breaking news
Part-time job
-
ప్రేయసి దూరమైందని అమెరికాలో ఆత్మహత్య..!
హైదరాబాద్: చదువుకునేందుకు అమెరికా వెళ్లిన ఓ యువకుడు ప్రేమించిన యువతి దూరం కావడంతో ఆ బాధ తట్టుకోలేక ఈనెల 21న ఆత్మహత్య చేసుకున్నాడు. ఇందుకు సంబంధించి కుటుంబసభ్యులు, సన్నిహితులు తెలిపిన మేరకు.. మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ దమ్మాయిగూడలోని శ్రీనివాస్‌నగర్ కాలనీకి చెందిన కృష్ణ, విజయలక్ష్మి దంపతుల కుమారుడు సాయిప్రదీప్(29) 2024లో మాస్టర్స్ చదువు కోసం అమెరికా వెళ్లారు. టెక్సాస్‌లోని శాన్ ఆంటోనియోలో తన అన్న ప్రణీత్‌తో కలిసి ఉంటూ అండర్సన్ యూనివర్సిటీ ఆఫ్ బిజినెస్ నుండి మూడు నెలల క్రితం మాస్టర్స్ పూర్తి చేశారు. ప్రస్తుతం అమెరికాలో పార్ట్ టైమ్ జాబ్ చేస్తూ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నారు. అమెరికాలో ఉంటున్న సిద్ధిపేటకు చెందిన యువతిని ప్రదీప్ 9 నెలల పాటు ప్రేమించారు. ఇద్దరూ వివాహం చేసుకోవాలని నిశ్చయించుకున్నారు. ఈ విషయాన్ని సాయి ప్రదీప్ తన తల్లిదండ్రుల దృష్టికి తీసుకెళ్లారు. ముందు తల్లిదండ్రులు అంగీకరించకపోయినా చివరకు ఒప్పుకున్నారు. ఇంతలోనే ప్రేమించిన యువతి దూరంగా ఉంటోంది. సున్నిత మనస్తత్వం కలిగిన ప్రదీప్ ఇది తట్టుకోలేక మానసిక ఒత్తిడికి గురయ్యాడు. ఈ క్రమంలో ఈ నెల 21న ప్రేయసికి దాదాపు పది సార్లు ఫోన్ చేసినా స్పందించలేదు. తను చేస్తున్న జాబ్ బాధ్యతలను రెండు గంటల పాటు నిర్వర్తించాలని అన్నకు అప్పగించారు. ఆ తరువాత ఇంటికి వెళ్లి ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో ఈ ఘటన గురించి తల్లిదండ్రులకు ప్రణీత్ తెలిపారు. ప్రేయసి దూరం కావడంతోనే తమ్ముడు ప్రదీప్ తీవ్ర మానసిక ఒత్తిడికి లోనై ఆత్మహత్య చేసుకున్నాడని.. ఆమెపై చర్యలు తీసుకోవాలని అమెరికాలో పోలీసులకు ప్రణీత్ ఫిర్యాదు చేశారని మృతుని తండ్రి కృష్ణ తెలిపారు. మృతదేహాన్ని ఈ నెలాఖరులోపు తెప్పించేందుకు ప్రయతి్నస్తున్నారు. ఇదిఆ ఉండగా ప్రదీప్‌కు చిన్నతనంలోనే కిడ్నీ సమస్య ఉండటంతో ఒక కిడ్నీని వైద్యులు తొలగించారు. సాయిప్రదీప్ తల్లిదండ్రులను కాంగ్రెస్ పార్టీ దమ్మాయిగూడ డివిజన్ అధ్యక్షుడు రామారావు, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ మాదిరెడ్డి నరేందర్‌రెడ్డి, కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్‌రెడ్డి, బీఆర్ఎస్ నేత హరిగౌడ్ తదితరులు పరామర్శించి ధైర్యం చెప్పారు. -
పార్ట్‌టైం ఉద్యోగం పేరుతో సైబర్ మోసగాళ్ల వల
గోదావరిఖని: పార్ట్‌టైం ఉద్యోగం ఎరచూపి సైబర్ మోసగాళ్లు ఓ గృహిణి నుంచి రూ.31.60 లక్షలు కాజేశారు. గోదావరిఖని సైబర్ క్రైం ఏసీపీ వెంకటరమణ కథనం ప్రకారం.. మంచిర్యాల జిల్లాకు చెందిన ఓ గృహిణికి ఇన్‌స్ట్రాగామ్‌లో సైబర్ మోసగాళ్లు పరిచయమయ్యారు. మాటల్లో పెట్టి పార్ట్‌టైం ఉద్యోగం ఇప్పిస్తామని, దీనిద్వారా ఆదాయం వస్తుందని నమ్మించారు. ఇందుకోసం తొలుత తమకు రూ.10 వేలు డిపాజిట్‌గా పంపించాలని చెప్పారు. ఆ తర్వాత ఆమె అకౌంట్‌కు రూ.13 వేలు పంపించారు. మరోసారి రూ.10 వేలు పంపిస్తే రూ.18 వేలు ఖాతాలో జమచేశారు. ఇలా రూ.