న్యూఢిల్లీ: ప్రముఖ పంజాబీ గాయకుడు, నటుడు దిల్జిత్ దోసాంజ్ మరోసారి వార్తల్లో నిలిచారు. ఢిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియంలో శుక్రవారం నిర్వహించిన సంగీత విభావరిలో ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. గతంలో తాను చేసిన ‘ఐయామ్ యాన్ ఆర్టిస్ట్ బ్రో’ వ్యాఖ్యలపై నెలకొన్న వివాదానికి పరోక్షంగా స్పందించారు. ‘పంజాబీలకు ఎలా పోరాడాలో నేర్పించకండి’ అంటూ చేసిన వ్యాఖ్యలు అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తించాయి.
పాత వ్యాఖ్యలతో మొదలైన వివాదం
కొన్ని నెలల క్రితం ఇన్‌స్టాగ్రామ్ లైవ్‌లో ఢిల్లీలో జరిగిన కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) నిరసనపై స్పందించాలని దిల్జిత్‌ను కోరినట్లు సమాచారం. దీనికి ఆయన ‘నన్ను నిరసనలు, రాజకీయాలకు దూరంగా ఉంచండి. నేను ఒక కళాకారుడిని, రాజకీయ నాయకుడిని కాదు’ అని బదులిచ్చినట్లు కథనాలు వెలువడ్డాయి. ఈ వ్యాఖ్యలపై సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే అసంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం రాజధానిలో నిరసన తెలుపుతున్న విద్యార్థులపై పోలీసుల చర్యలను దిల్జిత్ విమర్శించారు.
వేదికపై దిల్జిత్ పరోక్ష వ్యాఖ్యలు
శుక్రవారం ఢిల్లీ కచేరీలో అభిమానులను ఉద్దేశించి దిల్జిత్ మాట్లాడుతూ.. ‘నేను ఒక కళాకారుడిని బ్రో.. మీ అందరినీ ప్రేమిస్తున్నాను. నేను మౌనంగా ఉంటున్నాను కాబట్టి అలాగే ఉండనివ్వండి. మీ అందరికీ నా మద్దతు ఉంది. పంజాబీలకు ఎలా పోరాడాలో నేర్పించకండి’ అని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా ఎవరినీ నేరుగా ప్రస్తావించకపోయినా, గత వివాదంపై పరోక్షంగా స్పందించినట్లు చర్చ జరుగుతోంది. ఈ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.
‘చిన్న తమ్ముడిగా భావించి వదిలేయండి’
దిల్జిత్ వ్యాఖ్యలపై అభిజీత్ దీప్కే ఇన్‌స్టాగ్రామ్‌లో స్పందించారు. గతంలో ఆయన చేసిన వ్యాఖ్యలు తనను కొంత బాధించాయని, అయినప్పటికీ గాయకుడిపై తనకున్న అభిమానం ఏమాత్రం తగ్గలేదని పేర్కొన్నారు. ఈ ఏడాది మేలో అమెరికాలోని చికాగోలో దిల్జిత్ కచేరీకి కూడా వెళ్లినట్లు గుర్తుచేశారు. ఆయన ధైర్యం, నిజాయతీ, భారతీయ సంగీతాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన తీరును ప్రశంసించారు. ఒక అభిప్రాయ భేదం వల్ల గౌరవం తగ్గదని చెబుతూ.. ‘చిన్న తమ్ముడిగా భావించి ఈ విషయాన్ని వదిలేయండి’ అంటూ ‘మిట్టీ పావో’ అని విజ్ఞప్తి చేశారు.
ఇదీ చదవండి: ఇందిర 42వ వర్ధంతి: ఓ చిన్నారి లేఖకు స్ఫూర్తిదాయక సమాధానం!


