పని ఒత్తిడి లేదు.. నిర్ణీత పని వేళలు లేవు.. సెలవు కోసం ఎవర్ని అడగాల్సిన పనిలేదు. అదనంగా ఆదాయం కావాలంటే ఎక్కువ గంటలు పని చేయవచ్చు. ఆరోగ్యం బాలేకపోతే ఇంట్లోనే ఉండొచ్చు. ఒక బైక్, స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు చేతినిండా ఉపాధే. గ్రేటర్ వరంగల్ నగరంలో వేల సంఖ్యలో పార్ట్‌టైం, ఫుల్ టైం ఉపాధి పొందుతున్న బైక్ రైడర్లపై ‘సాక్షి’ సండే స్పెషల్ స్టోరీ..

ఈ ఫొటోలో కనిపిస్తున్న వ్యక్తి పేరు సందెల రాజు. ఇతనిది హసన్‌పర్తి మండలం కోమటిపల్లి. ఉద్యోగం కోసం ఎంతో ప్రయత్నించాడు. తనకున్న 30 గుంటల భూమిలో వ్యవసాయం చేస్తూ.. కుటుంబ అవసరాల కోసం బైక్ ట్యాక్సీ రైడర్‌గా మారాడు. రోజూ ఉదయం 10 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు 18 నుంచి 22 రైడ్స్ (110 నుంచి 130 కిలోమీటర్లు) పూర్తి చేస్తున్నాడు. ఫుల్ టైం రైడర్‌గా పనిచేస్తూ దాదాపు రూ.1,250 ఆర్జిస్తున్నాడు. ఖర్చులన్నీ పోగా.. రూ.750 వరకు మిగులుతున్నాయని రాజు చెబుతున్నాడు.
ఒకరు చదువుకోసం. ఒకరు కుటుంబ బాధ్యతల కోసం. మరొకరు. చిన్న చిన్న అవసరాలు తీర్చుకోవడం కోసం పార్ట్ టైం బైక్ రైడర్లుగా పనిచేసే వారు కొందరైతే.. ఈ పనినే వృత్తిగా స్వీకరించి ఫుల్ టైం పనిచేసేవారు ఇంకొందరు. ఇలా గ్రేటర్ వరంగల్ నగరంలో యాప్ ఆధారిత బైక్ ట్యాక్సీలు ఉపాధి మార్గాన్ని చూపుతున్నాయి. ప్రయాణికుల ను ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి చేరుస్తూ యువత, నిరుద్యోగులు ఉపాధి పొందుతున్నారు.
రద్దీ ప్రాంతాల్లోనే రైడ్స్..
వరంగల్ నగరంలో హనుమకొండ బస్ స్టేషన్, కాజీపేట, ఎంజీఎం, వరంగల్ బస్టాండ్, రైల్వేస్టేషన్, కాకతీయ యూనివర్సిటీ, పబ్లిక్ గార్డెన్ తదితర ప్రాంతాల్లో నిత్యం రద్దీ ఉంటుంది. ఈ ప్రాంతాల మధ్య ప్రయాణికుల రాకపోకలు ఎక్కువగా ఉంటాయి. లోకల్‌గా గమ్య స్థానాలు చేరేందుకు ఆటోలు, ఇతర రవాణా మార్గాలతోపాటు బైక్ ట్యాక్సీలు కూడా ఎంతో ఉపయోగపడుతున్నాయి. చదువుల కోసం, ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యేందుకు నగరానికి వచ్చిన వారు, ఉపాధి కోసం వెతుకుతున్న వారు రైడర్లుగా చేరి అంతో కొంతో సంపాదించుకుంటున్నారు.
మిగిలేదిలా..
