ఎన్నో ఏళ్లుగా రైతాంగం ఎదుర్కొంటున్న భూ సమస్యలకు చెక్!
ఇప్పటివరకు నక్షాలు లేని 370 గ్రామాలకు పటాల రూపకల్పనకు కసరత్తు
రాష్ట్రంలోని 100 పల్లెలకు వచ్చే ఫిబ్రవరికి గ్రామ పటాలు
ఇప్పటికే భూముల రీసర్వే ప్రక్రియ పూర్తి
రెవెన్యూ గ్రామాల వారీగా భూవిస్తీర్ణం తేల్చిన రెవెన్యూ యంత్రాంగం.. అన్ని భూములకు సర్వే నంబర్లు
త్వరలోనే రైతులకు నోటీసులు..అభ్యంతరాలకు అవకాశం
గ్రామసభలు పెట్టి పటాలు ఫైనల్ చేయడమే తరువాయి
ఆపై అసెంబ్లీలో చర్చించి రాష్ట్రమంతటా భూముల రీసర్వే
సాక్షి, హైదరాబాద్: ఎప్పుడో నిజాం కాలం నుంచి వందలాది గ్రామాల్లో రైతాంగం ఎదుర్కొంటున్న రెవెన్యూ సమస్యలకు చెక్ పడనుంది. ప్రతి గ్రామానికీ నక్షాలు (గ్రామ రెవెన్యూ పటాలు) ఉండాలని భావిస్తున్న ప్రభుత్వం..పటాలు లేని గ్రామాలకు త్వరలోనే వాటిని సమకూర్చేందుకు రంగం సిద్ధం చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 370కి పైగా గ్రామాలకు నక్షాలు లేవు. వాటిలో దాదాపు 100 గ్రామాలకు కొత్త ఏడాదిలో రెవెన్యూ పటాలు రానున్నాయి.
ఆయా గ్రామాల్లో ఇప్పటికే భూముల రీసర్వే ప్రక్రియ పూర్తయింది. ఈ సర్వే ప్రకారం తేలిన అంశాలకు సంబంధించి రైతులకు నోటీసులు జారీ చేసి, అభ్యంతరాలు స్వీకరించి, ఆ మేరకు సర్దుబాటు చేసి గ్రామసభల నిర్వహణ ద్వారా ఆ 100 గ్రామాల్లో నక్షాలు ఫైనల్ చేసేందుకు రెవెన్యూ శాఖ ఏర్పాట్లు చేస్తోంది. ఈ ప్రక్రియకు రెండు, మూడు నెలల సమయం పడుతుందని, వచ్చే ఫిబ్రవరి నాటికి ఈ 100 గ్రామాలకు నక్షాలు సమకూరుతాయని ఆ శాఖ ఉన్నతాధికారులు చెపుతున్నారు.
తొలుత ఐదు గ్రామాల్లో..
వాస్తవానికి రాష్ట్ర వ్యాప్తంగా 413 గ్రామాలకు నక్షాలు లేవని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. ఈ మేరకు ఆయా గ్రామాలకు పటాలు సమకూర్చే ప్రక్రియ 2025లోనే ప్రారంభమైంది. అందులో భాగంగా పైలట్ పద్ధతిన ఐదు గ్రామాల్లో భూముల రీసర్వే చేసి ఆయా గ్రామాలకు నక్షాలు రూపొందించారు.
మహబూబ్‌నగర్ జిల్లా గండీడ్ మండలం సలార్‌నగర్, జగిత్యాల జిల్లా బీర్‌పూర్ మండలం న్యూకొమ్మనపల్లి, ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం ములుగుమాడు, ములుగు జిల్లా వెంకటాపురం గ్రామం నూగూరు, సంగారెడ్డి జిల్లా వట్‌పల్లి మండలం షాహిద్ నగర్ గ్రామాల్లో ఆ ఏడాది జూలై నాటికి భూముల రీసర్వే పూర్తి చేశారు. ఆయా గ్రామాల్లో గ్రామసభలు నిర్వహించి ముసాయిదా నక్షాలు ఖరారు చేశారు.
