మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి
ఇప్పటికే రూ. 2 వేల కోట్లు విడుదల.. త్వరలో మరో రూ.3 వేల కోట్లు
ఉమ్మడి కరీంనగర్‌లోని సాగునీటి ప్రాజెక్టులపై సమీక్ష
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల భూసేకరణ, పునరావాసం–పునర్నిర్మాణానికి నిధుల కొరత లేకుండా ప్రభుత్వం చర్యలు చేపడుతోందని, ఇందుకోసం రూ.5 వేల కోట్లు సమకూర్చేందుకు సీఎం రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చారని నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. ఇప్పటికే రూ.2 వేల కోట్లు విడుదల కాగా.. మరో రూ.3 వేల కోట్ల విడుదల ప్రక్రియ కొనసాగుతోందన్నారు. నిధుల కొరతతో పూర్తికి చేరువైన ఏ సాగునీటి ప్రాజెక్టు కూడా నిలిచిపోకూడదని స్పష్టం చేశారు.
కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల జిల్లాల పరిధిలోని సాగునీటి ప్రాజెక్టులపై శనివారం సచివాలయంలో నిర్వహించిన సమీక్షలో మంత్రి అధికారులకు పలు ఆదేశాలు జారీ చేశారు. ఉమ్మడి కరీంనగర్ ఇన్‌చార్జి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఇతర మంత్రులు శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, ప్రభుత్వ విప్‌లు సీహెచ్ విజయ రమణారావు, ఆది శ్రీనివాస్, ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్, కౌశిక్‌రెడ్డి, మేడిపల్లి సత్యం, ఎమ్మెల్సీలు భాను ప్రకాశ్ రావు, అంజిరెడ్డి, ఎల్. రమణ, నాలుగు జిల్లాల కలెక్టర్లు, నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
భూసేకరణ, పునరావాసం–పునర్నిర్మాణం, అటవీ, పర్యావరణ అనుమతులను సాధారణ అంశాలుగా చూడకుండా అత్యంత ప్రాధాన్యంగా పరిష్కరించాలని కలెక్టర్లను ఉత్తమ్ ఆదేశించారు. ఏ ప్రాజెక్టుకు ఎంత నిధులు అవసరమో వెంటనే ప్రతిపాదనలు పంపాలని సూచించారు. ఆర్థిక అనుమతులు, నిధుల విడుదలకు సంబంధించిన ప్రక్రియలో జాప్యం చేయొద్దన్నారు. ఇంజనీరింగ్ పనులు కొనసాగుతూనే.. వీలైన ప్రాంతాల్లో భూసేకరణ, భూ యజమానులకు పరిహారం, నిర్వాసిత కుటుంబాలకు పునరావాస చర్యలను సమాంతరంగా చేపట్టాలని సూచించారు.
మిడ్‌మానేరు ఎడమ కాలువకు మళ్లీ కదలిక
సుమారు నాలుగున్నరేళ్లుగా నిలిచిపోయిన మిడ్‌మానేరు ఎడమ కాలువ మిగులు పనులను వెంటనే ప్రారంభించాలని మంత్రి ఆదేశించారు. భూసంబంధిత సమస్యలను త్వరగా పరిష్కరించాలని సూచించారు. సవరించిన అంచనాలు, భూసేకరణ, టెండర్లు, చట్టబద్ధ అనుమతుల ప్రక్రియలను సమాంతరంగా పూర్తి చేయాలని స్పష్టం చేశారు. నిర్దిష్ట కాలపరిమితితో కార్యాచరణ రూపొందించి పనులు మళ్లీ నిలిచిపోకుండా చూడాలన్నారు.పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలో ప్రతిపాదించిన శ్రీ లక్ష్మీనరసింహస్వామి పత్తిపాక రిజర్వాయర్ ప్రాజెక్టును వేగంగా ముందుకు తీసుకెళ్లాలని ఉత్తమ్ ఆదేశించారు.
ధర్మపురి, చొప్పదండి, పెద్దపల్లి, రామగుండం, మంథని నియోజకవర్గాలకు ఈ ప్రాజెక్టు వల్ల ప్రయోజనం చేకూరనుందన్నారు. జగిత్యాల జిల్లా బీర్‌పూర్ మండలంలోని రోళ్లవాగు ప్రాజెక్టు పనులు 96 శాతం పూర్తయ్యాయని, ప్రస్తుతం ఉన్న 0.250 టీఎంసీల నిల్వ సామర్థ్యాన్ని 0.949 టీఎంసీలకు పెంచి చివరి ఆయకట్టులోని దాదాపు 15 వేల ఎకరాలకు సాగునీరు అందించడమే లక్ష్యం అని మంత్రి చెప్పారు. ప్రాజెక్టుల వారీగా పెండింగ్‌లో ఉన్న భూసేకరణ, ఆర్‌అండ్‌ఆర్, అటవీ, పర్యావరణ అనుమతులపై ప్రత్యేక జాబితా రూపొందించాలని ఉత్తమ్ ఆదేశించారు.


