లబ్ధిదారుల్లో అత్యధికంగా వితంతువులు 2.77లక్షలు, దివ్యాంగులు లక్ష మంది
ఈ నెల 19న లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమకు ప్రభుత్వం ఏర్పాట్లు
ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా నగదు బదిలీకి శ్రీకారం
సాక్షి, హైదరాబాద్: చేయూత సామాజిక పింఛన్ పథకం ఆశావహులకు శుభవార్త. కార్యాలయాల్లో ఏళ్లుగా నిరీక్షిస్తున్న ‘చేయూత’ దరఖాస్తులకు ప్రభుత్వం మోక్షం కల్పించింది. రాష్ట్రంలో కొత్తగా 4,63,857 మందికి పింఛన్లు మంజూరు చేసింది. ఈ నెల 19న పింఛన్ సొమ్మును లబ్ధిదారుల వ్యక్తిగత బ్యాంకు ఖాతాల్లో నేరుగా జమ చేయనుంది. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా ఈ నగదు బదిలీ కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది.
కొత్త పింఛన్ల నగదు బదిలీకి ఇప్పటికే ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది. ఇందుకు అవసరమైన అదనపు బడ్జెట్‌ను కూడా ప్రభుత్వం మంజూరు చేసింది. నగదు బదిలీ ప్రక్రియను పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ పరిధిలోని సెర్ప్ యంత్రాంగం పర్యవేక్షిస్తోంది.
వితంతువులే అత్యధికం: కొత్తగా పింఛన్లు మంజూరైన వారిలో వితంతువులు సగానికి పైగా ఉన్నారు. మొత్తంగా 4,63,857 మందికి కొత్తగా పింఛన్లు మంజూరు కాగా, వారిలో వితంతువులు 2,77,894 మంది, దివ్యాంగులు 1,00,224 మంది, ఒంటరి మహిళలు 53,844 మంది, గీత కార్మికులు 27,444 మంది, చేనేత కార్మికులు 4,451 మంది ఉన్నారు. అర్హులైన లబ్ధిదారులకు పింఛన్ మంజూరు పత్రాలను ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా పంపిణీ చేస్తున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర ప్రజాప్రతినిధులు, ప్రముఖుల చేతుల మీదుగా ఈ పత్రాలను అందజేస్తున్నారు.
పేద కుటుంబాలకు ఆర్థిక భరోసా
అర్హులైన పేదలు, మహిళలు, దివ్యాంగులు, చేనేత, గీత కార్మికులకు సామాజిక భద్రత కల్పించడమే లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క తెలిపారు. కొత్తగా మంజూరైన పింఛన్లను ఎలాంటి జాప్యం లేకుండా అందించేందుకు చర్యలు చేపట్టినట్లు వివరించారు.
ఈ నెల 19న లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ కానుండటంతో కొత్తగా పింఛన్లు పొందుతున్న 4.63 లక్షల కుటుంబాలకు ఆర్థిక భరోసా లభించనుందని, మంజూరు పత్రాల పంపిణీతో పాటు నగదు బదిలీని కూడా నిరీ్ణత తేదీనే పూర్తి చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.