లక్ష వరకు పంపించగా.. ఇక టాస్క్ ప్రారంభమైందని, అది పూర్తయ్యే వరకూ సొమ్ము పంపించాలని చెప్పగానే.. విడతల వారీగా రూ.31.60 లక్షలను ఆమె అవతలి వ్యక్తుల బ్యాంకు ఖాతాలకు పంపించింది. ఆ తర్వాత ఉద్యోగం రాకపోగా, వారి నుంచి సమాచారం కూడా లేకపోవడంతో తాను మోసపోయానని గ్రహించి శనివారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న సైబర్ క్రైం సీఐ కృష్ణకుమార్.. హైదరాబాద్ మలక్‌పేట్‌కు చెందిన సోహెల్ రెస్టారెంట్లో పనిచేస్తున్న మహమ్మద్ అవాద్‌ను నిందితుడిగా గుర్తించారు. అతడిని అదుపులోకి తీసుకుని విచారించగా.. తన పేరిట బ్యాంకుల్లో మూడు ఖాతాలు తెరిచి ఇలియాస్ అనే వ్యక్తికి ఇచ్చానని, ఇందులో డబ్బు జమచేస్తామని, ఆ తర్వాత తమ బ్యాంకులోకి మళ్లించుకుంటారని చెప్పాడు. ఈ మేరకు నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. అసలు సైబర్ మోసగాళ్లను పట్టుకునేందుకు పోలీసులు రంగంలోకి దిగారు. -
వీఆర్ఓ, వీఆర్ఏ ఫలితాలు విడుదల
కలెక్టరేట్, న్యూస్‌లైన్ : జిల్లాలో ఖాళీగా ఉన్న వీఆర్ఓ, వీఆర్ఏ పోస్టుల భర్తీ కోసం ఈనెల 2న నిర్వహించిన రాత పరీక్ష ఫలితాలను అధికారులు శనివారం ప్రకటించారు. జిల్లాలో 62 వీఆర్ఓ పోస్టులకు 76,179మంది, 177 వీఆర్ఏ పోస్టులకు 4519 మంది అభ్యర్థుల మార్కులను వెల్లడించారు. పరీక్ష నిర్వహణకు 200 కేంద్రాలను ఏర్పాటు చేశారు. విద్యారణ్యపురి, న్యూస్‌లైన్ : శనివారం విడుదలైన విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ (వీఆర్ఓ) ఉద్యోగాల ఫలితాల్లో ఖానాపురం మండలం రాగంపేటకు చెందిన ఎలగందుల శ్రీకాంత్ 98 మార్కులు సాధించి జిల్లా టాపర్‌గా నిలిచారు. వ్యవసాయ కుటుంబానికి చెందిన ఆయన ఖానాపురంలో ఇంటర్ వరకు చదువుకున్నారు. ఆర్థిక పరిస్థితులు సరిగా లేకపోవడంతో రెగ్యులర్‌గా చదువుకోకుండా హైదరాబాద్‌లో పార్ట్‌టైం ఉద్యోగం చేసుకుంటూ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీ(బీఏ) పూర్తిచేశారు. 2012 సంవత్సరంలో కానిస్టేబుల్‌గా ఎంపికయ్యారు. అయి తే ఆప్షన్‌గా ఫైర్‌మెన్‌గా ఉద్యోగం పొందారు. శ్రీకాంత్ ప్రస్తుతం జనగామలో ఫైర్‌మెన్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. అయితే శ్రీకాంత్ ఈ ఏడాది ఫిబ్రవరి 2న జరిగిన వీఆర్వో పరీక్ష రాసి జిల్లా టాపర్‌గా నిలిచారు. ‘గ్రూప్-1 ఉద్యోగం సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నా.అరుుతే గ్రూపు-2 కోసం ప్రిపేర్ అవుతున్న దశలో వీఆర్వో ఉద్యోగాలకు నోటిఫికేషన్ రావడంతో దీనికి దరఖాస్తు చేశాను. గ్రూపు-2కు ప్రిపేర్ కావడం కూడా తనకు ఈవీఆర్వో పరీక్షకు ఉపయోగపడింది. పోలీస్ కానిస్టేబుల్‌కు ఎంపికైనప్పుడు తనకు సివిల్, ఫైర్స్టేషన్లలో ఉద్యోగాలకు అవకాశం రాగా ఫైర్‌మెన్ ఉద్యోగిగా ఆప్షన్ తీసుకొని పనిచేస్తున్నాను. వీఆర్వో రాతపరీక్షకు హాజరై 99 మార్కులకు గాను 98 మార్కులతో టాపర్‌గా నిలవడం సంతోషంగా ఉంది. ఫైర్‌మెన్ నుంచి వీఆర్వోగా విధుల్లో చేరుతాను. అయితే ఇది కూడా చిరుద్యోగమే అయినా ఫైర్ మెన్ కంటే కొంత ప్రశాంతంగా ఉంటుంది. వీఆర్వో ఉద్యోగంతోనే సరిపుచ్చుకోవాలని లేదు. గ్రూప్-1 ఉద్యోగాన్ని సాధించాలనే తపన ఉంది. ఆ దిశగా ప్రిపరేషన్ కొనసాగిస్తాను’ అని శ్రీకాంత్ చెప్పారు.


