ప్రముఖ హీరోకు ఎఫ్‌డీఏ నోటీసు.. హైకోర్టులో సవాల్‌ చేస్తూ.. | Ajay Devgn Faces FDA Notice Over Vimal Elaichi Ads, Moves Bombay High Court, Check Out More Details Inside | Sakshi
Sakshi News home page

ప్రముఖ హీరోకు ఎఫ్‌డీఏ నోటీసు.. హైకోర్టులో సవాల్‌ చేస్తూ..

Oct 31 2026 8:41 AM | Updated on Oct 31 2026 9:03 AM

Ajay Devgn Moves Bombay HC Over FDA Notice

ముంబై: బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్‌కు చిక్కులు ఎదురయ్యాయి. ‘విమల్ ఇలాచీ’ ప్రకటనల్లో నటించినందుకు మహారాష్ట్ర ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్‌డీఏ) అతనికి షోకాజ్ నోటీసు జారీ చేసింది. అయితే దీనిని సవాల్ చేస్తూ, ఆయన బాంబే హైకోర్టును ఆశ్రయించారు. ఇదే వ్యవహారంలో షారుఖ్ ఖాన్, టైగర్ ష్రాఫ్‌లకు కూడా గతంలో నోటీసులు జారీ అయ్యాయి.

ఈ ప్రకటనలను అన్ని మీడియా వేదికల నుంచి తొలగించాలని, తమ వైఖరిని వివరిస్తూ సమాధానాలు ఇవ్వాలని ఎఫ్‌డీఏ నటులతో పాటు సంబంధిత బ్రాండ్లను ఆదేశించింది. అయితే ఈ నోటీసులపై నటులెవరూ ఇప్పటివరకు బహిరంగంగా స్పందించలేదు. ఎఫ్‌డీఏ సహాయ కమిషనర్ స్థాయిలో విచారణ పూర్తయిందని తుకారాం ముంఢే తెలిపారు. వచ్చే వారంలో జాయింట్ కమిషనర్ ముందు అడ్జుడికేషన్ కేసు దాఖలు చేయనున్నట్లు చెప్పారు. అనంతరం అధికారిక నిర్ణయ ప్రక్రియ ప్రారంభమవుతుందని వెల్లడించారు.

అజయ్ దేవగన్‌ హైకోర్టును ఆశ్రయించినప్పటికీ, న్యాయస్థానం నుంచి తదుపరి ఆదేశాలు వచ్చే వరకు నిబంధనల ప్రకారం ఎఫ్‌డీఏ విచారణ కొనసాగుతుందని కమిషనర్ స్పష్టం చేశారు. నటులు తమ ఎండార్స్‌మెంట్ ఒప్పందాలు, ప్రకటనల పంపిణీ మార్గాలు, విమల్ ఇలాచీ స్వతంత్రంగా విక్రయించే ఉత్పత్తి అవునా కాదా అనే అంశాలకు సంబంధించిన ఆధారాలను సమర్పించాలని ఎఫ్‌డీఏ కోరింది.

విమల్ పాన్ మసాలా పొగలేని పొగాకు ఉత్పత్తి అని, మహారాష్ట్రలో దాని తయారీ, నిల్వ, రవాణా, పంపిణీ, విక్రయాలపై నిషేధం ఉందని తెలుస్తున్నది. దేశంలో నోటి క్యాన్సర్ కేసుల్లో సుమారు 30 శాతం భారత్‌లోనే నమోదవుతున్నాయని, దీనికి పొగాకు వినియోగం ప్రధాన కారణాల్లో ఒకటని పలు నివేదికలు చెబుతున్నాయి. పొగాకు కారణంగా ఏటా 1.43 లక్షలకు పైగా కొత్త క్యాన్సర్‌ కేసులు, దాదాపు 80 వేల మరణాలు నమోదవుతున్నట్లు జాతీయ గణాంకాలు చెబుతున్నాయి.

ఇదీ చదవండి: ‘వైమానికం’లో కొత్త వైస్ చీఫ్‌.. ఎవరీ ఇందర్‌పాల్ సింగ్ వాలియా?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement