‘ఫ్యూచర్‌’లో డ్రైవర్‌లెస్‌ మొబిలిటీ | Bhatti Vikramarka on a tour of America | Sakshi
Sakshi News home page

‘ఫ్యూచర్‌’లో డ్రైవర్‌లెస్‌ మొబిలిటీ

Aug 9 2026 4:46 AM | Updated on Aug 9 2026 4:46 AM

Bhatti Vikramarka on a tour of America

అందుకుగల అవకాశాలు పరిశీలించండి 

‘వేమో’ప్రతినిధులతో భేటీలో డిప్యూటీ సీఎం భట్టి  

శాన్‌ఫ్రాన్సిస్కోలో ఆ సంస్థ డ్రైవర్‌లెస్‌ కారులో ప్రయాణం 

తెలంగాణ ప్రవాసులతో సమావేశం.. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని పిలుపు 

సాక్షి, హైదరాబాద్‌: నూతన తరం మొబిలిటీ సాంకేతికతను హైదరాబాద్, ఫ్యూచర్‌ సిటీలలో అనుసంధానించే అవకాశాలను పరిశీలించాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వేమో (గూగుల్‌ మాతృసంస్థ ఆల్ఫాబెట్‌కు చెందిన రోబో ట్యాక్సీ సేవల సంస్థ) ప్రతినిధులను కోరారు. అమెరికా పర్యటనలో భాగంగా శాన్‌ఫ్రాన్సిస్కోలోని భారత కాన్సులేట్‌ జనరల్‌ (సీజీఐ ఎస్‌ఎఫ్‌ఓ) ఆధ్వర్యంలో నిర్వహించిన మీట్‌ అండ్‌ గ్రీట్‌ కార్యక్రమంలో బే ఏరియాకు చెందిన తెలుగు ప్రవాసులు, పారిశ్రామికవేత్తలు, సాంకేతిక నిపుణులు, వృత్తి నిపుణులతో భట్టి సమావేశమయ్యారు. ఇందుకోసం ఆయన వేమో స్వయంచాలక (డ్రైవర్‌లెస్‌) వాహనంలో ప్రయాణించారు.

అనంతరం వేమో ప్రతినిధులతో సమావేశమై స్వయంచాలక వాహన సాంకేతికత, దాని నిర్వహణకు అవసరమైన మౌలిక సదుపాయాలు, నియంత్రణ విధానాలపై వివరాలు తెలుసుకున్నారు. హైదరాబాద్‌ నగరంతోపాటు ప్రతిపాదిత ఫ్యూచర్‌ సిటీలో స్వయంచాలక మొబిలిటీ పరిష్కారాలను ప్రయోగాత్మకంగా అమలు చేసే అవకాశాలపై ఆరా తీశారు. ఇందుకు అవసరమైన అధిక రిజల్యూషన్‌ మ్యాపింగ్, సెన్సార్‌ అనుకూల రోడ్డు డిజైన్, ప్రత్యేక టెస్టింగ్‌ కారిడార్లు, డేటా కనెక్టివిటీ, ఏఐ కంప్యూటింగ్‌ మౌలిక సదుపాయాల గురించి వేమో ప్రతినిధులను అడిగి తెలుసుకున్నారు. స్వయంచాలక వాహనాల ట్రయల్స్, భవిష్యత్‌ విస్తరణకు అవకాశాలపై చర్చించారు. 

ప్రవాసులు భాగస్వాములు కావాలి.. 
తెలంగాణలో పెట్టుబడులకు అనుకూలమైన వాతావరణం.. పరిశ్రమలకు అవసరమైన భూమి, నైపుణ్యంగల మానవ వనరులు, నిరంతర విద్యుత్‌ సరఫరా, మెరుగైన మౌలిక సదుపాయాలు రాష్ట్ర బలాలని భట్టి విక్రమార్క పేర్కొన్నారు. తెలంగాణను దేశంలోనే అత్యంత ఆకర్షణీయ పెట్టుబడుల గమ్యస్థానంగా తీర్చిదిద్దుతున్నామని చెప్పారు. ఐటీ, ఫార్మా, గ్రీన్‌ ఎనర్జీ, అధునాతన తయారీ, నాలెడ్జ్‌ ఆధారిత పరిశ్రమలపై దృష్టి సారించి తెలంగాణ ఆర్థిక వ్యవస్థను 3 ట్రిలియన్‌ డాలర్ల స్థాయికి తీసుకెళ్లడమే ప్రభుత్వ లక్ష్యమని వివరించారు. ఈ అభివృద్ధి ప్రయాణంలో తెలంగాణ ప్రవాసులు భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడంతోపాటు సాంకేతికత, ఆవిష్కరణలు, పరిశ్రమల విస్తరణలో భాగస్వాములు కావాలని కోరారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement