ఢిల్లీ కాలుష్యం: 50 శాతం ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోమ్! | 50 per cent work from-home in Delhi NCR offices | Sakshi
Sakshi News home page

ఢిల్లీ కాలుష్యం: 50 శాతం ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోమ్!

Oct 31 2026 12:51 PM | Updated on Oct 31 2026 12:57 PM

50 per cent work from-home in Delhi NCR offices

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీతో పాటు పరిసర ప్రాంతాల్లో వాయు కాలుష్యాన్ని నియంత్రించేందుకు అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. నవంబర్ 5 నుంచి 20 వరకు ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల్లో 50 శాతం సిబ్బందికి మాత్రమే ప్రత్యక్షంగా పనిచేసేందుకు అనుమతించనున్నారు. మిగిలిన ఉద్యోగులు ఇంటి నుంచే విధులు నిర్వహించాల్సి ఉంటుంది. ఢిల్లీతో పాటు గురుగ్రామ్, ఫరీదాబాద్, సోనిపట్, ఘజియాబాద్, నోయిడా జిల్లాల్లో ఈ నిబంధనలు అమల్లోకి రానున్నాయి. ఈ మేరకు వాయు నాణ్యత నిర్వహణ కమిషన్ (సీఏక్యూఎం) అక్టోబర్ 30న ఉత్తర్వులు జారీ చేసింది.

నిర్మాణ, కూల్చివేత పనులపైనా కఠిన ఆంక్షలు విధించారు. ఢిల్లీ-ఎన్‌సీఆర్‌ పరిధిలో దుమ్ము, ధూళి వెలువడే నిర్మాణ కార్యకలాపాలను నిలిపివేయనున్నారు. హైవేలు, రోడ్లు, ఫ్లైఓవర్లు, విద్యుత్ ప్రసార లైన్లు, పైప్‌లైన్లు, టెలికమ్యూనికేషన్ పనులకూ ఈ ఆంక్షలు వర్తిస్తాయి. అయితే రైల్వేలు, మెట్రో, విమానాశ్రయాలు, ఆసుపత్రులు, నీటి సరఫరా, పారిశుద్ధ్యం, జాతీయ భద్రత, రక్షణ రంగానికి సంబంధించిన అత్యవసర ప్రాజెక్టులకు మినహాయింపు ఇచ్చారు. వర్క్ ఫ్రమ్ హోమ్ సాధ్యం కాని పారిశ్రామిక సంస్థలు, అత్యవసర సేవలకు కూడా వెసులుబాటు కల్పించారు.

నవంబర్‌లో ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో వాయు కాలుష్యం తీవ్ర స్థాయికి చేరే అవకాశముండటంతో ముందస్తు జాగ్రత్తగా ఈ చర్యలు చేపట్టినట్లు సీఏక్యూఎం వెల్లడించింది. 2018 నుంచి 2025 మధ్య నమోదైన గణాంకాల ప్రకారం నవంబర్ మొదటి, రెండో వారాల్లో కాలుష్యం అత్యంత ప్రమాదకర స్థాయికి చేరుతున్నట్లు గుర్తించారు. చలికాలం ప్రారంభమవడంతో గాలి వేగం తగ్గడం, వాహనాల పొగ, పరిశ్రమల ఉద్గారాలు, పంట వ్యర్థాల దహనం నుంచి వెలువడే పొగ వాతావరణంలోనే నిలిచిపోవడం కాలుష్య తీవ్రతకు కారణమవుతున్నాయి. ఇప్పటికే గురుగ్రామ్‌లో ఉదయం వేళల్లో పొగమంచు కనిపిస్తోంది.

ఈ ఆంక్షల అమలును పర్యవేక్షించే బాధ్యతను ఢిల్లీతో పాటు ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, హర్యానా ప్రభుత్వాలకు అప్పగించారు. స్థానిక అధికారులు, పోలీసులు, కాలుష్య నియంత్రణ మండలి బృందాలు తనిఖీలు నిర్వహించనున్నాయి. నవంబర్ 5 నుంచి ప్రత్యేక ఫ్లయింగ్ స్క్వాడ్లు రంగంలోకి దిగుతాయి. నిబంధనలు ఉల్లంఘించే నిర్మాణ సంస్థలు, కార్యాలయాలపై భారీ జరిమానాలు విధించనున్నారు. శీతాకాలంలో కాలుష్య ముప్పును ముందుగానే అడ్డుకోవడమే ఈ చర్యల ప్రధాన ఉద్దేశం. 

ఇదీ చదవండి: ఇండియా కూటమికి ఢిల్లీ పోలీసుల షాక్!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement