ప్యాలెస్, అంబారీ, సింహాసనం మావే | Pramoda Devi Wadiyar Slams Govt | Sakshi
Sakshi News home page

ప్యాలెస్, అంబారీ, సింహాసనం మావే

Nov 5 2026 11:16 AM | Updated on Nov 5 2026 11:18 AM

Pramoda Devi Wadiyar Slams Govt

విఖ్యాత మైసూరు అంబావిలాస్‌ ప్యాలెస్‌లోని రాజకుటుంబీకులకు, రాష్ట్ర కాంగ్రెస్‌ ప్రభుత్వానికి మధ్య మాటల యుద్ధం తగ్గకపోగా పెరుగుతోంది. ఒకరు ఒక మాటంటే, మరొకరు రెండు మాటలంటూ వెళ్తున్నారు. తాజాగా రాజవంశీకురాలు ప్రమోదాదేవి ఒడెయార్‌ సర్కారుకు పలు హెచ్చరికలు చేశారు.

మైసూరు(కర్ణాటక): బంగారు అంబారీ, రత్నఖచిత సింహాసనం ప్రభుత్వానికి అప్పగించలేదని, అవి రాజప్రసాదం వద్దే సురక్షితంగా ఉన్నాయని రాజవంశీకురాలు ప్రమోదాదేవి తెలిపారు. బుధవారం ఆమె ప్యాలెస్‌లో మీడియా సమావేశం నిర్వహించి పలు అంశాలను ప్రస్తావించారు. ప్యాలెస్‌లో ప్రజల సందర్శనకు వదిలిన కొన్ని భాగాలు తప్ప, నివాస ప్రదేశం తమ ఆధీనంలోనే ఉందని చెప్పారు. 1976లో ప్యాలెస్, అందులోని వస్తువుల్లో ప్రభుత్వానికి ఏమేం అప్పగించారో జాబితా ఉందన్నారు. 

బంగారు అంబారీ, సింహాసనం ఎప్పటికీ ప్రభుత్వపరం కావని ఆమె తెలిపారు. ప్యాలెస్‌ను ప్రభుత్వం వశపరచుకోవడం చట్టవ్యతిరేకమని కోర్టు తీర్పులు వచ్చాయని వివరించారు. ప్యాలెస్‌ అనేది ప్రభుత్వ ఔదార్యం అనేందుకు వీలు లేదన్నారు.  ప్రభుత్వం కాని, అధికారులు కాని ఇందులో జోక్యం చేసుకునేందుకు ప్రయత్నిస్తే ఊరుకునేది లేదని ఆమె హెచ్చరిస్తూ పలు కోర్టు తీర్పులను చదివి వినిపించారు. అంబారీని సర్కారు వాడుకున్నందుకు గౌరవధనం చెల్లిస్తారని, అది బాడుగ కాదని అన్నారు.  

చర్చలకు రావచ్చు  
ప్యాలెస్‌ లోపల, ఆవరణలోని ఆలయాల్లో పూజలు, వేడుకలకు కోర్టులు ఎలాంటి స్టే ఇవ్వలేదని ప్రమోదాదేవి చెప్పారు. గత పత్రికాగోష్టిలో తాను ప్రభుత్వాన్ని దూషించలేదన్నారు. పోలీసుల వల్ల కలిగిన గందరగోళాన్ని తెలియజేసి సలహా ఇచ్చానన్నారు. తనతో చర్చించడానికి సిద్ధమని సీఎం డీకే శివకుమార్‌ చెప్పడాన్ని స్వాగతిస్తానన్నారు. ఈ సమస్యలను తదుపరి దసరా వరకు కొనసాగించబోనని తెలిపారు. 

ఇదీ చదవండి: జనసేనకు ఘోర పరాభవం


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement