5 స్టార్‌ హోటల్‌ స్విమ్మింగ్‌ పూల్‌లో షాక్‌ : ఇద్దరు విదేశీయులు దుర్మరణం | Two Foreigners Die Of Electrocution At Bengaluru 5-Star Hotel Swimming Pool | Sakshi
Sakshi News home page

5 స్టార్‌ హోటల్‌ స్విమ్మింగ్‌ పూల్‌లో షాక్‌ : ఇద్దరు విదేశీయులు దుర్మరణం

Oct 31 2026 12:26 PM | Updated on Oct 31 2026 12:48 PM

Two Foreigners Die Of Electrocution At Bengaluru 5-Star Hotel Swimming Pool

సాక్షి, బెంగళూరు: బెంగళూరులోని ఒక ప్రముఖ ఫైవ్-స్టార్ హోటల్‌లో జరిగిన విషాద ఘటన దిగ్భ్రాంతి రేపింది. విద్యుత్ షాక్ కారణంగా పూల్‌లో ఉన్న ఇద్దరు విదేశీయులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. నగరంలోని 'కాన్‌రాడ్' (Conrad) అనే ఫైవ్-స్టార్ హోటల్‌లో శుక్రవారం సాయంత్రం  ఈ దుర్ఘటన   చోటుచేసుకుంది.

ఏం జరిగింది?
నగరంలోని 24 అంతస్తుల లగ్జరీ హోటల్ 'కాన్‌రాడ్' (హిల్టన్ గ్రూప్‌కు చెందినది) మూడో అంతస్తులో ఉన్న స్విమ్మింగ్ పూల్‌లో కొందరు ఈత కొడుతుండగా ఈ ప్రమాదం జరిగింది. స్విమ్మింగ్ పూల్‌లో విద్యుత్ షాక్ కొట్టి ఇద్దరు విదేశీయులు ప్రాణాలు కోల్పోగా, వారిని కాపాడేందుకు ప్రయత్నించిన మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.

మృతుల్లో  ఒకర్ని జర్మనీకి చెందిన  అలెగ్జాండర్ మాక్సిమిలియన్ థిస్ (57)గా గుర్తించారు. ఈయన లుఫ్తాన్సా ఎయిర్‌లైన్స్‌లో క్రూ మెంబర్‌గా పనిచేస్తున్నారు.  మరొకరు స్లోవేకియా దేశస్థుడు యురాజ్ హోర్వాత్ (45). ఇతను ప్రముఖ ఐటీ సంస్థ ఐబీఎమ్‌ (IBM)లో ప్రాజెక్ట్ మేనేజర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.

లుఫ్తాన్సా విచారం
మృతుల కుటుంబం, బంధువులు మరియు స్నేహితులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నామని, వారి గోప్యతకు గౌరవంగా ప్రమాదం లేదా మృతుడి గురించి  వివరాలు వెల్లడించబోమని లుఫ్తాన్సా ప్రకటించింది.

పూల్‌లో చిక్కుకున్న వారిని కాపాడేందుకు అమెరికాకు చెందిన మ్యాథ్యూ డిసాంటిస్ (41) అనే హోటల్ అతిథితో పాటు, రాహుల్ తివారీ (28) అనే హోటల్ పూల్ అటెండెంట్ వెంటనే స్పందించారు. అయితే ప్రయత్నంలో వారికి కూడా  షాక్ తగిలి గాయపడ్డారు. వీరిద్దరినీ వెంటనే మణిపాల్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారి పరిస్థితి విషమంగా ఏమీ లేదని, ప్రాణాపాయం తప్పిందని వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి లోతుగా విచారణ జరుపుతున్నారు. విద్యుత్ లీకేజీకి అసలు కారణాలేంటనే దానిపై ఆధారాలు సేకరిస్తున్నారు.

హోటల్  యాజమాన్యం స్పందన?
మరోవైపు, ఈ దారుణంపై హోటల్ యాజమాన్యం ఇప్పటివరకు అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. అయితే, శనివారం ఉదయం హోటల్ వెబ్‌సైట్‌లో స్విమ్మింగ్ పూల్‌ను "అక్టోబర్ 31 నుండి నవంబర్ 30 వరకు నిర్వహణ (maintenance) కారణాల వల్ల మూసివేస్తున్నాం" అంటూ ఒక నోటీసు పెట్టారు.

కాగా పాపులర్‌ హోటల్‌లో జరిగిన ఈ ఘటన యాజమాన్యం నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది అంటూ తీవ్ర నిరసనలు, అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒక్కో గదికి రోజుకు రూ. 25వేలకు పైనే ఛార్జ్ చేసే ఇటువంటి అంతర్జాతీయ ఫైవ్ స్టార్ హోటల్‌లో సురక్షతా ప్రమాణాల లోపాలపై విమర్శలు చెలరేగాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement