‘మిస్సింగ్‌ మేఘన’మూవీ రివ్యూ అండ్‌ రేటింగ్‌ | Missing Meghana Movie Review And Rating In Telugu, A Suspense Thriller With Twists That Keep You Curious | Sakshi
Sakshi News home page

Missing Meghana Reveiw: ‘మిస్సింగ్‌ మేఘన’మూవీ రివ్యూ అండ్‌ రేటింగ్‌

Sep 18 2026 9:52 AM | Updated on Sep 18 2026 10:40 AM

Missing Meghana Movie Review And Rating In Telugu

చిన్న సినిమా అయినా.. ట్రైలర్‌తో మంచి హైప్‌ క్రియేట్‌ చేసుకున్న చిత్రం మిస్సింగ్‌ మేఘన. రామ్‌ కార్తీక్, అమ్ము అభిరామి, వైదిక సెంజాలియా, అంకిత్‌ కొయ్య ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సస్పెన్స్‌ అండ్‌ మిస్టరీ చిత్రానికి వాచస్పతి దర్శకత్వం వహించారు. ఇటీవల విడుదలైన పాటలు, ట్రైలర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. దానికి తోడు ప్రమోషన్స్‌ కూడా బాగానే చేయడంతో ‘మిస్సింగ్‌ మేఘన’పై హైప్‌ క్రియేట్‌ అయింది. మంచి అంచనాలతో నేడు(సెప్టెంబర్‌  18) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉంది? రివ్యూలో చూద్దాం.

కథేంటంటే.. 
ఈ సినిమ కథంతా విశాఖపట్నంలో జరుగుతుంది. సొంతంగా బేకరీ రన్‌  చేస్తున్న మేఘన(అమ్ము అభిరామి) రాత్రి పది దాటినా..ఇంటికి రాకపోవడంతో ఆమె తండ్రి(గోపరాజు రమణ) పోలీసులను ఆశ్రయిస్తాడు. వాళ్లు పట్టించుకోకపోవడంతో కాబోయే అల్లుడు ఏసీపీ అర్జున్(కౌశిక్) కి చెప్తాడు. అతను రంగంలోకి దిగి విచారణ చేపట్టగా.. బ్యాంకు మేనేజర్‌తో గొడవ జరిగిందనే విషయం తెలుస్తుంది. అతన్ని విచారిస్తే.. మేఘన మిస్సింగ్‌ తో తనకు సంబంధం లేదని చెబుతాడు. అలా అనుమానితులను ఒక్కొక్కరిని విచారించగా.. చివరగా బైక్‌ రైడర్‌  కార్తీక్‌ (రామ్‌ కార్తీక్‌) ఆమెను ఓ చోట డ్రాప్‌ చేశారనే విషయం తెలుస్తుంది. అతన్ని పిలిచి విచారిస్తే.. మేఘన ఎవరో తెలియదని.. ఆద్య(వైదిక సెంజాలియా)తో ఉన్న బ్రేకప్ స్టోరీ చెప్తాడు. అయితే మేఘన కాల్‌ లిస్ట్‌ చూస్తే.. గత కొన్నాళ్లుగా కార్తీక్‌తో మాట్లాడుతున్న విషయం బయటపడుతుంది. వారిద్దరు ప్రేమలో ఉన్నారనే విషయం కూడా ఏసీపీకి తెలుస్తుంది. అందులో నిజం ఎంత? ఏసీపీతో పెళ్లి ఫిక్స్‌ అయిన తర్వాత కార్తీక్‌తో మేఘన నిజంగా ప్రేమలో పడిందా? మేఘనతో పరిచయం ఉన్నప్పటికీ..తనకు తెలియదని కార్తీక్‌ ఎందుకు చెప్పాడు? అసలు కార్తీక్‌-మేఘనల మధ్య ఉన్న సంబంధం ఏంటి? కార్తీక్‌ -ఆద్యల బ్రేకప్ స్టోరీ ఏంటి? మేఘనను కిడ్నాప్‌ చేసిందెవరు? ఈ కథలో ఆకాశ్‌(అంకిత్‌ కొయ్య) పాత్ర ఏంటి? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. 

ఎలా ఉందంటే..
సస్పెన్స్ థ్రిల్లర్ కథలన్నీ ఒకేలా ఉంటాయి. ఓ వ్యక్తి మిస్‌ అవ్వడం.. ఆ కేసును చేధించే క్రమంలో ఊహించని ట్విస్టులు ఎదురవ్వడం.. చివరిలో అసలు నిందుతులను పట్టుకోవడం.. ఈ సినిమా కథనం కూడా అలానే సాగుతుంది. అయితే ఇందులో డిఫరెంట్‌ లవ్‌స్టోరీ ఉండడం కొత్త పాయింట్‌. అది కొంతవరకు ఎంటర్‌టైనింగ్‌గా సాగుతుంది. ఇక మిస్సింగ్‌ కేసు ఇన్వెస్టిగేషన్‌ అంతా రొటీన్‌గానే సాగుతుంది. అయితే కొన్ని ట్విస్టులు ఊహించేలా ఉన్నా..మరికొన్ని మాత్రం థ్రిల్లింగ్‌గా అనిపిస్తాయి. సస్పెన్స్ థ్రిల్లర్ రెగ్యులర్‌గా చూసేవాళ్లకు కీలకమైన ట్విస్టులు ముందుగానే ఊహించలగలరు. కానీ నార్మల్‌ ఆడియన్స్‌ మాత్రం వాటిని పసిగట్టలేరు. తర్వాత ఏం జరుగుతుందనే క్యూరియాసిటీ క్రియేట్‌ చేయడంతో దర్శకుడు కొంతవరకు సక్సెస్‌ అయ్యాడు. 

ఎలాంటి సాగదీత లేకుండా ఫస్ట్‌  సీన్‌తో అసలు కథ ప్రారంభించాడు. మేఘన కనిపించడంలేదని ఆమె తండ్రి పోలీసు స్టేషన్‌కి వెళ్లడం..ఏసీపీ రంగంలోకి దిగడం.. విచారణలో ఒక్కో విషయం బయటపడడం..ఇలా ఆసక్తికరంగా కథనం సాగుతుంది. అయితే ఫస్టాఫ్‌లో కొన్ని సీన్లు సాగదీతగా అనిపిస్తాయి. అలాగే తండ్రి కూతుళ్ల మధ్య వచ్చే సన్నివేశాలలో ఎమోషన్‌  సరిగా పండలేదు. కార్తీక్‌ బ్రేకప్‌ స్టోరీ కూడా అంతగా ఆకట్టుకోదు. ఇంటర్వెల్‌ ట్విస్ట్‌ మాత్రం సెకండాఫ్‌పై ఆసక్తిని పెంచుతుంది. ఇక ద్వితియార్థంలో   ప్రారంభం కాస్త నెమ్మదిగా ఉన్నా.. కాసేపటి తర్వాత పరుగులు పెడుతుంది. మిస్సింగ్‌ కేసు కాస్త డ్రగ్స్‌ కేసుగా మారడంతో దీని వెనుక ఎవరున్నారనే క్యూరియాసిటీ పెరుగుతుంది. అయితే అతను ఎవరనేది ఈజీగా అర్థమైపోతుంది.  కానీ అతన్ని హీరో ఎలా పట్టుకుంటాడు అనేది మాత్రం ఆసక్తికరంగా చూపించారు. నిడివి తక్కువగా ఉండడం ఈ సినిమాకు ప్లస్‌ అయింది. అయితే స్క్రీన్‌ప్లే, క్యాస్టింగ్‌ విషయంలో ఇంకాస్త జాగ్రత్తలు తీసుకొని ఉంటే ఫలితం మరోలా ఉండేది. 

ఎవరెలా చేశారంటే.. 
లవ్‌  ఫెయిల్యూర్‌ కుర్రాడు కార్తిక్‌  పాత్రలో రామ్‌  కార్తీక్‌ బాగా నటించాడు. ఇక మేఘన పాత్రకు అమ్ము అభిరామి న్యాయం చేసింది. తెరపై చాలా అందంగా కనిపిస్తూనే తనదైన నటనతో ఆకట్టుకుంది. ఇక ఏసీపీ అర్జున్‌ పాత్రలో కౌశిక్‌  బాగానే మెప్పించాడు. అంకిత్‌ కొయ్య పాత్ర నిడివి తక్కువే ఉన్నా.. చాలా ప్రాధాన్యత ఉంటుంది. ఆ పాత్ర ఇచ్చే ట్విస్టులు ఆకట్టుకుంటాయి. ఇక మేఘన తండ్రిగా గోపరాజు రమణ రెగ్యులర్‌ పాత్ర పోషించి.. మెప్పించాడు. వెంప కాశి, మహిపాల్, రుచిత, నళిని, శ్రీనివాస్, షాని, పండు.. తదితరులు తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు. 
సాంకేతిక విషయాలకొస్తే..ఆర్‌.ఆర్‌.ధృవన్‌ సంగీతం ఈ సినిమాకు ప్రధాన బలం. పాటలు వినసొంపుగా ఉన్నాయి.  నేపథ్య సంగీతం సినిమా స్థాయిని పెంచేసింది. సినిమాటోగ్రపీ బాగుంది. ఎడిటింగ్‌ షార్ప్‌గానే ఉంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గటు ఉన్నతంగా ఉన్నాయి. 

Rating:
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement