భోపాల్: నటి, మాజీ మిస్ పుణె త్విషా శర్మ మృతి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో నిందితురాలిగా ఉన్న ఆమె అత్త గిరిబాల సింగ్‌కు మధ్యప్రదేశ్ హైకోర్టు బెయిల్ నిరాకరించింది. వాట్సాప్ సంభాషణలు, సీసీటీవీ ఫుటేజ్ సహా పలు కీలక ఆధారాలను మరింత లోతుగా పరిశీలించాల్సి ఉందని స్పష్టం చేసింది. ముఖ్యమైన డిజిటల్, ఫోరెన్సిక్ నివేదికలు ఇంకా అందాల్సి ఉండటంతో ప్రస్తుతం బెయిల్ మంజూరు చేయలేమని న్యాయస్థానం పేర్కొంది.
ఐదు నెలలకే విషాదం
త్విషా శర్మకు, సమర్థ్ సింగ్‌కు 2025 డిసెంబర్‌లో వివాహమైంది. పెళ్లయిన ఐదు నెలలకే.. మే 12న నోయిడాలోని భర్త ఇంట్లో త్విషా మృతిచెందింది. ఆమె మృతిపై తల్లిదండ్రులు పలు ఆరోపణలు చేశారు. అత్త గిరిబాల సింగ్, భర్త సమర్థ్ సింగ్ మానసిక వేధింపులకు గురిచేశారని, అదనపు కట్నం కోసం వేధించారని ఆరోపించారు. ఈ కేసును సీబీఐ దర్యాప్తు చేస్తోంది.
వాట్సాప్ చాట్స్‌పై కోర్టు దృష్టి
గిరిబాల సింగ్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌ను జస్టిస్ అజయ్ కుమార్ నిరంకారి విచారించారు. అక్టోబర్ 26న విచారణ అనంతరం తీర్పును రిజర్వ్ చేశారు. తాజాగా బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించారు. ఘటనకు ముందు త్విషా తన కుటుంబ సభ్యులతో జరిపిన వాట్సాప్ సంభాషణలు, దర్యాప్తులో సేకరించిన సీసీటీవీ ఫుటేజ్ కీలకంగా మారాయని కోర్టు అభిప్రాయపడింది.
ఇంకా అందని ఫోరెన్సిక్ నివేదికలు
మృతురాలి మొబైల్ ఫోన్ నుంచి డేటా వెలికితీసే ప్రక్రియ ఇంకా పూర్తికాలేదని కోర్టు పేర్కొంది. డీవీఆర్‌లోని డేటాను కూడా ఫోరెన్సిక్ పరీక్షకు పంపినట్లు తెలిపింది. సీసీటీవీ ఫుటేజ్ నిరంతరంగా రికార్డయిందా? అందులోని దృశ్యాలు అసలైనవేనా? అనే అంశాలను పరిశీలించాల్సి ఉందని స్పష్టం చేసింది. ఈ నివేదికలు అందిన తర్వాత దర్యాప్తులో మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని పేర్కొంది.
గిరిబాల సింగ్ డైరీలో..
ఘటన అనంతరం గిరిబాల సింగ్ పలువురు ఉన్నత పదవుల్లో ఉన్నవారిని సంప్రదించినట్లు ఆమె డైరీలో ఆధారాలున్నాయని కోర్టు ప్రస్తావించింది. ఈ పరిణామాల వెనుక ఉన్న పరిస్థితులను కూడా దర్యాప్తులో పరిశీలించాల్సి ఉందని తెలిపింది. కాగా తనకు ఎలాంటి నేరపూరిత ఉద్దేశం లేదన్న నిందితురాలి వాదనను కోర్టు ప్రస్తుత దశలో అంగీకరించలేదు. ఆరోపణల తీవ్రత, ఘటనకు ముందు జరిగిన పరిణామాలు, సీసీటీవీ ఫుటేజ్, పోస్టుమార్టం నివేదికలు, ఇంకా కొనసాగుతున్న దర్యాప్తును పరిగణనలోకి తీసుకుంది. బీఎన్ఎస్ఎస్ సెక్షన్ 193(9) కింద తదుపరి దర్యాప్తు కొనసాగుతున్నందున గిరిబాల సింగ్‌కు బెయిల్ మంజూరు చేయడం లేదని స్పష్టం చేసింది. దీంతో ఆమె దీపావళిని జైల్లోనే జరుపుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఇదీ చదవండి: కిలో ‘దీపావళి స్వీట్’ రూ.1.11 లక్షలు.. బంగారంతో పోటీ!


