గ్రీన్‌కార్డ్‌ కలలో కరుగుతున్న కాలం! | Indian Tech Workers Green Card Wait | Sakshi
Sakshi News home page

గ్రీన్‌కార్డ్‌ కలలో కరుగుతున్న కాలం!

Nov 17 2026 4:51 AM | Updated on Nov 17 2026 4:51 AM

Indian Tech Workers Green Card Wait

చెదురుతున్న భారతీయ టెకీల శాశ్వత నివాస స్వప్నం

అడ్డుగోడగా మారిన కఠిన వలస నిబంధనలు, సుదీర్ఘ నిరీక్షణ కాలం

ఈబీ–2 కేటగిరీలో గ్రీన్‌ కార్డ్‌ దరఖాస్తుదారులకు 179 ఏళ్ల దాకా తప్పని నిరీక్షణ

అయినా స్వదేశానికి రాబోమంటున్న భారతీయ నిపుణులు

కెనడా, ఆ్రస్టేలియా, సింగపూర్‌ వైపు చూపు.. వలసదారుల అభిప్రాయాలతో తాజా అధ్యయన నివేదిక వెల్లడి

సాక్షి, హైదరాబాద్‌: అమెరికాలో స్థిరపడాలనే భారతీయ ఐటీ, ఇతర రంగాల నిపుణుల చిరకాల స్వప్నం ఇప్పుడు కష్టతరంగా మారుతోంది. దశాబ్దాల తరబడి సాగుతున్న గ్రీన్‌ కార్డ్‌ నిరీక్షణ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తీసుకొస్తున్న కఠిన వలస నిబంధనలు భారతీయ ఉద్యోగులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఫలితంగా వేలాది మంది భారతీయ నిపుణులు అమెరికాను వీడి కెనడా, ఆ్రస్టేలియా, సింగపూర్‌ వంటి దేశాలకు వెళ్లేందుకు మొగ్గు చూపుతున్నారు. అయితే ఎన్ని ఇబ్బందులు ఎదురైనా శాశ్వతంగా స్వదేశానికి తిరిగి రావడానికి మాత్రం చాలా మంది ఇష్టపడటం లేదని తాజా అధ్యయనం స్పష్టం చేసింది.

ది గ్రీన్‌ కార్డ్‌ డ్రాగ్‌ ఏం చెబుతోంది? 
బ్రెండా గాంబోల్, వరైడ్జో జ్వోబ్గో, మేఘనా సభర్వాల్‌ అనే పరిశోధకులు కలిసి ది గ్రీన్‌ కార్డ్‌ డ్రాగ్‌: హౌ హైలీ స్కిల్డ్‌ ఏషియన్‌ ఇండియన్‌ ఇమ్మిగ్రెంట్స్‌ ఎక్స్‌పీరియన్స్‌ ది యూఎస్‌ ఇమ్మిగ్రేషన్‌ సిస్టమ్‌ పేరుతో నిర్వహించిన తాజా అధ్యయనం సంచలన విషయాలను వెల్లడించింది. అమెరికాలో హెచ్‌–1బీ వీసాలపై పనిచేస్తున్న 40 మంది భారతీయ టెక్‌ నిపుణులతో జరిపిన ఇంటర్వ్యూల ఆధారంగా ఈ నివేదికను రూపొందించారు.

179 ఏళ్ల దాకా నిరీక్షణ అనివార్యం! 
అమెరికా చట్టాల ప్రకారం ఏ దేశానికైనా ఏటా కేటాయించే ఉద్యోగ ఆధారిత గ్రీన్‌ కార్డులలో కేవలం 7 శాతమే ఇస్తారు. భారత్‌ నుంచి దరఖాస్తుదారులు లక్షల్లో ఉండటంతో ఈ క్యూ విపరీతంగా పెరిగిపోయింది. నేషనల్‌ ఫౌండేషన్‌ ఫర్‌ అమెరికన్‌ పాలసీ (ఎన్‌ఎఫ్‌ఏపీ) తాజా అంచనాల ప్రకారం 2026 జనవరి తర్వాత ఈబీ–2 కేటగిరీలో గ్రీన్‌ కార్డ్‌ కోసం దరఖాస్తు చేసుకునే భారతీయులకు సాంకేతికంగా చూస్తే 179 ఏళ్ల నిరీక్షణ తప్పదని తేలింది. అంటే తమ జీవితకాలంలో గ్రీన్‌ కార్డ్‌ వచ్చే అవకాశమే లేదన్నమాట.

ఈ నేపథ్యంలో భారతీయ నిపుణులు ఒకే కంపెనీకి కట్టుబడి ఉండాల్సి వస్తోంది. ఇంతటి మానసిక ఒత్తిడి ఉన్నప్పటికీ భారత్‌కు శాశ్వతంగా తిరిగి రావడానికి సిద్ధంగా లేమని సర్వేలో పాల్గొన్న ఎక్కువ మంది చెప్పారు. ముఖ్యంగా మహిళా నిపుణులు భారత్‌కు తిరిగి వెళ్తే యూఎస్‌లో ఉండే వ్యక్తిగత స్వేచ్ఛను కోల్పోయి, సామాజిక ఆంక్షలను ఎదుర్కోవాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. అందుకే కెనడా, ఆ్రస్టేలియా లేదా భారత్‌కు దగ్గరగా ఉండే సింగపూర్‌ వంటి దేశాలకు వెళ్లడమే ఉత్తమమని వారు భావిస్తున్నారు.

