బికనీర్: రాజస్థాన్‌లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. నీటి కుంటలో పడిన ఓ 14 ఏళ్ల బాలికను కాపాడేందుకు ప్రయత్నించిన మరో ముగ్గురు కూడా ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో ఇద్దరు మైనర్ సోదరులతో సహా మొత్తం నలుగురు మృతి చెందారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బికనీర్ జిల్లాలోని ఛక్ 9 ఏడబ్ల్యూఎం ప్రాంతంలో బుధవారం మధ్యాహ్నం ఈ ఘటన జరిగింది. ఆ ప్రాంతంలోని ఓ వ్యవసాయ పొలంలో నిర్మించిన నీటి కుంట వద్దకు 14 ఏళ్ల బాలిక ఇంటి అవసరాల కోసం నీటిని తెచ్చేందుకు వెళ్లింది. ఈ క్రమంలో కుంటలోని నీటిని తోడుతుండగా ప్రమాదవశాత్తు జారి ఆ నీటి కుంటలో పడిపోయింది.
వెంటనే అది గమనించిన ఆమె ఇద్దరు సోదరులు (వయసు 18, 16) ఆ బాలికను కాపాడేందుకు నీటిలోకి దూకారు. అయితే వారికి ఈత రాకపోవడంతో ముగ్గురూ నీటిలో చిక్కుకున్నారు. అనంతరం ఈ విషయం తెలుసుకున్న వారి 21 ఏళ్ల బంధువు కూడా వారిని రక్షించేందుకు నీటి కుంటలోకి దిగాడు. కానీ దురదృష్టవశాత్తూ ఆ బాలికతో పాటు కాపాడేందుకు వెళ్లిన ముగ్గురు కుటుంబీకులు నీటి కుంటలో మునిగి ప్రాణాలు కోల్పోయారు.
దాంతో సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని నలుగురి మృతదేహాలను బయటకు తీశారు. అనంతరం ఛత్తర్‌గఢ్‌లోని మార్చురీకి తరలించారు. జరిగిన ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందడంతో ఆ గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.
ఇదీ చదవండి: కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు


