ఆఫీసులో, పెద్ద పెద్ద భవనాల్లో నాలుగు గోడల మధ్య పనిచేయడం చాలా మందికి బోరింగ్‌గా ఉంటుంది. ఇంటి నుంచో, ఆఫీస్‌లోని నాలుగు గోడల మధ్యనో కాకుండా.. పచ్చని చెట్లు, చెరువు గట్టున పని చేస్తే ఎంత బాగుంటుంది!! ఇదిగో అలా పని చేసుకోవాలనుకునే వారికి దుబాయ్ కొత్త అవకాశాన్ని అందిస్తోంది. నగరంలోని అల్ బర్షా పాండ్ పార్క్‌లో తొలి ‘వర్క్ ఫ్రమ్ పార్క్’ కేంద్రాన్ని దుబాయ్ మునిసిపాలిటీ ప్రారంభించింది. ఫ్రీలాన్సర్లు, రిమోట్ ఉద్యోగులు, హైబ్రిడ్ విధానంలో పనిచేసేవాళ్లు ప్రకృతి ఒడిలోనే తమ పనులు చేసుకునేలా ఈ ప్రత్యేక వర్క్‌స్పేస్‌ను ఏర్పాటు చేసింది.
దుబాయ్ మునిసిపాలిటీ, ఫ్లెక్సిబుల్ వర్క్‌స్పేస్ సంస్థ లెట్స్‌వర్క్, నిర్మాణ సంస్థ గ్రూప్ అమానా భాగస్వామ్యంతో ఈ ప్రాజెక్టును చేపట్టాయి. చెరువు, జాగింగ్ ట్రాక్, పిల్లల ఆట స్థలం వంటి సౌకర్యాలు ఉండటంతో అల్ బర్షా పాండ్ పార్క్‌ను తొలి కేంద్రంగా ఎంపిక చేసినట్లు దుబాయ్ పబ్లిక్ పార్క్స్ అధికారులు తెలిపారు.
బయట ఉచితం.. లోపల మాత్రం రుసుము
ఈ కేంద్రంలో సందర్శకులకు రెండు రకాల పని వసతులు అందుబాటులో ఉన్నాయి. పార్క్ పరిసరాల్లోని బహిరంగ సీటింగ్ ప్రాంతాలు, పెర్గోలాలు, పైకప్పుపై ఏర్పాటు చేసిన డెస్క్‌ల వద్ద ఉచితంగా కూర్చుని పనిచేసుకోవచ్చు. వీటికి ముందస్తు బుకింగ్ అవసరం లేదు. వై-ఫై, విద్యుత్ సదుపాయాలు కూడా అందుబాటులో ఉంటాయి.
ఎండ, వేడి నుంచి రక్షణతో కూడిన వాతావరణంలో పని చేయాలనుకునేవారి కోసం ఇండోర్ కో-వర్కింగ్ స్థలం ఏర్పాటు చేశారు. ఇక్కడ రోజువారీ పాస్ ధర 50 దిర్హమ్‌లుగా (సుమారు రూ.1,200) నిర్ణయించారు. ఈ పాస్‌తో రోజంతా పని చేసుకోవడంతో పాటు ఉచితంగా కాఫీ కూడా పొందవచ్చు. ఇండోర్ కేంద్రం ఉదయం 8 నుంచి రాత్రి 8 గంటల వరకు పనిచేస్తుంది.
మీటింగ్ రూంలు, ప్రైవేట్ ఆఫీసులూ..
వ్యక్తిగతంగా పనిచేసేవారితో పాటు చిన్న సంస్థలు, బృందాల అవసరాలనూ ఈ కేంద్రం తీర్చనుంది. ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది కలిసి చర్చించుకునేందుకు సమావేశ గదులు అందుబాటులో ఉన్నాయి. వీటి అద్దె గంటకు 200 దిర్హమ్‌ల నుంచి ప్రారంభమవుతుంది. ఎక్కువ కాలం పని చేయాలనుకునేవారి కోసం ప్రత్యేక డెస్క్‌లు, ప్రైవేట్ ఆఫీస్ సూట్‌లను నెలవారీ ప్రాతిపదికన అద్దెకు తీసుకునే అవకాశం ఉంది.
ఇండోర్ వర్క్‌స్పేస్‌లను లెట్స్‌వర్క్ వెబ్‌సైట్, యాప్ లేదా వాట్సాప్ ద్వారా బుక్ చేసుకోవచ్చు. పార్కులో పనిచేస్తూనే పిల్లలు ఆడుకోవడాన్ని పర్యవేక్షించవచ్చని, పని మధ్యలో నడక, వ్యాయామం వంటి కార్యకలాపాలతో సమయాన్ని గడపవచ్చని నిర్వాహకులు చెబుతున్నారు.
ఇతర పార్కులకూ విస్తరణ?
ఈ కేంద్రాన్ని మాడ్యులర్ నిర్మాణ పద్ధతిలో అభివృద్ధి చేశారు. నిర్మాణంలో ఎక్కువ భాగాన్ని ముందుగానే ఫ్యాక్టరీలో పూర్తి చేసి, అనంతరం పార్కులో అమర్చడంతో పనులు వేగంగా పూర్తయ్యాయి. సందర్శకులకు ఇబ్బందులు తగ్గించడంతో పాటు పచ్చని ప్రదేశాన్ని ఎక్కువగా వినియోగించుకునేలా ఈ విధానం ఉపయోగపడింది.
దుబాయ్ మునిసిపాలిటీ ప్రస్తుతం ఈ కేంద్రానికి వచ్చే సందర్శకుల స్పందనను పరిశీలిస్తోంది. ఆదరణను బట్టి నగరంలోని మరిన్ని పార్కుల్లోనూ ఇలాంటి వర్క్ స్పేస్‌లను ఏర్పాటు చేసే అవకాశముంది. దుబాయ్ 2040 పట్టణ ప్రణాళికలో భాగంగా పార్కులను కేవలం వినోద, వ్యాయామ ప్రదేశాలుగానే కాకుండా.. పని, సమావేశాలు, సామాజిక అనుసంధానానికి ఉపయోగపడే బహుళ ప్రయోజన కేంద్రాలుగా మార్చడం ఈ కార్యక్రమం లక్ష్యం.
ఇదీ చదవండి: ఓ టేబుల్ క్లీనర్ పెట్టిన బిజినెస్.. నేడు రూ.1,700 కోట్ల వ్యాపారం!