31 వేలకుపైగా అభ్యంతరాలు.. 
హెచ్‌–1బీ వీసాపై ఉండి ఉద్యోగం కోల్పోయిన వారికి ప్రస్తుతం లభిస్తున్న 60 రోజుల గ్రేస్‌ పీరియడ్‌ (కొత్త ఉద్యోగం వెతుక్కోవడానికి ఇచ్చే గడువు) పూర్తిగా రద్దు చేయాలని అమెరికా హోమ్‌ల్యాండ్‌ సెక్యూరిటీ విభాగం (డీహెచ్‌ఎస్‌) ప్రతిపాదించింది. ఇది అమలైతే ఉద్యోగం పోయిన మరుక్షణం నుంచే ఆ వ్యక్తి అమెరికాలో చట్టబద్ధంగా ఉండే అర్హత కోల్పోయి వెంటనే దేశం విడిచి వెళ్లాల్సి వస్తుంది. ఈ ప్రతిపాదనపై వచ్చిన 31,383 ప్రజాభిప్రాయాల్లో 80 శాతానికిపైగా దీన్ని వ్యతిరేకించాయి.

విద్యార్థుల వర్క్‌ పర్మిట్లపై ఫీజుల పిడుగు..  
విదేశీ విద్యార్థులు చదువు పూర్తయ్యాక అమెరికాలో పనిచేయడానికి వీలు కల్పించే ఆప్షనల్‌ ప్రాక్టికల్‌ ట్రైనింగ్‌ (ఓపీటీ) ప్రోగ్రామ్‌ కోసం యూనివర్సిటీలు భారీ ఫీజు చెల్లించాలని డీహెచ్‌ఎస్‌ ప్రతిపాదించింది. ప్రాథమిక ఓపీటీ అనుమతికి 70,000 డాలర్లు, ఆ తర్వాత సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథ్స్‌ (స్టెమ్‌) కోర్సులు చేసిన వారికి పొడిగింపునకు మరో 30,000 డాలర్లు కలిపి మొత్తం 1,00,000 డాలర్లు ఫీజుగా నిర్ణయించింది. 580కిపైగా అమెరికన్‌ వర్సిటీలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రెసిడెంట్స్‌ అలయన్స్‌ ఈ ఫీజు ప్రతిపాదనను వ్యతిరేకించింది. ఈ నిబంధన అమలైతే 69 శాతం మంది విదేశీ విద్యార్థులు అమెరికాకు రావడమే మానేస్తారని.. తద్వారా అమెరికా ఆర్థిక వ్యవస్థకు ఏటా లభిస్తున్న 42.9 బిలియన్‌ డాలర్ల ఆదాయానికి గండిపడుతుందని హెచ్చరించింది. 

అది ఒక జీవిత ఖైదు.. 
గ్రీన్‌ కార్డ్‌ జారీలో జాప్యం మాకో జీవితఖైదు లాంటిది. అమెరికా ప్రభుత్వానికి పన్నులు కడుతూ నిబంధనలన్నీ పాటిస్తున్నా ఈబీ–2 కోసం 179 ఏళ్ల నిరీక్షించాల్సి రావడం దురదృష్టకరం. 
– విశ్వేశ్వర్‌రెడ్డి కల్వల, ఫౌండర్, గ్లోబల్‌ తెలంగాణ అసోసియేషన్‌

కఠిన నిర్ణయానికి తరుణం ఆసన్నమైంది.. 
అమెరికాలో శాశ్వత నివాసం విషయంలో భావోద్వేగంతో కాకుండా వాస్తవికంగా ఆలోచించాలి. కఠిన నిర్ణయం తీసుకోవాల్సిన తరుణం ఆసన్నమైంది. ఈయూలో అవకాశాలు పెరిగాయి.
– శ్రీనివాస్, వర్జీనియా

ఇది ఆందోళనకరం.. 
అమెరికాలో 10–15 ఏళ్ల జీవితాన్ని అంకితం చేసి అక్కడే కుటుంబాలతో స్థిరపడ్డాక నిపుణులను శాశ్వత నివాసం కోసం దశాబ్దాల తరబడి వేచి చూడాలని చెప్పడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.
- ఆర్‌బీఎస్‌ రెడ్డి, యూఎస్‌.

ప్రతిభావంతులను అమెరికా కోల్పోతోంది.. 
అమెరికా మాకు శాశ్వత నివాసం ఇవ్వడానికి ఇష్టపడటం లేదు. అందుకే మాలో చాలామంది ఇతర దేశాలకు వెళ్తున్నారు.  దీనివల్ల అమెరికా అత్యుత్తమ ప్రతిభావంతులను కోల్పోతోంది.  
- జి.కిశోర్, అట్లాంటా.

ఇదీ చదవండి: వాస్తవాలను ప్రపంచానికి చెప్పాలనే!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement