నాడు ఓటర్లు.. నేడు అనర్హులు | Telangana SIR: 21514 electors found ineligible for final voter list | Sakshi
Sakshi News home page

నాడు ఓటర్లు.. నేడు అనర్హులు

Nov 16 2026 6:09 AM | Updated on Nov 16 2026 6:09 AM

Telangana SIR: 21514 electors found ineligible for final voter list

సర్‌ 2002 ఓటర్ల జాబితాతో మ్యాపింగ్‌ జరిగినా 

21,514 మంది అనర్హులుగా ఈసీ నిర్ధారణ 

సాక్షి, హైదరాబాద్‌: సర్‌–2026 కార్యక్రమంలో భాగంగా నోటీసుల జారీ/విచారణ ప్రక్రియ తుది దశకు చేరడంతో ఈ నెల 30న తుది ఓటర్ల జాబితాను కేంద్ర ఎన్నికల సంఘం ప్రచురించనుంది. సర్‌–2002 ఓటర్ల జాబితాతో విజయవంతంగా మ్యాపింగ్‌ జరిగినా వివరాల్లో తార్కిక వ్యత్యాసాలు కలిగి ఉన్నారనే కారణంతో 60,50,918 మంది ఓటర్లకు నోటీసులు జారీ చేసి విచారణ నిర్వహించింది. విచారణ తర్వాత వారిలో ఇప్పటివరకు 21,514 మంది ఓటర్లను తుది జాబితాలో ప్రచురించడానికి అనర్హులని ఈసీ తేల్చింది. మిగిలిన వారిలో 60,06,722 మందిని అర్హులుగా పరిగణలోకి తీసుకుంది. 

సర్‌–2002 ఓటర్ల జాబితాలో తమ పేరు/తమ బంధువుల పేరు లేక మ్యాపింగ్‌ జరగని 32,36,659 మంది ఓటర్లలో మొత్తం 33,349 మంది ఓటర్లను సైతం నోటిసులు/విచారణ ప్రక్రియల అనంతరం అనర్హులుగా గుర్తించింది. మిగిలిన ఓటర్లలో 31,65,732 మంది ఓటర్లను అర్హులుగా నిర్ధారించింది.

మ్యాపింగ్‌ జరిగిన, మ్యాపింగ్‌ జరగని కేటగిరీలు కలిపి ఇప్పటివరకు మొత్తం 54,863 మంది ఓటర్లను అనర్హులుగా ధ్రువీకరించింది. ఈ నెల 30న తుది ఓటర్ల జాబితా ప్రచురించే నాటికి ఈ సంఖ్య స్వల్పంగా పెరిగే అవకాశం ఉంది. ఎన్యూమరేషన్‌ ఫారాన్ని నింపి సమర్పించినా వారిని ఏ కారణాలతో అనర్హులుగా తేల్చారో తుది ఓటర్ల జాబితా ప్రచురించాక వెల్లడి కానుంది. వారి పేర్లను తొలగించడానికి తగిన కారణాలను ప్రకటిస్తూ స్థానిక ఎలక్టోరల్‌ రిజిస్ట్రేషన్‌ అధికారులు (ఈఆర్వో) స్పీకింగ్‌ ఆర్డర్స్‌ ఇవ్వాల్సి ఉంది.   

2.63 కోట్ల మంది అర్హులు..
రాష్ట్రంలో సర్‌–2026 ప్రక్రియ ప్రారంభానికి ముందు 3,38,26,448 మంది ఓటర్లుండగా సర్‌–2026 ప్రక్రియలో భాగంగా మొత్తం 2,64,87,213 మంది ఓటర్లు మాత్రమే నింపిన తమ ఎన్యూమరేషన్‌ ఫారాలను సమర్పించారు. దీంతో రాష్ట్రంలోని 119 శాసనసభ నియోజకవర్గాల పరిధిలో మొత్తం 2,64,87,213 మంది ఓటర్ల పేర్లతో గత ఆగస్టు 17న ముసాయిదా ఓటర్ల జాబితాను ఈసీ ప్రచురించింది. వారిలో 92,87,577 మంది ఓటర్లకు నోటీసులు జారీ చేసి విచారించాలని అప్పట్లో నిర్ణయించింది.

అందులో 60,50,918 మంది ఓటర్ల మ్యాపింగ్‌ జరిగిన వారి వివరాల్లో తార్కిక వ్యత్యాసాలున్నాయని.. మిగిలిన 32,36,659 మంది ఓటర్ల మ్యాపింగ్‌ జరగలేదని అప్పట్లో ఈసీ తెలిపింది. ముసాయిదా జాబితాలోని ఓటర్లలో మొత్తం 2,63,18,514 మంది ఓటర్లు తుది జాబితాలో ప్రచురించడానికి అర్హులని ఇప్పటివరకు నిర్ధారించింది. మరో 54,863 మందిని అనర్హులుగా తేల్చగా మిగిలిన 1,13,836 మంది ఓటర్ల విషయంలో నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. నోటీసులు జారీ చేసిన ఓటర్లలో 9,128 మంది ఇంకా విచారణలో పాల్గొనలేదు. వారికి మళ్లీ నోటీసులు జారీ చేసి విచారించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement