దీపావళి ఎఫెక్ట్: 50 శాతానికి పైగా పెరిగిన విమాన ఛార్జీలు! | Deepavali Rush Sends Bengaluru Airfares Soaring Over 50% | Sakshi
Sakshi News home page

దీపావళి ఎఫెక్ట్: 50 శాతానికి పైగా పెరిగిన విమాన ఛార్జీలు!

Oct 31 2026 9:01 AM | Updated on Oct 31 2026 9:01 AM

Deepavali Rush Sends Bengaluru Airfares Soaring Over 50%

బెంగళూరు: దీపావళి పండుగ వేళ సొంతూళ్లకు వెళ్లాలనుకునే ప్రయాణికులకు విమాన టికెట్ల ధరలు షాక్ ఇస్తున్నాయి. పండుగకు ముందే బెంగళూరు నుంచి వివిధ నగరాలకు వెళ్లే దేశీయ విమానాల ఛార్జీలు భారీగా పెరిగాయి. గత ఏడాదితో పోలిస్తే కొన్ని మార్గాల్లో 50 శాతానికి పైగా ధరలు పెరగగా.. ఢిల్లీకి వెళ్లే విమాన టికెట్ల ధరలు ఏకంగా 78 శాతం మేరకు పెరిగాయి. పండుగ రద్దీకి తోడు విమాన ఇంధన ధరల పెరుగుదల కూడా ఛార్జీలపై ప్రభావం చూపుతోంది.

పట్నా, వారణాసికి భారీ ధరలు
నవంబర్ మొదటి వారంలో బెంగళూరు నుంచి పట్నాకు వెళ్లే వన్‌వే విమాన టికెట్ ధరలు రూ.18,083 నుంచి రూ.26,053 వరకు ఉన్నాయి. వారణాసికి వెళ్లేందుకు రూ.13,807 నుంచి రూ.26,663 వరకు చెల్లించాల్సి వస్తోంది. జైపూర్‌కు రూ.12,224 నుంచి రూ.15,379 వరకు, ఢిల్లీకి రూ.14,694 నుంచి రూ.23,659 వరకు ధరలు పలుకుతున్నాయి.

ముందుగా బుక్ చేసినా తప్పని భారం
నెల రోజుల ముందే టికెట్లు బుక్ చేసుకున్నప్పటికీ ప్రయాణికులకు భారం తప్పడం లేదు. సాధారణంగా దీపావళి సమయంలో బెంగళూరు నుంచి ఢిల్లీకి ఒక్కొక్కరికి రూ.8 వేల వరకు ఖర్చయ్యేదని, ఈసారి మాత్రం రూ.13 వేలకు పైగా చెల్లించాల్సి వచ్చిందని వర్థూర్‌కు చెందిన అన్ష్ ఠాకూర్ తెలిపారు. గతంతో పోలిస్తే దాదాపు 50 శాతం అదనంగా చెల్లించాల్సి వచ్చిందని చెప్పారు.

ఢిల్లీలో 78 శాతం పెరుగుదల
గత ఏడాది దీపావళి వారంలో బెంగళూరు నుంచి ఢిల్లీకి సగటు వన్‌వే టికెట్ ధర రూ.9,264గా ఉంది. ఈ ఏడాది నవంబర్ 7వ తేదీకి ఆ ధర రూ.16,469కు చేరింది. అంటే దాదాపు 78 శాతం పెరిగింది. బెంగళూరు-పట్నా మార్గంలోనూ నవంబర్ 7వ తేదీ టికెట్ ధర రూ.26,053గా ఉంది. అక్టోబర్‌లో రద్దీ తక్కువగా ఉన్న రోజుల్లో ఇదే మార్గంలో రూ.11 వేల నుంచి రూ.13 వేల మధ్య టికెట్లు లభించేవి.

ప్రయాణాలను వాయిదా వేసుకుంటున్న జనం
టికెట్ ధరలు పెరగడంతో కొందరు ప్రయాణికులు తమ పర్యటనలను వాయిదా వేసుకోవాలని భావిస్తున్నారు. చివరి నిమిషంలో టికెట్లు బుక్ చేసుకుంటే ధరలు తగ్గుతాయని ఆశించామని, కానీ పెరుగుతూనే ఉన్నాయని ఆర్టీ నగర్‌కు చెందిన సాక్షి శెట్టి తెలిపారు. పట్నాలోని భర్త కుటుంబ సభ్యుల వద్దకు వెళ్లాలని భావించినప్పటికీ, అధిక ధరల కారణంగా ప్రయాణంపై పునరాలోచిస్తున్నట్లు చెప్పారు.

విమాన ఇంధన ధరల ప్రభావం
పండుగ రద్దీతో పాటు విమాన ఇంధనం (ఏటీఎఫ్) ధరల పెరుగుదల కూడా విమానయాన సంస్థలపై భారం పెంచుతోంది. అక్టోబర్‌లో ఏటీఎఫ్ ధర లీటరుకు రూ.16 పెరిగి సుమారు రూ.137కు చేరింది. ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లోనూ వరుసగా ధరలు పెరిగాయి. విమానయాన సంస్థల నిర్వహణ ఖర్చుల్లో ఇంధన వాటా 30 నుంచి 40 శాతం వరకు ఉంటుందని స్పియర్ ట్రావెల్ మీడియా అండ్ ఎగ్జిబిషన్స్ డైరెక్టర్ రోహిత్ హంగల్ తెలిపారు.

సర్‌ఛార్జీల రూపంలో అదనపు భారం
పెరిగిన నిర్వహణ ఖర్చులను భర్తీ చేసుకునేందుకు విమానయాన సంస్థలు ఇంధన సర్‌ఛార్జీలను సవరించాయి. ఇండిగో అక్టోబర్ 6 నుంచి కొత్త ఇంధన ఛార్జీలను అమల్లోకి తీసుకురాగా, ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ అక్టోబర్ 9 నుంచి అదనపు సర్‌ఛార్జీలను ప్రకటించాయి. ప్రయాణ దూరాన్ని బట్టి దేశీయ విమాన టికెట్లపై రూ.400 నుంచి రూ.1,200 వరకు అదనంగా వసూలు చేస్తున్నాయి. పండుగ రద్దీ, నగరంలో పెరుగుతున్న వలస జనాభా కూడా విమాన టికెట్ల ధరల పెరుగుదలకు కారణమవుతున్నాయని రోహిత్ హంగల్ వివరించారు.

ఇదీ చదవండి: ప్రముఖ హీరోకు ఎఫ్‌డీఏ నోటీసు.. హైకోర్టులో సవాల్‌ చేస్తూ..
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement