పికప్‌ వాహనంతో భార్యపైకి దూసుకెళ్లి తొక్కించి చంపిన భర్త | Rajasthan Man Kills Wife After Argument Over Selling Cow To Clear Debt | Sakshi
Sakshi News home page

పికప్‌ వాహనంతో భార్యపైకి దూసుకెళ్లి తొక్కించి చంపిన భర్త

Nov 5 2026 3:37 PM | Updated on Nov 5 2026 3:54 PM

 Rajasthan Man Kills Wife After Argument Over Selling Cow To Clear Debt

జైపూర్‌: రాజస్థాన్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. అప్పులు తీర్చేందుకు ఆవును అమ్మాలని భర్త భావించగా.. భార్య అందుకు నిరాకరించింది. దీంతో భార్యాభర్తల మధ్య వాగ్వాదం జరిగింది. ఆగ్రహానికి గురైన భర్త పికప్‌ వాహనంతో భార్యపైకి దూసుకెళ్లి తొక్కించి చంపాడు. అనంతరం పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి తానే హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు.

మృతురాలిని చుంకీ దేవి(52)గా గుర్తించారు. నిందితుడు ఆమె భర్త చున్నీలాల్ కుమావత్ (56). ఈ ఘటన బుధవారం సాయంత్రం సికార్ జిల్లా కోలిడా గ్రామంలో జరిగింది. ప్రాథమిక దర్యాప్తు ప్రకారం.. చున్నీలాల్‌కు సుమారు రూ.15 లక్షల అప్పు ఉంది. ఆర్థిక సాయం చేయాలని తన ఇద్దరు కుమారులను అడిగినా.. వారి ఆదాయం పరిమితంగా ఉండటంతో సాయం చేయలేకపోయారు.

బుధవారం మధ్యాహ్నం 3 గంటల నుంచి 4 గంటల మధ్య చున్నీలాల్ ఇంటికి తిరిగొచ్చాడు. అప్పులు తీర్చేందుకు ఆవును అమ్మాలని భార్యకు చెప్పాడు. అయితే ఆమె అందుకు అభ్యంతరం చెప్పడంతో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. దీంతో కోపోద్రిక్తుడైన చున్నీలాల్ ఇంటికి సుమారు 100 మీటర్ల దూరంలో భార్యపైకి తన పికప్‌ వాహనాన్ని నడిపించాడు. నిందితుడు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు.

"చున్నీలాల్ ఆవును అమ్మాలనుకున్నాడు. అయితే అతడి భార్య ఆ నిర్ణయాన్ని వ్యతిరేకించింది. ఆమె నిరాకరించడంతో ఆగ్రహానికి గురైన అతడు ఇంటికి సుమారు 100 మీటర్ల దూరంలో ఆమెపైకి వాహనాన్ని నడిపించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ప్రాథమిక దర్యాప్తులో నిందితుడికి సుమారు రూ.15 లక్షల అప్పులు ఉన్నట్లు తేలింది. డబ్బు విషయంపై కుటుంబ సభ్యులతో తరచూ గొడవపడేవాడు" అని స్టేషన్ హౌస్ ఆఫీసర్ రాకేశ్ కుమార్ మీనా తెలిపారు.

నిందితుడి పెద్ద కుమారుడు తన భార్యతో కలిసి ఉత్తరప్రదేశ్‌లో పనిచేస్తున్నాడు. చిన్న కుమారుడికి ఏడాది క్రితమే వివాహమైంది. హత్య జరిగిన సమయంలో అతడు పని నిమిత్తం ఖాటూలో ఉన్నాడు. ఇద్దరు కుమారులూ టైల్స్ వేసే పనిలో ఉన్నారు. పోలీసులు చున్నీలాల్‌ను అదుపులోకి తీసుకున్నారు. వైద్య పరీక్షల అనంతరం తదుపరి చర్యలు తీసుకోనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement