జిల్లా కేంద్రాల్లో ధర్మదీక్షలకు టీఎస్‌సీపీఎస్‌ఈయూ పిలుపు
సీపీఎస్ రద్దు చేసి ఓపీఎస్ పునరుద్ధరించాలని డిమాండ్
సాక్షి, హైదరాబాద్: కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్(సీపీఎస్)ను రద్దు చేసి పాత పెన్షన్ విధానం(ఓపీఎస్) పునరుద్ధరించాలనే డిమాండ్‌తో టీఎస్‌సీపీఎస్‌ఈయూ మరో ఉద్యమానికి సిద్దమైంది. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించి మూడేళ్లు పూర్తవుతున్న సందర్భంగా రేపు(నవంబర్ 17) రాష్ట్రవ్యాప్తంగా 2.15 లక్షల మంది సీపీఎస్ ఉద్యోగులు, ఉపాధ్యాయుల సామూహిక సెలవుకు పిలుపునిచ్చింది. అన్ని జిల్లా కేంద్రాల్లో పెద్ద ఎత్తున ధర్మ దీక్షలు నిర్వహించనుంది. ఇప్పటికే ఆయా విభాగాలకు 1.50 లక్షలకు పైగా సెలవు దరఖాస్తులు అందినట్లు యూనియన్ అధ్యక్ష, కార్యదర్శులు స్థితప్రజ్ఞ, కల్వాల్ శ్రీకాంత్ వెల్లడించారు.
సీపీఎస్ ఉద్యోగుల వేతనాల్లో పెన్షన్ కోసం 10 శాతం, ఆరోగ్య పథకం కోసం మరో 1.5 శాతం కోత విధిస్తున్నా పదవీ విరమణ తర్వాత గౌరవప్రదమైన పెన్షన్, వైద్య భద్రత లభించడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో 5 వేల మందికి పైగా సీపీఎస్ ఉద్యోగులు పదవీ విరమణ చేయగా, వారిలో ఎవరికీ రూ.5 వేల పెన్షన్ కూడా రావడం లేదన్నారు.
ఈ ఏడాది ఆగస్టు 23న హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన జనజాగరణ సభ తీర్మానాలను, నవంబర్ 17 సామూహిక సెలవు ఉద్యమ నిర్ణయాన్ని సెప్టెంబర్ 17న రాష్ట్ర సీఎస్ సంజయ్ జాజుకు అందజేసినట్లు వారు గుర్తుచేశారు. సీపీఎస్ రద్దుపై మూడు నెలల్లో ప్రత్యేక అధ్యయన కమిటీ ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం ఇచ్చిన హామీ ఇప్పటికీ అమలు కాలేదని విమర్శించారు.


