జైపూర్: దీపావళి పండుగ వేళ స్వీట్ల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. రాజస్థాన్‌లోని జైపూర్‌లోని ఓ స్వీట్ షాప్‌లో కిలో మిఠాయి ధర రూ.1.11 లక్షలు పలుకుతూ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. 24 క్యారెట్ల బంగారం, వెండితో తయారుచేసిన ఈ ప్రత్యేక మిఠాయిలు ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. జైపూర్‌లోని వైశాలీ నగర్‌లో ఉన్న 'త్యోహార్' స్వీట్ షాప్ ఈ ఖరీదైన మిఠాయిలను విక్రయిస్తోంది.
ఇందులో స్వర్ణ మిఠాయి ఒక్కటి ధర రూ.1,111 కాగా, చాందీ భస్మ్ భారత్ ఒక్కటి రూ.1,150గా ఉంది. ఈ ప్రత్యేక స్వీట్ల ధరలు కిలోకు రూ.45 వేల నుంచి రూ.1.11 లక్షల వరకు ఉన్నాయి. ఈ స్వీట్లలో ‘స్వర్ణ భస్మ్ పాక్’ను 24 క్యారెట్ల తినదగిన బంగారంతో తయారుచేస్తున్నారు. ‘చాందీ భస్మ్ పాక్’లో వెండి భస్మాన్ని ఉపయోగిస్తున్నారు. బంగారు మిఠాయిపై బంగారు రేకులతో ప్రత్యేకంగా అలంకరణ చేస్తున్నారు. కుంకుమపువ్వు, ఖరీదైన చిల్గోజా పప్పులను కూడా ఇందులో వినియోగిస్తున్నారు.
ఈ మిఠాయి తయారీ వెనుక చార్టర్డ్ అకౌంటెంట్ నుంచి వ్యాపారవేత్తగా మారిన అంజలి జైన్ ఉన్నారు. ఆయుర్వేదం, భారతీయ సంప్రదాయ వంటకాలపై ఉన్న ఆసక్తితో ఈ ప్రత్యేక స్వీట్లను రూపొందించినట్లు ఆమె తెలిపారు. వీటిని సాధారణ స్వీట్ల మాదిరిగా కాకుండా ఆభరణాల పెట్టెల్లో ప్యాక్ చేస్తున్నారు. ఈ స్వీట్‌లో నిజమైన తినదగిన బంగారాన్ని ఉపయోగిస్తున్నట్లు అంజలి వెల్లడించారు. దీనినే ‘స్వర్ణ భస్మం’ అని పిలుస్తారని తెలిపారు. జైన ఆలయం నుంచి సేకరించిన బంగారు రేకులను స్వీట్‌పై ఉపయోగిస్తున్నామని, అవి జంతువులకు హాని కలిగించని విధంగా తయారైనవని పేర్కొన్నారు. భారతీయ ఆయుర్వేద సంప్రదాయాలను ప్రతిబింబించేలా ఈ మిఠాయిలను రూపొందించినట్లు వివరించారు.
ఇదీ చదవండి: ‘గంగాజలాల’పై భారత్ కఠిన వైఖరి.. ‘బంగ్లా’కు కొత్త షరతులు!


