బంగారం డిమాండ్.. WGC రిపోర్ట్ | Gold Rush Slows Down in India Despite Festive and Wedding Season | Sakshi
Sakshi News home page

బంగారం డిమాండ్.. WGC రిపోర్ట్

Nov 4 2026 7:32 AM | Updated on Nov 4 2026 7:42 AM

Gold Rush Slows Down in India Despite Festive and Wedding Season

భారీ రేటుతో పాటు దిగుమతి సుంకాల పెంపు కూడా తోడవడంతో జూలై-సెప్టెంబర్‌ త్రైమాసికంలో దేశీయంగా బంగారానికి డిమాండ్‌ గణనీయంగా పడిపోయింది. గతేడాది ఇదే వ్యవధిలో నమోదైన 230 టన్నులతో పోలిస్తే 29 శాతం తగ్గి 162 టన్నులకు పరిమితమైంది. ఈ నేపథ్యంలో పూర్తి సంవత్సరానికి గాను పసిడి డిమాండ్‌ 625-675 టన్నుల స్థాయిలో ఉంటుందనే అంచనాలు నెలకొన్నాయి.

పసిడి డిమాండ్‌ ధోరణులపై వరల్డ్‌ గోల్డ్‌ కౌన్సిల్‌ (డబ్ల్యూజీసీ) రూపొందించిన నివేదికలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. దీని ప్రకారం పరిమాణంపరంగా పసిడి డిమాండ్‌ తగ్గినప్పటికీ  విలువపరంగా మాత్రం 3 శాతం పెరిగింది. రూ. 2,35,090 కోట్ల నుంచి రూ. 2,41,900 కోట్లకు చేరింది. సమీక్షాకాలంలో బంగారం సగటు ధర ఔన్సుకి (31.1 గ్రాములు) 4,262 డాలర్లుగా (10 గ్రాములకు రూ. 1,48,891) ఉండగా, గతేడాది ఇదే వ్యవధిలో 3,457 డాలర్లుగా (రూ. 1,02,287) నమోదైంది (దిగుమతి సుంకాలు, జీఎస్‌టీ కాకుండా).

పండగలు, పెళ్లిళ్ల దన్ను..
భారీ రేట్ల వల్ల కొనుగోలు ధోరణులపై ప్రభావం పడినప్పటికీ భారత్‌లో పసిడికి ఆదరణ కొనసాగుతోందని జూలై-సెప్టెంబర్ త్రైమాసిక గణాంకాలు సూచిస్తున్నాయని డబ్ల్యూజీసీ రీజనల్‌ సీఈవో (ఇండియా) సచిన్‌ జైన్‌ తెలిపారు. ఇటు ధర.. అటు దీర్ఘకాలిక విలువను బేరీజు వేసుకుంటూనే బంగారం కొనుగోళ్లకు వినియోగదారులు ప్రాధాన్యమిస్తున్నారని పేర్కొన్నారు.

ముఖ్యంగా జ్యుయలరీ విభాగంలో ఈ ధోరణి కనిపిస్తోందని, డిమాండ్‌ 20 శాతం తగ్గినప్పటికీ విలువ మాత్రం 16 శాతం పెరిగిందని జైన్‌ చెప్పారు. జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో ప్రధానంగా దక్షిణాదిలో పండుగలు, పెళ్ళిళ్లు మొదలైన సందర్భాలతో బంగారానికి డిమాండ్‌ నెలకొందని వివరించారు. సరఫరాపరంగా చూస్తే అధికారికంగా దిగుమతులు గణనీయంగా పడిపోగా, ప్రాథమిక సమాచారాన్ని బట్టి అనధికారిక మార్గాల్లో సరఫరా పెరిగినట్లు తెలుస్తోందని జైన్‌ చెప్పారు.

రాబోయే పండుగలు, పెళ్లిళ్ల సీజన్‌లో పసిడికి మళ్లీ డిమాండ్‌ ఏర్పడవచ్చని ఆయన పేర్కొన్నారు. ‘అధిక స్థాయిలో ధరలు ఉండటమనేది కొనుగోలు ధోరణులను ప్రభావితం చేయడం కొనసాగుతుంది. కాకపోతే వినియోగదారులు తేలికపాటి ఆభరణాలు కొనడం, పాత బంగారాన్ని మార్చుకోవడంలాంటి పద్ధతుల ద్వారా కొనుగోళ్లను కొనసాగించవచ్చు‘ అని జైన్‌ వివరించారు.

భారత్‌పై డబ్ల్యూజీసీ నివేదికలో మరిన్ని కీలకాంశాలు..

  • గతేడాది జూలై-సెప్టెంబర్‌ క్వార్టర్లో 0.2 టన్నుల పసిడిని కొన్న రిజర్వ్‌ బ్యాంక్‌ ఈసారి మాత్రం కొనుగోళ్లు చేపట్టలేదు.

  • కడ్డీలు, నాణేలకు డిమాండ్‌ 40% పడిపోయింది. 91.6 టన్నుల నుంచి 55 టన్నులకు తగ్గింది.

  • గోల్డ్‌ ఈటీఎఫ్‌లకు (ఎక్స్చేంజ్ ట్రేడెడ్‌ ఫండ్స్‌) మొత్తం డిమాండ్‌ 10.7 టన్నుల నుంచి 5.3 టన్నులకు క్షీణించింది.

  • రీసైకిల్‌ చేసిన బంగారం పరిమాణం 21.8 టన్నుల నుంచి 12 శాతం క్షీణించి 19.2 టన్నులకు పరిమితమైంది.

  • నికరంగా పసిడి దిగుమతులు 211.9 టన్నుల నుంచి 46 శాతం తగ్గి 114.1 టన్నులకు పరిమితమయ్యాయి.

అంతర్జాతీయంగాను అదే తీరు..
➤ ధరపై అనిశ్చితి నెలకొనడంతో గ్లోబల్‌గా పసిడికి డిమాండ్‌ 1 శాతం క్షీణించి 1,369 టన్నులకు తగ్గింది. విలువ మాత్రం 22 శాతం పెరిగి 188 బిలియన్‌ డాలర్లకు చేరింది. పుత్తడి సగటు ధర ఔన్సుకి (31.1 గ్రాములు) 4,262 డాలర్లు పలికింది.
➤ ఆభరణాలకు డిమాండ్‌ 17 శాతం క్షీణించి 313 టన్నులకు పడిపోయింది. కరోనా పరిస్థితులు నెలకొన్న 2020 మూడో త్రైమాసికంలో నమోదైన 331 టన్నుల కన్నా ఇది తక్కువ. అయితే, తేలికపాటి ఆభరణాలకు డిమాండ్‌ నెలకొంది. గ్లోబల్‌గా జ్యుయలరీ డిమాండ్‌ విలువపరంగా 43 బిలియన్‌ డాలర్లకు ఎగిసింది.
➤ ప్రాంతీయంగా చూస్తే చైనాలో ఆభరణాల డిమాండ్‌ 22 శాతం క్షీణించింది. అమెరికా, పశ్చిమాసియా, సౌదీ అరేబియాలో కూడా నెమ్మదించింది.
➤ గోల్డ్‌ ఈటీఎఫ్‌లలోకి మాత్రం పెట్టుబడులు పెరిగాయి. సాధారణంగా పసిడి ధర ఎప్పుడు తగ్గినా, ఈటీఎఫ్‌ల నుంచి పెట్టుబడుల ఉపసంహరణ జరుగుతుంది. కానీ ఈసారి అందుకు భిన్నంగా పెట్టుబడులు రావడం గమనార్హం.
➤ సెంట్రల్‌ బ్యాంకులు, ఇతరత్రా సంస్థలు నికరంగా 321 టన్నుల (42 శాతం అధికం) మేర పసిడి నిల్వలను పెంచుకున్నాయి. చైనా, పోలాండ్, చెక్‌ రిపబ్లిక్‌ ఈ విషయంలో ముందున్నాయి. 
➤ విభాగాలవారీగా చూస్తే టెక్నాలజీ రంగంలో పసిడికి డిమాండ్‌ 3 శాతం పెరిగి 85 టన్నులకు, ఎల్రక్టానిక్స్‌ సెగ్మెంట్లో డిమాండ్‌ 5 శాతం పెరిగి 72 టన్నులకు చేరింది.
➤ గనుల నుంచి ఉత్పత్తి 3 శాతం పెరిగి త్రైమాసిక ప్రాతిపదికన 1,071 టన్నుల రికార్డు స్థాయికి ఎగిసినప్పటికీ, పసిడి రీసైక్లింగ్‌ 8 శాతం క్షీణించి 314 టన్నులకు తగ్గడంతో మొత్తం బంగారం సరఫరా 1 శాతం నెమ్మదించి 1,369 టన్నులకు పరిమితమైంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement