స్థిరాస్తుల క్రయవిక్రయాలలో ప్రతిఫలం అంటే Sale Consideration విషయంలో ఇరు పక్షాల వారు ఎన్నెన్నో తప్పులు చేయడం. అధికారులు నోటీసులు ఇవ్వడం.. అప్పుడు అటూ ఇటూ పరుగెత్తడం అలవాటై పోయింది. పదిమందికి పరిపాటయిపోయింది. ఇలా తప్పులు చేయడం వల్ల 1961 చట్టం ప్రకారం 50సి, 68, 69ఎ లను అనుసరించి నోటీసులు వస్తాయి.
ప్రతిఫలాన్ని చూపించకపోవడం: కొందరు ‘మహానుభావులు’ ఎవరో చెప్పిన మాటలు విని అసలు ఈ మొత్తం వ్యవహారాన్ని ఎవరికీ చెప్పకుండా దాటవేస్తుంటారు. ‘తాతగారిచ్చారు’, ‘నాన్నగారు ఇచ్చారు’, ‘మావగారిచ్చారు’, ‘పెద్దలు కష్టపడి కొన్నారు’ అంటూ కాకమ్మ కబుర్లు చెబుతూ, ‘నేనేందుకు కట్టాలి’ అనే పిడివాదన కొందరిది.
తక్కువగా చూపించడం: మరికొందరు కాస్త నయం. తాము ఎంత పుచ్చుకున్నా అందులో కొంత భాగం, వైట్‌గా చూపించి, కొంత బ్లాక్‌గా అట్టే పెట్టుకుని తనను మించిన వారు ఈ ప్రపంచంలో లేరనుకుంటూ, చట్టాన్ని పరిహాసం చేస్తుంటారు.
చదరంగంలో ఎత్తులు కొందరివి: మొత్తం వ్యవహారాన్ని ముగించి, ఎంత అయితే, సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయం వారు మార్కెట్ విలువ అని నిర్ధారిస్తారో, అంత మేరకు ఒప్పందంలో చూపిస్తారు. డీడ్, ప్రతిఫలం, బ్యాంకులు జమలు మిగతావన్నీ గోవిందా. ఏనుగులాగా ఒక పద్ధతి ప్రకారం లైన్‌లో వెళ్లేవాళ్లు పది మంది ఉంటే, శకటంలాగా వంకరగా వెళ్లే వాళ్లు వంద మంది. కొంత మందిదైతే గుర్రపుటెత్తు. ఎటైనా అడుగు వేస్తారు.
నగదు పరిమితులు.. కానీ మతులే ఉండవు: రూ. 20,000కు మించి నగదు పుచ్చుకోకూడదు కానీ లక్షలు, కోట్లు కూడా తీసుకుంటున్నారు.
నగదుని బ్యాంకు ఖాతాల్లో జమ చేయడం: ఆ బ్లాక్‌గా వచ్చిన నగదును ఇంట్లో ఉంచుకోవాలంటే దొంగల భయం. అందుకని, స్వయంగా ఏ అకౌంటులో వైట్‌ని జమ చేశారో అందులోనే జమ చేయడం మరో వ్యవహారం. కొందరు ఆ బ్లాక్‌ని తనకే చెందిన వివిధ అకౌంట్లలో స్వయంగా జమ చేసుకోవడం గమనార్హం. ఇక మరికొందరు, కొనుగోలుదారు చేత తమ ఖాతాల్లో జమ చేయిస్తుంటారు. ఈ తప్పుని సమర్ధించుకుంటూ ‘‘ఈ డిపాజిట్ నేను చేసినది కాదు’’ అని చెప్పడం. నగదును ఎఫ్‌డీలలో వేయడం. నగదును మ్యుచువల్ ఫండ్స్‌లో డిపాజిట్ చేయడం. నగదుతో తులాలు తులాలు బంగారాన్ని కొనడం. ఒక లాజిక్ వినండి. బ్లాక్‌ని తీసుకెళ్లి మీ అంతట మీరే వైట్ చేసుకుంటున్నారు. కొంత మంది అతి తెలివైన వాళ్లు, కుటుంబంలోని ఇతర సభ్యుల బ్యాంకు అకౌంట్లలో డిపాజిట్ చేసి, అది కూడా రూ. 10,00,000 దాటకుండా చేసి, మురిసిపోతున్నారు. మరిచిపోతున్నారు.
టీడీఎస్ పట్టించుకోకపోవడం
ప్రతిఫలం రూ. 50,00,000 దాటినా టీడీఎస్ రికవరీ చేయకుండా కొందరు అమ్మేస్తున్నారు. ఇంకొందరు ప్రతిఫలం రూ. 50,00,000 లోపలే ఉండేలా స్థిరాస్తిని రెండు దఫాలుగా అమ్ముతున్నారు. టీడీఎస్ నిబంధనను తప్పించుకోవడానికి రూ. 50,00,000 లోపే ప్రతిఫలం ఉండేలా రాసుకోవడం మరో ఎత్తు. ఇందుకోసం కొన్ని సేల్ డీడ్‌లు రూ. 49,00,000.. బాటా కంపెనీలో చెప్పుల రేట్లలా ఉండేలా చూసుకుంటున్నారు.
తప్పు సంవత్సరంలో లెక్కలు
మార్చిలో అగ్రిమెంటు కుదుర్చుకుంటే డబ్బు ఏప్రిల్‌లో వస్తుంది. ఆ తర్వాత రిజి్రస్టేషన్. దీనితో తికమక. తప్పుడు సంవత్సరంలో లెక్కలు చూపించడం.
మిస్–మ్యాచ్
సేల్ డీడ్‌లో రూ. 80 లక్షలు. రిటర్నులో రూ. 60 లక్షలు.. బ్యాంకు అకౌంట్లలో జమలు వేరు. ఆ వ్యవహారాలు జరిగిన వారం రోజు అటూ, ఇటూ కుటుంబ సభ్యుల అకౌంట్లు పరిశీలిస్తే ప్రకంపనలు.
ఒక్క ప్రతిఫలం .. మూడు లెక్కలు
హైదరాబాద్ శివార్లలో భూమి విక్రయం వివరాలు.. అసలు ప్రతిఫలం రూ. 1 కోటి 20 లక్షలు. కాని బ్యాంకులో జమ అయినది రూ. 70 లక్షలు ..మిగతా రూ. 50 లక్షలు నగదు. కానీ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సేల్ డీడ్‌లో రూ. 18 లక్షలే. ఈ విషయాలు తెలిస్తే డిపార్టుమెంటు వారు మూడో కన్ను తెరుస్తారు.
బ్లాక్ నుంచి రీఇన్వెస్ట్‌మెంట్
బ్లాక్‌లో వచ్చిన మొత్తంతో రాతపూర్వకంగా అంటే.. వైట్‌గా మరో ఇల్లు కొనడం. క్యాపిటల్ గెయిన్ స్కీమ్‌లో వేయడం, బాండ్లు కొనడంలాంటివి చేస్తుంటారు. జాగ్రత్త వహించాలి. ప్రతిఫలానికి ఒకటే దారుంది సుమీ! 


