మెదక్‌ ఇన్‌స్టా లవర్ బాయ్ గేమ్ ఓవర్ | Instagram Love Scam, Man Arrested After He Cheats Two Women Of ₹12 Lakh And Gold, More Details Inside | Sakshi
Sakshi News home page

మెదక్‌ ఇన్‌స్టా లవర్ బాయ్ గేమ్ ఓవర్

Jun 19 2026 10:37 AM | Updated on Jun 19 2026 10:59 AM

Medak Insta Lover Boy Arrested After Two Girls Approach Police

సోషల్ మీడియా పరిచయాలు కొన్నిసార్లు ఎంత ప్రమాదకరంగా మారతాయో తెలిపే ఘటన మెదక్ జిల్లా టేక్మాల్ మండలంలో వెలుగులోకి వచ్చింది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఫేక్ ఐడీలతో ప్రేమ నాటకం ఆడిన ఓ కేటుగాడు, ఇద్దరు యువతులను మోసం చేసి మొత్తం రూ.12 లక్షలతో పాటు తులం బంగారం దోచుకున్న ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది.

పోలీసులు, బాధితులు వెల్లడించిన వివరాల ప్రకారం.. టేక్మాల్ మండలం ఎల్లంపల్లి, ఏక్లాస్‌పూర్ గ్రామాలకు చెందిన ఇద్దరు యువతులు ఇన్‌స్టాగ్రామ్ ద్వారా “సాత్విక్ రెడ్డి”, “రిత్విక్ రెడ్డి” అనే పేర్లతో ఉన్న ఖాతాల ద్వారా ఓ వ్యక్తితో పరిచయం ఏర్పరుచుకున్నారు. మాటలతో నమ్మకం సంపాదించిన ఆ వ్యక్తి, తనను తాను ప్రేమలో ఉన్నవాడిగా, పెళ్లి చేసుకుంటానని నమ్మబలికాడు.

ఈ నమ్మకాన్ని ఆసరాగా తీసుకుని, కుటుంబ సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు వంటి కథలు అల్లుతూ దశలవారీగా వారి వద్ద నుంచి నగదు, బంగారం తీసుకున్నాడు. కొంతకాలానికి అనుమానం రావడంతో బాధితులు కుటుంబ సభ్యులకు విషయం తెలిపారు. అనంతరం ఇది పూర్తిగా మోసమని తేలడంతో టేక్మాల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు, ఈ ఫేక్ ఇన్‌స్టాగ్రామ్ ఐడీల వెనుక ఉన్నది ఎల్లంపల్లి గ్రామానికి చెందిన దుర్గయ్య అని గుర్తించారు. సోషల్ మీడియాలో హ్యాండ్సమ్ లుక్‌తో, వేరే పేర్లతో పరిచయాలు పెంచుకుని పలువురిని లక్ష్యంగా చేసుకున్నట్లు ప్రాథమిక విచారణలో తేలింది. ప్రస్తుతం నిందితుడు పోలీసుల అదుపులో ఉన్నాడు.

సోషల్ మీడియా పరిచయాల్లో అజాగ్రత్తగా నమ్మకం పెట్టుకోవద్దని, వ్యక్తిగత సమాచారం లేదా ఆర్థిక లావాదేవీల విషయంలో జాగ్రత్తగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement