కేరళ: బంగారం స్మగ్లింగ్ కోసం ఓ మహిళ తన కిడ్నాప్ నాటకానికి తెరలేపింది. చివరకు పోలీసుల విచారణలో అసలు విషయం బయటపడటంతో ఆమెతో పాటు ఉన్న మరో నలుగురు అరెస్ట్ అయ్యారు. కేరళలోని కరిపూర్ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
తలశేరికి చెందిన ప్రియాంక అనే సదరు మహిళ దుబాయ్ నుంచి సుమారు 18 సవర్ల బంగారంతో విమానాశ్రయానికి చేరుకుంది. అయితే ఆమె ఆ బంగారాన్ని మట్టన్నూర్‌కు చెందిన జబీర్‌కు అప్పగించాల్సి ఉంది. కానీ ఆ బంగారాన్ని అతడికి ఇవ్వకుండా కాజేయాలని ప్రియాంక ప్లాన్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఇందుకోసం కన్నూరుకు చెందిన శ్రీలాల్, ప్రిన్స్, సుభిత్‌లతో కలిసి తన కిడ్నాప్ జరిగినట్లు నాటకమాడింది.
ఈ క్రమంలో నీలిరంగు బాలెనో కారులో ప్రియాంకను తీసుకెళ్తుండగా ఓ వ్యక్తి ఆ కారు వెనుక పరుగెత్తడాన్ని విమానాశ్రయంలోని ఓ పోలీస్ అధికారి గమనించారు. దాంతో ఆయన కిడ్నాప్ జరుగుతోందని భావించి వెంటనే కారును వెంబడించారు. దాదాపు 12 కిలోమీటర్ల పాటు పోలీసులకు, కారులోని వ్యక్తులకు మధ్య ఛేజింగ్ జరిగింది. పోలీసు జీపును తప్పించుకునేందుకు కారు వెనక్కి వెళ్లి పారిపోయే ప్రయత్నం చేసినప్పటికీ చివరకు పోలీసులు వారిని పట్టుకున్నారు.
ఆ కారు వెనుక పరుగెత్తిన వ్యక్తి బంగారం కోసం ఎదురుచూస్తున్న జబీర్‌గా గుర్తించారు. ప్రియాంక, జబీర్‌తో పాటు శ్రీలాల్, ప్రిన్స్, సుభిత్‌లను పోలీసులు అరెస్టు చేశారు. ఈ కుట్ర గురించి ప్రియాంక భర్తకు కూడా తెలియదని, పిల్లలతో సహా అతడిని కూడా తెలియకుండానే ఈ వ్యవహారంలో భాగం చేసినట్లు పోలీసులు వెల్లడించారు.
ఇదీ చదవండి: వేల కోట్ల లావాదేవీలు.. మహదేవ్ బెట్టింగ్ యాప్ కో-ఫౌండర్ అరెస్ట్


