస్థలు విడుదల చేసిన సర్క్యులర్ ద్వారా వెల్లడైంది. పెంచిన ధరలు ఫుల్ క్రీమ్ మిల్క్, టోన్డ్ మిల్క్, కౌ మిల్క్, బఫెలో మిల్క్, ప్రీమియం రకాల పాలపై కూడా వర్తిస్తాయి.
గుజరాత్ కోఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో విక్రయించే అమూల్ పాలు లీటర్‌కు రూ.1-2 వరకు పెరిగాయి. అమూల్ గోల్డ్ ఒక లీటర్ ప్యాక్ ధర రూ.68 నుంచి రూ.70కి చేరింది. అమూల్ లీటర్ పాలు రూ.55 నుంచి రూ.57కు చేరింది.
బఫెలో మిల్క్, కౌ మిల్క్, స్లిమ్ అండ్ ట్రిమ్, టీ స్పెషల్ రకాల ధరలను కూడా అమూల్ పెంచింది. అమూల్ బఫెలో మిల్క్ 500 మిల్లీ లీటర్ల ప్యాక్ ధర రూ.38 నుంచి రూ.39కి చేరింది. కౌ మిల్క్ 500 మిల్లీ లీటర్ల ప్యాక్ ధర రూ.29 నుంచి రూ.30కి చేరింది.
మదర్ డెయిరీ ధరలు ఇలా..
మదర్ డెయిరీ కూడా పలు స్టాక్ కీపింగ్ యూనిట్ల ధరలు పెంచింది. మే 13న డిస్ట్రిబ్యూటర్లు, రవాణాదారులకు పంపిన సర్క్యులర్‌లో ఈ విషయం తెలిపింది. కొత్త ధరల ప్రకారం మదర్ డెయిరీ బఫెలో మిల్క్ ఒక లీటర్ ప్యాక్ ధర రూ.75 నుంచి రూ.80కి పెరిగింది. 500 మిల్లీ లీటర్ల బఫెలో మిల్క్ ప్యాక్ ధర కూడా రూ.76 నుంచి రూ.80కి మారిందని సర్క్యులర్‌లో పేర్కొన్నారు.
మదర్ డెయిరీ ఫుల్ క్రీమ్ మిల్క్ ఒక లీటర్ ప్యాక్ ధర రూ.69 నుంచి రూ.72కి చేరింది. 500 మిల్లీ లీటర్ల ప్యాక్ ధర రూ.70 నుంచి రూ.72కి పెరిగింది. డబుల్ టోన్డ్ మిల్క్, టోన్డ్ మిల్క్, కౌ మిల్క్, ప్రో మిల్క్ రకాల ధరలు కూడా సంస్థ సవరించింది.
మే 13 రాత్రి నుంచి సరఫరా అయ్యే పాలపై ఈ కొత్త ధరలు వర్తిస్తాయని, మే 14 ఉదయం నుంచి మార్కెట్లో విక్రయాలు ఈ ధరల ప్రకారమే జరుగుతాయని సర్క్యులర్‌లో వెల్లడించారు. గత కొన్ని సంవత్సరాలుగా పాల సేకరణ ఖర్చులు, నిర్వహణ వ్యయాలు పెరుగుతున్న నేపథ్యంలో రెండు సంస్థలు పలుమార్లు పాల ధరలు సవరించాయి. ఈ ధరల పెంపు వినియోగదారులపై మరింత భారం మోపనుంది.
పశువుల మేత, రవాణా, ప్యాకేజింగ్, పాల సేకరణ ఖర్చులు పెరగడంతోనే ధరలు పెంచాల్సి వచ్చిందని పాల సంస్థలు గతంలో వెల్లడించాయి. 2022 నుంచి సహకార సంస్థలు, ప్రైవేట్ సంస్థలు రాష్ట్రాల వారీగా విడతల వారీగా ధరలు సవరించాయి. అమూల్, మదర్ డెయిరీ, నందిని వంటి సంస్థలు ప్రాంతాల వారీగా పాల సేకరణ పరిస్థితులు, ముడి ఖర్చుల ఆధారంగా వేర్వేరు సమయాల్లో ధరలు మార్చాయి.
భారత్ ప్రపంచంలోనే అత్యధిక పాలు ఉత్పత్తి చేసే దేశం. పట్టణ కుటుంబాల వినియోగంలో ప్యాకెట్ పాలు కీలక భాగంగా ఉన్నాయి. పాల సహకార సంస్థలు, ప్రైవేట్ సంస్థలు తీసుకునే ధరల నిర్ణయాలు పాల సేకరణ ఖర్చులు, సీజనల్ సరఫరా పరిస్థితులు, పంపిణీ వ్యయాలపై ఆధారపడి ఉంటాయి.


