భారతీయులకు బంగారం అంటే ఎంత ప్రేమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మూడు నెలల్లో ఏకంగా రూ.2.42 లక్షల కోట్ల విలువైన బంగారాన్ని కొనేశారు. దేశంలో బంగారం కొనుగోళ్లు తగ్గినా.. దాని కోసం వెచ్చించిన మొత్తం మాత్రం పెరిగింది. అధిక ధరలు, దిగుమతి సుంకం పెంపు ప్రభావంతో 2026 జూలై–సెప్టెంబర్ త్రైమాసికంలో భారత బంగారం డిమాండ్ గత ఏడాదితో పోలిస్తే 29 శాతం తగ్గి 162.5 టన్నులకు పరిమితమైంది. అయితే, విలువ పరంగా కొనుగోళ్లు 3 శాతం పెరిగి రూ.2.42 లక్షల కోట్లకు చేరుకున్నాయి. వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ (WGC) విడుదల చేసిన తాజా నివేదిక ఈ విషయాన్ని వెల్లడించింది.
గత ఏడాది ఇదే సమయంలో 229.8 టన్నుల బంగారం కొనుగోలు కాగా.. ఈసారి పరిమాణం తగ్గింది. అయినప్పటికీ, ధరల పెరుగుదల కారణంగా కొనుగోళ్ల విలువ రూ.2.35 లక్షల కోట్ల నుంచి రూ.2.42 లక్షల కోట్లకు పెరిగింది. త్రైమాసికంలో అంతర్జాతీయంగా బంగారం సగటు ధర ఔన్సుకు 4,262 డాలర్లుగా ఉండగా, దేశీయంగా 10 గ్రాముల ధర సగటున రూ.1,48,891గా నమోదైంది. ఇది గత ఏడాదితో పోలిస్తే 45 శాతం అధికం.
ఆభరణాల కొనుగోళ్లలో 20 శాతం పతనం
భారత బంగారం డిమాండ్‌లో కీలకమైన ఆభరణాల కొనుగోళ్లు 20 శాతం తగ్గి 99.9 టన్నులకు చేరాయి. అయితే వీటి విలువ మాత్రం 16 శాతం పెరిగి రూ.1.49 లక్షల కోట్లకు చేరింది. అధిక ధరల కారణంగా వినియోగదారులు తక్కువ బరువున్న ఆభరణాలు కొనడం, పాత బంగారాన్ని మార్చుకుని కొత్తవి తీసుకోవడం వంటి పద్ధతులను అనుసరిస్తున్నారని డబ్ల్యూజీసీ తెలిపింది.
ఇక పెట్టుబడి కోసం చేసే బంగారం కొనుగోళ్లు కూడా తగ్గాయి. బంగారు కడ్డీలు, నాణేల డిమాండ్ 40 శాతం క్షీణించి 55 టన్నులకు చేరింది. గోల్డ్ ఈటీఎఫ్‌లలో పెట్టుబడులు 50 శాతం తగ్గి 5.3 టన్నులుగా నమోదయ్యాయి. మరోవైపు, ఆర్‌బీఐ ఈ త్రైమాసికంలో బంగారం కొనుగోలు చేయలేదు.
ఆరేళ్ల కనిష్ఠానికి డిమాండ్?
2026 ఏడాది మొత్తానికి దేశంలో బంగారం డిమాండ్ 625–675 టన్నుల మధ్య ఉండొచ్చని డబ్ల్యూజీసీ అంచనా వేస్తోంది. ఇది 2020 తర్వాత అత్యల్ప స్థాయికి చేరే అవకాశం ఉంది. పండుగలు, పెళ్లిళ్ల సీజన్ నేపథ్యంలో డిసెంబర్ త్రైమాసికంలో కొనుగోళ్లు పుంజుకోవచ్చని భావిస్తున్నప్పటికీ.. అధిక ధరలు, గ్రామీణ ప్రాంతాల్లో కొనుగోలు శక్తి తగ్గడం రికవరీకి అడ్డంకిగా మారవచ్చని తెలిపింది.
ఇదీ చదవండి: బ్యాంక్ ఛార్జీల పెంపు.. యాక్సిస్ కస్టమర్లకు అలర్ట్!
దేశంలోని ప్రధాన నగరాల్లో నేటి బంగారం, వెండి ధరలు ఈ కింద చూడొచ్చు..
(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. కచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.)