అయితే వీటిలో కొన్నింటికి తుది నక్షాలు అందుబాటులోకి రాగా, ఒకట్రెండు గ్రామాల్లో శివార్లు తేలని కారణంగా కలెక్టర్ల వద్ద పెండింగ్‌లో ఉన్నట్టు సమాచారం. తాజాగా ఈ ప్రక్రియను రాష్ట్రమంతటా అమలు చేయాలని నిర్ణయించిన నేపథ్యంలో భూముల రీసర్వే పైలట్ ప్రక్రియలో మిగిలిన నక్షాలు లేని గ్రామాలను ఎంపిక చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలోని (హైదరాబాద్ మినహా) 70 గ్రామాలను భూముల రీ సర్వే కోసం ఎంపిక చేయగా, వాటితో పాటు నక్షాలు లేని గ్రామాల్లో కూడా రీ సర్వే ప్రారంభించారు.
అయితే తొలుత గుర్తించిన నక్షాలు లేని 413 గ్రామాల స్థానంలో 370 గ్రామాలను మాత్రమే పరిగణనలోకి తీసుకుని అక్కడ నక్షాల రూపకల్పన కోణంలో రీసర్వే చేపడుతున్నారు. ఇప్పటికే 115 గ్రామాల్లో రీ సర్వే ప్రారంభం కాగా, దాదాపు 100 గ్రామాల్లో 100 శాతం రీ సర్వే పూర్తయిందని రెవెన్యూ గణాంకాలు చెబుతున్నాయి.
నక్షాల రూపకల్పన కోసం ఎంపిక చేసిన వాటిలో ఉమ్మడి మెదక్ జిల్లాలోని 35 గ్రామాల్లో 100 గ్రౌండ్ ట్రూతింగ్ (క్షేత్రస్థాయిలో పరిశీలన, కొలతల సేకరణ) పూర్తి కాగా, మిగిలిన 20 జిల్లాల్లో కలిపి మరో 65 గ్రామాల్లో కూడా గ్రౌండ్ ట్రూతింగ్ పూర్తయింది. భూముల రీసర్వే ప్రక్రియ పూర్తి కావడంతో ఇప్పుడు ఆయా గ్రామాల్లో రైతులకు నోటీసులిచ్చి అభ్యంతరాలు స్వీకరిస్తామని రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. రైతుల నుంచి వచ్చే అభ్యంతరాలను పరిశీలించిన తర్వాత వాటికి పరిష్కారం చూపి తుది నక్షాను ఖరారు చేయనున్నారు. ఈ ప్రక్రియ పూర్తయితే 100 గ్రామాలకు కొత్త నక్షాలు అందుబాటులోకి వస్తాయని రెవెన్యూ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
పైలట్ స్ఫూర్తితో భూముల రీసర్వే
నక్షాలు లేని గ్రామాల్లో నిర్వహించిన భూముల రీసర్వే ప్రక్రియ పూర్తి కావడంతో రాష్ట్రమంతటా భూముల రీసర్వేకు ప్రభుత్వం ఉపక్రమించింది. అందులో భాగంగా జిల్లాకు 70 చొప్పున గ్రామాలను ఎంపిక చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 2,353 గ్రామాల్లో భూముల రీసర్వేకు నిర్ణయించగా, 1,000కు పైగా గ్రామాల్లో భూముల రీసర్వే ప్రారంభమైంది. భూముల సర్వే కోసం ఇప్పటివరకు అందుబాటులో ఉన్న 574 రోవర్లను (ప్లాట్ల పటం కోసం, కొలతలకు ఉపయోగించే పరికరం) వినియోగించుకుంటుండగా, నేడో, రేపో మరో 400 రోవర్లు అందుబాటులోకి రానున్నాయి.
దీంతో భూముల రీసర్వే ప్రక్రియ మరింత ఊపందుకుంటుందని రెవెన్యూ ఉన్నతాధికారులు చెబుతున్నారు. అయితే ఈ 2,353 గ్రామాల్లో భూముల రీసర్వే ప్రక్రియను డిసెంబర్ 15 నాటికి పూర్తి చేయాలని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో వీలున్నంత త్వరగా రీసర్వే ప్రక్రియను పూర్తి చేసేందుకు రెవెన్యూ యంత్రాంగం కసరత్తు చేస్తోంది.
ఈ ప్రక్రియ పూర్తయిన అనంతరం వచి్చన అనుభవాలను దృష్టిలో ఉంచుకుని, ఆయా అంశాలను అసెంబ్లీ ముందు పెట్టి అక్కడ చర్చించి ఆమోదం పొందిన అనంతరం రాష్ట్రంలోని మిగిలిన అన్ని గ్రామాల్లో భూముల రీసర్వే చేయాలనేది ప్రభుత్వ ఆలోచనగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది జూన్ నాటికి రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో భూముల రీసర్వే ప్రక్రియ ప్రారంభమవుతుందని రెవెన్యూ అధికారులు అంచనా వేస్తున్నారు.
పొంగులేటి నిరంతర సమీక్షలు
భూముల రీసర్వే ద్వారా క్షేత్రస్థాయిలో రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం చూపాలన్న ఆలోచనతో రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఈ ప్రక్రియపై పూర్తిస్థాయిలో దృష్టి సారించారు. పైలట్‌గా ఎంపిక చేసిన గ్రామాలతో పాటు నక్షాలు లేని గ్రామాల్లో జరుగుతున్న రీసర్వేను నిరంతరం సమీక్షిస్తున్నారు. ఇప్పటికే 9 ఉమ్మడి జిల్లాలకు వెళ్లి సమీక్షలు నిర్వహించారు. రెవెన్యూ, సర్వే ఉన్నతాధికారులతోనూ ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తూ రీసర్వే ప్రక్రియ గాడి తప్పకుండా పర్యవేక్షిస్తున్నారు.

నక్షా అంటే..?
నక్షా అంటే గ్రామ రెవెన్యూ పటం. ఇందులో గ్రామంలోని అన్ని భూములకు సంబంధించి నిర్ధారిత భౌగోళిక హద్దులు, కేటాయించిన సర్వే నంబర్ల వివరాలుంటాయి. అంటే ప్రతి సర్వే నంబర్‌లో ఉన్న భూమి విస్తీర్ణాన్ని అధికారికంగా నిర్ధారిస్తారన్నమాట. ప్రభుత్వ, ప్రైవేటు, అసైన్డ్, అటవీ, దేవాదాయ, వక్ఫ్ తదితర భూములను వర్గీకరిస్తారు. రోడ్లు, కాలువలు, ఆబాదీలు తదితర అన్ని వివరాలను నమోదు చేస్తారు.
అన్ని వివరాలు, సర్వే నంబర్లను, విస్తీర్ణాన్ని నమోదు చేసి ఆ గ్రామ హద్దులతో ఒక రూపం ఇవ్వడాన్నే నక్షా అంటారు. ఈ నక్షానే భూముల సరిహద్దులకు సంబంధించిన ప్రాథమిక ఆధారంగా ఉపయోగపడుతుంది. నక్షాలు లేకపోతే భూముల హద్దుల వివాదాలు, భూవిస్తీర్ణంలో తేడాలు, క్రయ విక్రయాల్లో ఇబ్బందులు, బ్యాంకు రుణాల మంజూరులో జాప్యం, ప్రభుత్వ, ప్రైవేటు భూముల వర్గీకరణ వంటి అంశాలు పెండింగ్‌లోనే ఉంటాయి. వీటి పరిష్కారానికి రైతులు కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తుంది.


