కొండాపూర్‌లో రూ.1,500 కోట్ల విలువైన 26 ఎకరాల భూమిని కబ్జా చేశారు
నకిలీ పత్రాలు సృష్టించిన కేఎంఆర్ ఎస్టేట్స్ ప్రతినిధులు
‘మాధవ హిల్స్’ లేఅవుట్ పేరుతో ప్లాట్ల విక్రయం
నకిలీ ప్రొసీడింగ్స్ సృష్టించినట్లు గుర్తించిన డిప్యూటీ కలెక్టర్
కొల్ల మాధవరెడ్డితో పాటు ఏడుగురిపై ఫిర్యాదు.. కేసు నమోదు
సాక్షి, హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం కొండాపూర్‌లో రూ.1,500 కోట్లకు పైగా విలువైన ప్రభుత్వ సీలింగ్ భూములు కబ్జాకు గురయ్యాయి. శేరిలింగంపల్లి తహసీల్దార్ కార్యాలయం పేరుతో కేఎంఆర్ ఎస్టేట్స్ అండ్ బిల్డర్స్ ప్రై.లి. డైరెక్టర్ కొల్ల మాధవరెడ్డితో పాటు మరో ఆరుగురు నకిలీ వాలిడేషన్ ప్రొసీడింగ్స్ సృష్టించి ప్రభుత్వ సీలింగ్ భూమిని ఆక్రమించారని శేరిలింగంపల్లి మండలం డిప్యూటీ కలెక్టర్, తహసీల్దార్ కె. మహిపాల్ రెడ్డి గుర్తించారు.
దీనిపై సైబరాబాద్ ఆర్థిక నేరాల విభాగం (ఈఓడబ్ల్యూ) పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కొల్ల మాధవరెడ్డి, కొల్ల గాలవ్వ, టి.లక్ష్మారెడ్డి, నిమ్మ నారాయణ, నిమ్మ రామయ్య, కొల్ల సిద్ధవ్వ, సాయి రెడ్డిలపై పోలీసులు క్రిమినల్ కేసులు నమోదు చేశారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
నిషేధిత జాబితాలో చేర్చిన సర్కారు కొండాపూర్ పరిధిలోని సర్వే నంబర్లు 78 నుంచి 93 వరకు 237.27 ఎకరాల భూమి ఉంది. 1954–55 ఖాస్రా పహాణీలో ఈ భూములు నవాబ్ షంషీర్ జంగ్ పట్టాదారుగా, నవాబ్ మిర్ హుస్సేన్ అలీ ఖాన్ నివాసదారుడిగా నమోదయ్యాయి. ఆ తర్వాత 1985–86, 1993–94లో అవే భూములు నవాబ్ మీర్ హుస్సేన్ అలీ ఖాన్ పేరిట కొన్ని, చింత పోచయ్య, వారి కుటుంబ సభ్యుల పేరిట కొన్ని భూములు పహాణీలో రికార్డయ్యాయి.
1962 అక్టోబర్ 6న నవాబ్ మీర్ హుస్సేన్ అలీ ఖాన్.. చింతల చిత్తారి, చింతల కొమురయ్యల పేరిట సేల్ అగ్రిమెంట్ చేశారు. ఇందుకు సంబంధించి రాజేంద్రనగర్ తాలూకా తహశీల్దార్ జారీ చేసిన వాలిడేషన్ సర్టిఫికేషన్ ద్వారా 50–బీ కింద క్రమబదీ్ధకరించారు. జనరల్ పవరాఫ్ అటార్నీ (జీపీఏ) హోల్డర్ చింతల పోచయ్య ఆధ్వర్యంలో కొండాపూర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ ఆమోదంతో అప్పట్లో రాజరాజేశ్వరి నగర్, ఓయూ కాలనీ, కామేశ్వరి కో–ఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ, గోల్డెన్ తులిప్ పేర్లతో లే–అవుట్లు వెలిశాయి. మొత్తం 10,43,302 చదరపు గజాల ప్లాటెడ్ ఏరియాలో 2,059 నివాస ప్లాట్లు విక్రయమయ్యాయి.
సీలింగ్ చట్టం కింద చింతల పోచయ్య, ఇతర కుటుంబ సభ్యులు డిక్టరేషన్ దాఖలు చేయగా.. అర్బన్ ల్యాండ్ సీలింగ్ అధికారులు 2004 మార్చి 11న ప్రొసీడింగ్స్ జారీ చేశారు. దీంతో 10 మంది చట్టబద్ధ వారసులకు సర్వే నంబర్ 79లో ఒక్కొక్కరికీ వెయ్యి చదరపు మీటర్ల రిటైనబుల్ ప్రాంతాన్ని, అలాగే మరో 8 మందికి ఒక్కొక్కరికి 5 ఎకరాల చొప్పున 40 ఎకరాలను మినహాయింపునిచ్చారు.
మిగిలిన 8,10,178.66 చదరపు మీటర్ల భూమిని (సర్వే నంబర్లు 78/1, 80, 81/1, 82, 83, 84, 85, 86/1, 87/1, 88, 89, 90, 91/1, 92/1, 93) సీలింగ్ భూములుగా ప్రకటించారు. 2024 డిసెంబర్‌లో పంచనామా ద్వారా ఈ మిగులు భూమిని ప్రభుత్వం ఆ«దీనంలోకి తీసుకుని, రిజి్రస్టేషన్ చట్టం–1908 సెక్షన్ 22–ఏ కింద నిషేధిత ఆస్తుల జాబితాలో చేర్చింది.
నకిలీ పత్రాలు సృష్టించి..
కొండాపూర్‌లోని సర్వే నంబర్లు 88/ఏ, 89/ఏ, 92/ఏ, 93 పరిధిలోని 26 ఎకరాల భూమిపై కొల్ల మాధవరెడ్డి కన్ను పడింది. 1975 ఫిబ్రవరి 6 నాటిదంటూ ఒక నకిలీ రిజిస్టర్ కాని విక్రయ పత్రాన్ని సృష్టించారు. ఏపీ రైట్స్ ఇన్ ల్యాండ్ అండ్ పట్టాదారు పాస్ బుక్ చట్టం–1971 సెక్షన్ 5–ఏ కింద వాలిడేషన్ చేసినట్లు నకిలీ పత్రాలను సృష్టించారు.
ఆ తర్వాత రంగారెడ్డి జిల్లా 1వ అదనపు సబార్డినేట్ కోర్డులో సివిల్ కేసు వేసి.. కోర్టు వెలువల రాజీ పడి డిక్రీ పొందారు. ఆ తర్వాత ఈ 26 ఎకరాల భూమిని కేఎంఆర్ ఎస్టేట్స్ అండ్ బిల్డర్స్ పేరిట అన్ రిజిస్టర్ జీపీఏ పొందారు. మెదక్ జిల్లా డిజిట్రాక్ ప్రొసీడింగ్స్ ద్వారా వాలిడేట్ చేయించుకొని.. ‘మాధవ హిల్స్’పేరిట లే–అవుట్ అభివృద్ధి చేసి ప్లాట్లను విక్రయించారు.
ఫిర్యాదుతో వెలుగులోకి..
ప్రభుత్వ భూమిని కబ్జా చేశారంటూ మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా కీసర మండలం కుందన్‌పల్లి గ్రామానికి చెందిన కె.రమేష్ మే 13న రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో రెవెన్యూ అధికారులు దర్యాప్తు జరిపారు. తహశీల్దార్ కార్యాలయంలో రికార్డులను పరిశీలించగా.. నిందితులు చూపించిన సీ/973/89, జీ/973/89, జీ1/973/89 ఫైళ్లు అసలు కార్యాలయంలో లేనేలేవని తేలింది.
1989 నాటి డి్రస్టిబ్యూషన్ రిజిస్టర్ ప్రకారం సీరియర్ నంబరు 973 అనేది కోటాగూడ గ్రామం సర్వే నంబరు 37 భూమికి సంబంధించిన దులం కళావతి అనే వ్యక్తి దరఖాస్తుకు చెందినదని గుర్తించారు. దీంతో తహశీల్దార్ కార్యాలయం పేరుతో నకిలీ వాలిడేషన్ ప్రొసీడింగ్స్ సృష్టించి 26 ఎకరాల ప్రభుత్వ సీలింగ్ భూమిని ఆక్రమించారని స్పష్టమైంది. ఈ మేరకు సైబరాబాద్ ఈఓడబ్ల్యూ ఠాణాలో కేసు నమోదు చేశారు.
ఇదీ చదవండి: ఏ పూటకాపూట


