పార్ట్‌టైం ఉద్యోగం పేరుతో సైబర్‌ మోసగాళ్ల వల | Cyber Crime incident in mancherial | Sakshi
Sakshi News home page

పార్ట్‌టైం ఉద్యోగం పేరుతో సైబర్‌ మోసగాళ్ల వల

Dec 22 2024 4:28 AM | Updated on Dec 22 2024 4:28 AM

Cyber Crime incident in mancherial

రూ.31.60 లక్షలు పోగొట్టుకున్న గృహిణి

గోదావరిఖని: పార్ట్‌టైం ఉద్యోగం ఎరచూపి సైబర్‌ మోసగాళ్లు ఓ గృహిణి నుంచి రూ.31.60 లక్షలు కాజేశారు. గోదావరిఖని సైబర్‌ క్రైం ఏసీపీ వెంకటరమణ కథనం ప్రకారం.. మంచిర్యాల జిల్లాకు చెందిన ఓ గృహిణికి ఇన్‌స్ట్రాగామ్‌లో సైబర్‌ మోసగాళ్లు పరిచయమయ్యారు. మాటల్లో పెట్టి పార్ట్‌టైం ఉద్యోగం ఇప్పిస్తామని, దీనిద్వారా ఆదాయం వస్తుందని నమ్మించారు. 

ఇందుకోసం తొలుత తమకు రూ.10 వేలు డిపాజిట్‌గా పంపించాలని చెప్పారు. ఆ తర్వాత ఆమె అకౌంట్‌కు రూ.13 వేలు పంపించారు. మరోసారి రూ.10 వేలు పంపిస్తే రూ.18 వేలు ఖాతాలో జమచేశారు. ఇలా రూ.లక్ష వరకు పంపించగా.. ఇక టాస్క్‌ ప్రారంభమైందని, అది పూర్తయ్యే వరకూ సొమ్ము పంపించాలని చెప్పగానే.. విడతల వారీగా రూ.31.60 లక్షలను ఆమె అవతలి వ్యక్తుల బ్యాంకు ఖాతాలకు పంపించింది. 

ఆ తర్వాత ఉద్యోగం రాకపోగా, వారి నుంచి సమాచారం కూడా లేకపోవడంతో తాను మోసపోయానని గ్రహించి శనివారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న సైబర్‌ క్రైం సీఐ కృష్ణకుమార్‌.. హైదరాబాద్‌ మలక్‌పేట్‌కు చెందిన సోహెల్‌ రెస్టారెంట్‌లో పనిచేస్తున్న మహమ్మద్‌ అవాద్‌ను నిందితుడిగా గుర్తించారు. 

అతడిని అదుపులోకి తీసుకుని విచారించగా.. తన పేరిట బ్యాంకుల్లో మూడు ఖాతాలు తెరిచి ఇలియాస్‌ అనే వ్యక్తికి ఇచ్చానని, ఇందులో డబ్బు జమచేస్తామని, ఆ తర్వాత తమ బ్యాంకులోకి మళ్లించుకుంటారని చెప్పాడు. ఈ మేరకు నిందితుడిని అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. అసలు సైబర్‌ మోసగాళ్లను పట్టుకునేందుకు పోలీసులు రంగంలోకి దిగారు.  
 

Advertisement
 
Advertisement
Advertisement