కుటుంబ సభ్యులతో హాయిగా పండుగ ఎంజాయ్ చేయాలని అందరికీఉంటుంది.అందులోనూ దీపావళి అంటే ఆ సందడే వేరు కదా. కానీ కొంతమంది ఉద్యోగులకు వారి వారి బాధ్యతల రీత్యా ఇది సాధ్యం కాక పోవచ్చు. అయితే కెరీర్‌పార్ట్‌నర్ (CareerPartner) అనే సంస్థ ఈ ఏడాది దీపావళి సందర్బంగా ప్రకటించిన సెలవులు ఇపుడు చర్చనీయాంశంగామారాయి. లింక్డ్‌న్‌లో పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. ఇంతకన్నా దీపావళి కానుక ఏముంటుంది అంటూ నెటిజన్లు తెగ ప్రశంసిస్తున్నారు. అదేంటో తెలుసుకోవాలంటే.. ఈ కథనం పూర్తిగా చదవాలి మరి.
కెరీర్ పార్ట్‌నర్ (CareerPartner) అనే సంస్థకు చెందిన అసోసియేట్ రిక్రూట్‌మెంట్ కన్సల్టెంట్ శివానీ సింగ్, తన కంపెనీ దీపావళి సెలవుల షెడ్యూల్‌ను లింక్డ్‌ఇన్ (LinkedIn) వేదికగా పంచుకున్నారు. దీపావళి పండుగను కంపెనీ అనేక సెలవులతో పాటు మూడు రోజులు వర్క్ ఫ్రమ్ హోమ్ (WFH) సౌకర్యాన్ని ప్రకటించడం మరో విశేషం.
నవంబర్ నెలకు సంబంధించిన సెలవుల వివరాలను తెలియజేస్తూ సంస్థ పంపిన అంతర్గత ఈమెయిల్ స్క్రీన్‌షాట్‌ను శివానీ షేర్ చేశారు. ఇందులో ఐదు పండుగ సెలవులు, రెండు వారంతపు సెలవులు (వీకెండ్స్) వరుసగా మూడు రోజులు వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకునే అవకాశం కూడా ఉంది.
ఉద్యోగులకు పండుగ శుభాకాంక్షలు తెలుపుతూ ప్రారంభమైన ఆ ఈమెయిల్‌లో, "ఈ దీపావళికి మేము సంతోషంతో పాటు సెలవులను కూడా అందిస్తున్నాం! ఎందుకంటే అద్భుతంగా పనిచేసే ఉద్యోగులకు మంచి విశ్రాంతి కూడా లభించాలి" అని పేర్కొన్నారు.
సెలవుల వివరాలు
నవంబర్ 6 (శుక్రవారం): ధన్‌తేరస్ (ధనత్రయోదశి) పండుగ సెలవు
నవంబర్ 7 (శనివారం): ఛోటీ దీపావళి (వారాంతపు సెలవు)
నవంబర్ 8 (ఆదివారం): దీపావళి (వారాంతపు సెలవు)
నవంబర్ 9 (సోమవారం): గోవర్ధన్ పూజ (పండుగ సెలవు)
నవంబర్ 10 (మంగళవారం): భాయి దూజ్ (పండుగ సెలవు)
నవంబర్ 11, 12, 13 (బుధ, గురు, శుక్రవారాలు): తక్కువ పనిభారంతో (Light workload) కూడిన వర్క్ ఫ్రమ్ హోమ్ (WFH) రోజులు
నవంబర్ 14, 15 (శని, ఆదివారాలు): సాధారణ వారాంతపు సెలవులు
ఫెస్టివ్ వైబ్స్..కుటుంబంతో సంబరంగా గడిపే సమయం, స్వీట్స్, చక్కటి విశ్రాంతి ’’ అని పేర్కొంటూ, "కష్టపడి పనిచేయండి, అంతకంటే ఘనంగా వేడుకలు జరుపుకోండి, మరింత ఉత్సాహంతో తిరిగి రండి!" అని అంటూ కంపెనీ దీపావళి శుభాకాంక్షలు తెలిపింది.
ఈ వివరాలను లింక్డ్‌ఇన్‌లో పంచుకున్న శివానీ, "ఇంత సంతోషం.. ఇన్ని సెలవులు! నిజంగా ఆనంద భాష్పాలు వస్తున్నాయి! ఉద్యోగుల సంతోషాన్ని ఇంత కీలకంగా పరిగణించే కంపెనీలో భాగమైనందుకు చాలా సంతోషంగా ఉంది. దీపావళిని మరింత ప్రత్యేకం చేసినందుకు థ్యాంక్యూ కెరీర్‌పార్ట్‌నర్!" అని రాసుకొచ్చారు. ఈ పోస్ట్‌పై పలువురు నెటిజన్లు రకరకాలుగా స్పందించారు.
నెటిజన్ల స్పందన
"మాకు నవంబర్‌లో ఆదివారం తప్ప వేరే సెలవే లేదు. ఇలాంటి సెలవులు వచ్చినవారు చాలా అదృష్టవంతులు" అని ఒకరు కామెంట్ చేశారు."దయచేసి నన్ను కూడా మీ కంపెనీలో చేర్చుకోండి (Hire me please)" అని మరొకరు రాశారు. "నిజంగా అదృష్టవంతులు" అని ఇంకొకరు స్పందించారు.
"ఆనంద భాష్పాలు రమ్మంటే రావా మరి.. న్యాయమే" అని ఒక నెటిజన్ కామెంట్ చేశారు.


