స్మార్ట్‌ఫోన్ స్క్రోలింగ్, ఏఐ అతి వినియోగం మనిషి ఆలోచనా శక్తికి చేటు
మెదడుకు పట్టిన డిజిటల్ తుప్పు వదలాలంటే లోతైన పఠనమే మార్గం
అక్షరాలతో ప్రయాణం.. మానసిక ఆరోగ్యానికి ఔషధం
అంతర్జాతీయ నిపుణులు, వర్సిటీల అధ్యయనాల్లో వెల్లడి
సాక్షి, హైదరాబాద్: స్మార్ట్‌ఫోన్ వేగాన్ని ఇచ్చింది.. కానీ ఆలోచించే తీరికను లాగేసుకుంది. నిరంతర స్మార్ట్‌ఫోన్ స్క్రోలింగ్, ఏఐ అతి వినియోగంతో మొద్దుబారుతున్న మన మెదడుకు పట్టిన ‘డిజిటల్ పొల్యూషన్’ను వదిలించుకోవాలంటే మళ్లీ పుస్తకాలతో స్నేహం చేయక తప్పదు. లోతైన పఠనమే నేటి తరం ‘బ్రెయిన్ రాట్’ సమస్యకు అసలైన సొల్యూషన్ అని అంతర్జాతీయ నిపుణులు, అనేక ప్రముఖ వర్సిటీలు తేల్చి చెబుతున్నాయి. అక్షరాలతో చేసే ఆ నిశ్శబ్ద ప్రయాణమే నేటి తరానికి అసలైన మానసిక ఆరోగ్య ఔషధంగా నిలుస్తుందని స్పష్టం చేస్తున్నారు.
ఏమిటీ ‘బ్రెయిన్ రాట్’ సంక్షోభం?
సోషల్ మీడియాలో నాణ్యత లేని రీల్స్, షార్ట్ వీడియోలు, క్లిక్ బైట్ వార్తలను గంటల తరబడి స్క్రోల్ చేయడం వల్ల మెదడు మొద్దుబారిపోవడాన్నే ‘బ్రెయిన్ రాట్’ అంటున్నారు. ఇటీవలి ఓ సర్వే ప్రకారం.. 18 నుంచి 29 ఏళ్ల వయసున్న యువతలో 63 శాతం మంది తాము దాదాపు నిరంతరం ఆన్‌లైన్‌లోనే ఉంటున్నట్లు అంగీకరించారు. అల్గారిథమ్‌లు అందించే సమాచారాన్ని విచక్షణ లేకుండా తీసుకోవడం వల్ల మానసిక అలసట, భావోద్వేగపరంగా మొద్దుబారడం, ఆత్మన్యూనతా భావం పెరుగుతున్నాయని ఇటీవలి అధ్యయనాలు హెచ్చరిస్తున్నాయి.
ఏఐ టూల్స్‌పై అతిగా ఆధారపడటం వల్ల ఆలోచించే శక్తి , విశ్లేషణాత్మక సామర్థ్యం వేగంగా క్షీణిస్తున్నాయని విద్యావేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. స్మార్ట్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల తెరలపై అక్షరాలను పైపైన చదవడం జ్ఞానాన్ని ఆర్జించడానికి ఏమాత్రం ఉపయోగపడదంటున్నారు.
‘లోతైన పఠనం’తో మెదడుకు చికిత్స
⇒ లోతైన పఠనం అంటే కేవలం అక్షరాలను చదవడం కాదు. రచయిత భావాలతో ప్రయాణిస్తూ అక్కడక్కడా ఆగి ఆలోచిస్తూ ప్రశ్నించుకుంటూ ముందుకు సాగడం. దీనివల్ల కలిగే ప్రయోజనాలు అద్భుతమని నిపుణులు అభివరి్ణస్తున్నారు.
⇒ ఒక సుదీర్ఘమైన కథనాన్ని ఏకాగ్రతతో చదివినప్పుడు మెదడులోని ఎడమ భాగంలో ఉన్న ఫ్రంటల్, టెంపోరల్ ప్రాంతాలు ఉత్తేజితమవుతాయి. ఇవి కొత్త ఆలోచనలకు పునాది వేస్తాయి.
⇒ నవలలు, కథలు చదివినప్పుడు పాఠకుడు ఆ పాత్రల స్థానంలో తనను తాను ఊహించుకుంటాడు. డిజిటల్ మీడియా మనుషుల మధ్య విభజన రేఖలు గీస్తుంటే, సాహిత్య పఠనం ఇతరుల బాధలను అర్థం చేసుకునే మానవీయ కోణాన్ని, సహనాన్ని పెంచుతుంది.
⇒ లోతుగా చదివే అలవాటు ఉన్నవారు తార్కికంగా> ఆలోచించడం వల్ల ఫేక్ న్యూస్ బారిన పడకుండా తమను తాము రక్షించుకోగలరు.
⇒ ఒక మంచి పుస్తకంతో గడిపే సమయం మానసిక ప్రశాంతతను ఇచ్చి ఒంటరితనాన్ని దూరం చేస్తుంది.
మార్పు ఎక్కడ మొదలవ్వాలి?
⇒రోజులో కనీసం 30 నుంచి 45 నిమిషాల పాటు ఫోన్ పక్కన పెట్టి పుస్తకాలు లేదా సుదీర్ఘమైన విశ్లేషణాత్మక వ్యాసాలు చదవడం అలవాటు చేసుకోవాలి. పరుగు పందెంలా కాకుండా ప్రతి వాక్యంలోని అంతరార్థాన్ని గ్రహిస్తూ నెమ్మదిగా చదవాలి. చదివిన దాన్ని మనకు ఇప్పటికే తెలిసిన విషయాలతో పోల్చుకుంటూ వెళ్లడం వల్ల సృజనాత్మక ఆలోచనలు పుడతాయి. ఇలా క్రమంగా బుక్ రీడింగ్‌కు వెచ్చించే సమయాన్ని పెంచుకుంటూ వెళ్లాలి. కొన్నాళ్లకు ఇదొక అలవాటుగా మారుతుంది. దీంతో డిజిటల్ బానిసత్వానికి దూరం కావొచ్చు.
అధ్యయనాలు ఏం చెబుతున్నాయి ?
⇒ స్క్రీన్‌లపై చదివే వారి కంటే కాగితపు పుస్తకాలపై చదివే వారికి విషయ అవగాహన జ్ఞాపకశక్తి చాలా ఎక్కువగా ఉంటుంది. మెదడుకు ప్రశాంతతను, ఏకాగ్రతను ఇస్తుంది. – యూనివర్సిటీ ఆఫ్ స్టావాంజర్, నార్వే
⇒ డిజిటల్ తెరలపై మనం చాలా వేగంగా చదువుతాము. దీనివల్ల మనకు అంతా అర్థమైందనే అతి విశ్వాసం కలుగుతుంది. కానీ మెదడు లోతుగా సమాచారాన్ని గ్రహించలేదు. –యూనివర్సిటీ ఆఫ్ మేరీల్యాండ్, అమెరికా
⇒ చదవడానికి లేదా సమస్యల పరిష్కారానికి ఏఐ చాట్‌బాట్‌లను వాడిన విద్యార్థులు, ఆ టూల్స్ తీసేసిన తర్వాత సొంతంగా ఆలోచించడంలో సాధారణ విద్యార్థుల కంటే కూడా వెనుకబడిపోయారు. ఏఐ వాడేటప్పుడు మెదడులో నాడీ కణాల కదలిక చాలా తక్కువగా ఉంటుంది. – స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీ, అమెరికా
⇒ జీపీఎస్ వాడటం వల్ల దారులు గుర్తుపెట్టుకునే శక్తి తగ్గినట్లే ఏఐ వాడకం వల్ల మెదడులో జ్ఞాపకశక్తి నిక్షిప్తమయ్యే ప్రక్రియ మందగిస్తోంది. –అమెరికన్ సైకలాజికల్ అసోసియేషన్


