టైటిల్: కొరియన్ కనకరాజు
నటీనటులు: వరుణ్ తేజ్, రితికా నాయర్, సత్య, సునీల్ తదితరలు
నిర్మాణ సంస్థ: యువి క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్
నిర్మాతలు :రాజీవ్ రెడ్డి, సాయిబాబు జాగర్లమూడి
రచయిత, దర్శకుడు: మేర్లపాక గాంధీ
సంగీతం: తమన్ ఎస్.ఎస్
సినిమాటోగ్రాఫర్: మనోజ్ రెడ్డి
ఎడిటర్: సత్య జి
విడుదల తేది: ఆగస్ట్ 7, 2026
మెగా హీరో వరుణ్ తేజ్ ఖాతాలో హిట్ పడి చాలా కాలమైంది. వరుస సినిమాలు చేస్తున్నప్పటికీ బాక్సాఫీస్ వద్ద మాత్రం బోల్తా పడుతున్నాడు. దీంతో ఈ సారి ఎలాగైనా హిట్ కొట్టాలనే కసితో హారర్ కామెడీ ‘కొరియన్ కనకరాజు’తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన టీజర్, ట్రైలర్‌కు మంచి స్పందన లభించింది. దానికి తోడు ప్రమోషన్స్ కూడా గట్టిగా చేయడంతో ‘కొరియన్ కనకరాజు’పై హైప్ క్రియేట్ అయింది. భారీ అంచనాల మధ్య నేడు(ఆగస్ట్ 7) విడుదలైన ఈ చిత్రం ఎలా ఉంది? ఈ మూవీతో వరుణ్ తేజ్ హిట్ ట్రాక్ ఎక్కడా లేదా? రివ్యూలో చూద్దాం.
కథ ఏంటంటే?
కొరియాలో ఓ వ్యక్తి చనిపోతాడు. అతని అస్తికలు అనంతపూర్‌లోని పెనుగొండకు వస్తాయి. ఆ ఊర్లోనే కనకరాజు (వరుణ్ తేజ్) ఉంటాడు. తన ఫ్రెండ్ కిష్టప్ప (సత్య) ఫోటో స్టూడియోలోనే తన చెక్క భజన బృందాన్ని కూడా నిర్వహిస్తుంటాడు. అక్కడ చెంగా రెడ్డి (సునీల్) మనుషులు, మేనల్లుడు కర్రి శీను (టెంపర్ వంశీ)తో కనకరాజుకి నిత్యం గొడవలు జరుతుంటాయి. అదే ఊరికి చెందిన చైత్ర (రితికా నాయక్) కియా కంపెనీలో పని చేస్తూ, కొరియాకి వెళ్లి సెటిల్ అవ్వాలనే లక్ష్యంతో ఉంటుంది. అలాంటి చైత్రని కనకరాజు ఇష్టపడతాడు. కనకరాజు ఒంట్లోకి ఆ కొరియా ఆస్థికలు వెళ్తాయి. అక్కడి నుంచి కనకరాజు కొరియాలో మాట్లాడేస్తుంటాడు. కొరియా భాషను అర్థం చేసుకునే చైత్ర ఆ ఆత్మ చివరి కోరికను తెలుసుకుంటుంది. దీంతో కనకరాజు, చైత్ర, కిష్టప్ప కొరియాకి వస్తారు. ఆ తర్వాత ఏం జరిగింది? అసలు కనకరాజు ఒంట్లో నుంచి ఆ కొరియన్ ఆత్మ బయటకు వెళ్తుందా? ఆ కొరియన్ డాన్‌ను చంపింది ఎవరు? చివరకు ఆ ఆత్మ నుంచి కనకరాజుకి విముక్తి లభించిందా? లేదా? అన్నది కథ.
ఎలా ఉందంటే..
‘కొరియన్ కనకరాజు’ కథని చూస్తే మేర్లపాక గాంధీ ఇంకా ఏ కాలంలో ఉన్నాడా? అని అనిపిస్తుంది. ఎప్పుడో అరిగిపోయిన ఆత్మల కథను తీసుకు వచ్చి ఇప్పుడు మళ్లీ ఆడియెన్స్‌కి అందించాడు. అయితే ఇక్కడ కొరియా ఆత్మని తీసుకోవడం...దానికి పెనుగొండ బ్యాక్ డ్రాప్ పెట్టడం కాస్త కొత్తదనం. మిగతాదంతా రోటీన్. ఊహకందలే సాగుతుండటం ప్రధానంగా మైనస్ అని చెప్పుకోవచ్చు. అయితే కథ ఎలా రాసుకున్నా కూడా కామెడీ ట్రాక్ మాత్రం అదిరిపోయింది. సత్యతో చేయించిన కామెడీనే ఈ సినిమాని నిలబెడుతుంది.
ఫస్టాఫ్ రొటీన్‌గా సాగుతుంది. హీరో ఎంట్రీ.. ఆ ఎంట్రీలోనే పాట, ఫైట్ అన్నట్టుగా ఉంటుంది. ఆ తర్వాత హీరోయిన్ ఎంట్రీ, లవ్ ట్రాక్.. కాసేపటికి మళ్లీ ఫైట్, ఆ తర్వాత కామెడీ సీన్ అన్నట్టుగా ఫస్ట్ హాఫ్ సాగుతుంది. కనకరాజులోకి ఆత్మ వచ్చిన తర్వాత కథ ఆసక్తికరంగా మారుతుంది.
అయితే ఇంటర్వెల్ బ్లాక్ కాస్త ఇంట్రెస్ట్‌గానే అనిపిస్తుంది. సెకండాఫ్ లో వచ్చే కొరియన్ డాన్ ఫ్లాష్ బ్యాక్ ఆసక్తికరంగా ఉంటుంది. ఆత్మలు, పూజలు అంటూ చేసే సీన్లలోనూ లాజిక్స్ కనిపించవు. అవి మరీ సిల్లీగా అనిపిస్తాయి. అయితే ఇలాంటి సీన్లన్నీ కూడా సత్య కామెడీతో కనిపించకుండా పోతాయి. క్లైమాక్స్ అయితే మరీ ఘోరంగా ఉంటుంది. ఆ ఏఐ షాట్స్, ఆత్మలు కొట్టుకునే సీన్లు ట్రోలింగ్ మెటీరియల్ అయ్యే అవకాశం ఉంది. క్లైమాక్స్ మాత్రం నిరాశ పర్చేలానే ఉంది.
ఎవరెలా చేశారంటే..
ఇందులో వరుణ్ తేజ్ రెండు డిఫరెంట్ పాత్రలను పోషించి మెప్పించాడు. రాయలసీమలోని పల్లెటూరి కుర్రాడు కనకరాజుగా, , కొరియన్ ఆత్మ ఆవహించిన తర్వాత గ్యాంగ్ స్టర్‌గా.. రెండు విభిన్న పాత్రలో కనిపించిన వరుణ్.. ప్రతి పాత్రలోనూ వేరియేషన్ చూపించి ఆకట్టుకున్నాడు. యాక్షన్‌తో పాటు కామెడీ కూడా బాగా పండించాడు. ఇక రితికా నాయర్ తెరపై అందంగా కనిపించింది. ఇక ఈ సినిమాలో వరుణ్ తర్వాత బాగా పండిన పాత్ర సత్యది. తనదైన కామెడీ టైమింగ్‌తో అదరగొట్టేశాడు. వరుణ్, సత్య కాంబోలో వచ్చే కామెడీ సీన్లు బాగా నవ్విస్తాయి. బుల్లిరాజు కూడా మరోసారి నవ్వులు పూయించాడు. సిునీల్ తో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. సాంకేతికంగా సినిమా బాగుంది. తమన్ నేపథ్య సంగీతం బాగుంది. పాటలు పర్వాలేదు. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్ ఓకే. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి.


