30 శాతం డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లకు తాళాలు | 30 percent double bedroom houses remain locked | Sakshi
Sakshi News home page

30 శాతం డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లకు తాళాలు

Nov 16 2026 12:38 PM | Updated on Nov 16 2026 1:04 PM

30 percent double bedroom houses remain locked

సాక్షి,హైదరాబాద్: పేదల సొంతింటి కలను సాకారం చేసేందుకు ప్రభుత్వం ఉచితంగా కేటాయించిన డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల వ్యవహారంలో సాక్షాత్తు హౌసింగ్‌ శాఖ సిబ్బందే ‘ఇంటి దొంగల’ అవతారమెత్తారు. క్యూర్‌ పరిధిలో వేలాది ఇళ్లు ఖాళీగా ఉండటంతో నోటీసులు ఇచ్చి స్వాదీనం చేసుకునేందుకు ఉన్నతాధికారులు తుది హెచ్చరికలు జారీ చేశారు. మూడేళ్ల క్రితం ఇళ్లు కేటాయించినప్పటికీ తాళాలు వేసిన వాటిని రద్దు చేసేందుకు ఉపక్రమించింది. కానీ క్షేత్రస్థాయి సిబ్బంది కాసులకు కక్కుర్తిపడి ఇళ్లను ఖాళీగా ఉంచిన వారిని కాపాడేందుకు ప్రయత్నిస్తున్నారు.   

20 శాతమే స్పందన  
క్యూర్‌ పరిధిలో కేటాయించిన డబుల్‌ బెడ్‌రూం సముదాయాల్లో దాదాపు 30 శాతం ఇళ్లకు తాళాలు వేసి ఉండటాన్ని తీవ్రంగా పరిగణించిన గృహనిర్మాణ శాఖ లబ్ధిదారులకు ఇప్పటికే రెండు విడతలుగా నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసులకు కేవలం 20 శాతం మంది మాత్రమే స్పందించగా, వారిలోనూ అత్యధికులు తప్పుడు సమాధానాలతో తప్పుదోవ పట్టిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇళ్లలో నివాసం ఉండకపోయినా.. కరెంటు బిల్లులు, కాలనీ అసోసియేషన్‌ మెయింటెనెన్స్‌ చార్జీల రసీదులను ఆధారాలుగా సమర్పిస్తున్నారు.   

ఫ్లాట్‌కో రేటు..   
నిబంధనల ప్రకారం కేటాయించిన ఇంట్లో లబ్ధిదారు కుటుంబం శాశ్వతంగా నివాసం ఉండాలి. తాళాలు వేసినా.. అద్దెకు ఇచ్చినా కేటాయింపు రద్దు చేయాలి. ఇదే అదనుగా భావించిన క్యూర్‌ హౌసింగ్‌ శాఖలోని కొందరు అధికారులు, సిబ్బంది తాళాలు వేసిన లబ్ధిదారులతో ఒప్పందాలు కుదుర్చుకుని వసూళ్ల పర్వానికి తెరలేపారు. ఒక్కో ఫ్లాట్‌కు ఇంతని రేటు నిర్ణయించి, ముట్టజెప్పిన వారి ఇళ్ల జోలికి వెళ్లకుండా కాపాడుతున్నట్లు సమాచారం. నోటీసులకు సమాధానం ఇచ్చే సమయంలో ఏయే పత్రాలు జతచేయాలి, విచారణ సమయంలో ఏం చెప్పాలనే విషయాలను కూడా సదరు సిబ్బందే దగ్గరుండి మరీ లబ్ధిదారులకు నేర్పిస్తున్నారు. సొంత ఇళ్లు ఉన్న కొందరు సంపన్నులు సిబ్బందికి మామూళ్లు ముట్టజెబుతూ తమ ఫ్లాట్లను కాపాడుకుంటున్నారు.   

లీకు వీరులు..  
ఖాళీగా ఉన్న ఇళ్లను గుర్తించేందుకు ఉన్నతాధికారులు చేపట్టే తనిఖీల సమాచారం క్షేత్రస్థాయికి చేరగానే లబ్ధిదారులను అప్రమత్తం చేస్తున్నారు. తాళాలు వేసిన ఇళ్ల యజమానులు అక్కడకు చేరుకుని అక్కడే నివాసం ఉంటున్నట్లు హడావుడి చేస్తున్నారు. ఈ ‘లీకుల’ కారణంగా ఉన్నతాధికారుల తనిఖీలు కేవలం మొక్కుబడి తంతుగా మారిపోయాయి.  

నోటీసులు ఇచ్చినా.. మారని తీరు 
క్యూర్‌ పరిధిలోని నాలుగు జిల్లాల పరిధిలో సుమారు పదివేలకు పైగా ఇళ్లు ఖాళీగా ఉన్నట్లు ప్రాథమికంగా గుర్తించగా, తాజా గణాంకాల ప్రకారం 6,214 ఇళ్లకు ఇంకా తాళాలు వేసే ఉన్నాయి. ఇందులో అత్యధికంగా మేడ్చల్‌–మల్కాజిగిరి జిల్లాలో 2,182 ఇళ్లు ఖాళీగా ఉండగా, హైదరాబాద్‌ జిల్లాలో 2,047, రంగారెడ్డి జిల్లాలో 1,853, సంగారెడ్డి జిల్లాలో 132 ఇళ్లు తాళాలతో దర్శనమిస్తున్నాయి. ఇప్పటికే మూడు విడతలుగా నోటీసులు జారీ చేసి, వారం రోజుల్లోగా ఇళ్లలోకి చేరకపోతే కేటాయింపులను శాశ్వతంగా రద్దు చేస్తామని హౌసింగ్‌ శాఖ తుది గడువు విధించింది. తప్పుడు సంజాయి కి  సిబ్బంది సహకారం అందించడంతో ఆశించిన ఫలితం ఇవ్వని పరిస్థితి నెలకొంది. క్షేత్రస్థాయి అధికారుల పాత్రపై లోతైన విచారణ జరిపితే మరిన్ని విస్తుపోయే నిజాలు బయటపడే అవకాశం ఉంది.  

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement