పట్నా: బిహార్ పోలీస్ కానిస్టేబుల్ నియామక పరీక్ష పేపర్ లీక్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కీలక చర్యలు చేపట్టింది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న కౌశిక్ కుమార్ కర్‌కు సంబంధం ఉన్న ఐదు స్థిరాస్తులను జప్తు చేసింది. వీటి విలువ సుమారు రూ.2.01 కోట్లుగా ఉన్నట్లు వెల్లడించింది. ఎన్‌సీ ప్రింట్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో ఈ ఆస్తులు ఉన్నట్లు ఈడీ తెలిపింది. పరీక్ష పత్రాల ముద్రణ కాంట్రాక్టు పొందడం, కంపెనీ గుర్తింపును దాచిపెట్టడం, నకిలీ కంపెనీల ద్వారా నగదు లావాదేవీల్లో అక్రమాలకు పాల్పడినట్లు దర్యాప్తులో ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి.
2023లో నిర్వహించిన బిహార్ పోలీస్ కానిస్టేబుల్ నియామక పరీక్షకు లక్షలాది మంది నిరుద్యోగ యువత హాజరయ్యారు. ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనే ఆశతో పరీక్ష రాసిన అభ్యర్థులకు పేపర్ లీక్ ఆరోపణలు తీవ్ర నిరాశ కలిగించాయి. ఈ వ్యవహారం అప్పట్లో తీవ్ర వివాదానికి దారితీసింది. పరీక్ష పేపర్ లీక్ వ్యవహారం వెలుగులోకి వచ్చి దాదాపు మూడేళ్లు గడిచిన నేపథ్యంలో ఈడీ తాజాగా రంగంలోకి దిగింది. కేసులో నిందితుడికి సంబంధం ఉన్న ఐదు స్థిరాస్తులను తాత్కాలికంగా అటాచ్ చేసింది.
ఈడీ వెల్లడించిన వివరాల ప్రకారం.. జప్తు చేసిన ఐదు ఆస్తులు ఎన్‌సీ ప్రింట్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో ఉన్నాయి. పరీక్ష పత్రాల ముద్రణ కాంట్రాక్టు పొందిన వ్యవహారంలో ఈ కంపెనీ పాత్రపై దర్యాప్తు కొనసాగుతోంది. కంపెనీ అసలు గుర్తింపును దాచిపెట్టినట్లు కూడా ఆరోపణలు ఉన్నాయి. పరీక్ష పత్రాల ముద్రణ కాంట్రాక్టుకు సంబంధించిన ఆర్థిక లావాదేవీల్లో నకిలీ కంపెనీలను ఉపయోగించినట్లు ఈడీ దర్యాప్తులో ఆరోపణలు బయటపడ్డాయి. ఈ కంపెనీల ద్వారా డబ్బు బదిలీల్లో అక్రమాలు జరిగినట్లు అనుమానిస్తోంది.
ఇదీ చదవండి: ‘నీట్’ గురించి మాట్లాడొద్దంటూ నటుడికి బెదిరింపులు!