బైక్ రైడర్లు పెట్రోల్, బైక్ సర్వీసింగ్, టైర్లు, ఆయిల్, ఇతర నిర్వహణ ఖర్చులతోపాటు ప్లాట్‌ఫామ్ కమీషన్ కూడా మినహాయిస్తే మిగిలిందే అసలు సంపాదన అని రైడర్లు చెబుతున్నారు. నెలకు 26 రోజులు కష్టపడితే ఒక ఫుల్‌టైమ్ రైడర్‌కు అన్ని ఖర్చులు పోనూ రూ.16 వేల నుంచి రూ. 20 వేలు మిగులుతున్నాయి. పార్ట్‌టైమ్ రైడర్లకు అన్ని ఖర్చులు పోను నెలకు రూ.7 వేల నుంచి 9 వేల వరకు మిగులుతున్నట్లు అంచనా. బైక్ ట్యాక్సీ రైడింగ్ అనేది కేవలం ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చే పని మాత్రమే కాదు. యువత తమ జీవిత లక్ష్యాల వైపు సాగేందుకు దోహదపడుతున్న ఓ చిన్న ఉపాధి మార్గం.
సగానికి పైగా విద్యార్థులే!
గ్రేటర్ వరంగల్ పరిధి హనుమకొండ, వరంగల్, కాజీపేటలో వివిధ బైక్ ట్యాక్సీ సంస్థల (ర్యాపిడో, ఓలా, ఉబర్) కింద సుమారు 3,500 మంది రైడర్లు జాయిన్ అయ్యి ఉండగా, 2,500 మంది యాక్టివ్‌గా ఉన్నారు. వీరిలో సుమారు 50 శాతం మంది కళాశాల విద్యార్థులే ఉన్నట్లు తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్‌ఫారమ్ వర్కర్స్ యూనియన్ వరంగల్ జిల్లా ఇన్‌చార్జ్ విజయ్‌కుమార్ తెలిపారు.
నెలకు రూ.3 వేలు ఇంటికి పంపుతున్నా.
పార్ట్‌టైమ్ రైడర్‌గా పనిచేస్తున్నా. ఉదయం కాలేజీకి వెళ్లే ముందు రెండు గంటలు, సాయంత్రం క్లాసులు ముగిశాక మూడు గంటలు దాదాపు 8 నుంచి 10 రైడ్స్ పూర్తి చేస్తున్నా. రోజూ రూ. 450 నుంచి రూ.550 వరకు సంపాదిస్తున్నా. ఖర్చులు పోగా మిగిలేది రూ. 350 వరకు మాత్రమే. ఈ డబ్బులతో నా హాస్టల్ ఫీజు, కాలేజీ ఖర్చులు చెల్లిస్తున్నా. నెలకు రూ.3 వేలు ఇంటికి పంపుతున్నా. మా కాళ్లపై మేం నిలబడడానికి ఇది ఎంతో ఆసరాగా నిలుస్తోంది.
– సిద్ధు, డిగ్రీ విద్యార్థి

వరంగల్ నగరంలోని ఎల్బీనగర్‌కు చెందిన ఎండీ అహ్మద్ పాషా ఉదయం కేఎంసీ సూపర్ స్పెషాలిటీలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తూ, మధ్యాహ్నం తర్వాత రాపిడో ద్వారా బైక్ నడుపుతున్నాడు. సెక్యూరిటీ ద్వారా నెలకు రూ.11,000 వేతనం, బైక్ ద్వారా పెట్రోలు కమీషన్ ఖర్చులు పోను రోజుకు రూ.500 ఆదాయం వస్తుంది. ఈ డబ్బులతోనే కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ‘కేఎంసీ సూపర్ స్పెషాలిటీలో ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 2గంటల వరకు, మధ్యాహ్నం 2నుంచి రాత్రి 10 గంటల వరకు బైక్ నడుపుతున్నా. ఈ రోజుల్లో రెండు పనులు చేయకపోతే బతికే పరిస్థితి లేదు’ అని అహ్మద్ పాషా అంటున్నాడు.
– సాక్షి, వరంగల్


