‘మహేంద్రగిరి వారాహి’ మూవీ రివ్యూ అండ్‌ రేటింగ్‌ | Mahendragiri Varahi Movie Review And Rating In Telugu | Sakshi
Sakshi News home page

‘మహేంద్రగిరి వారాహి’ మూవీ రివ్యూ అండ్‌ రేటింగ్‌

Sep 11 2026 1:43 PM | Updated on Sep 11 2026 2:25 PM

Mahendragiri Varahi Movie Review And Rating In Telugu

సుమంత్‌.. చాలా సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తుంటాడు. ఒకప్పుడు పక్కా మాస్‌ కమర్షియల్‌ సినిమాలతో ప్రేక్షకులను అలరించిన ఈ అక్కినేని హీరో.. ఈ మధ్యకాలంలో కంటెంట్‌ ఉన్న, వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ తనదైన శైలిలో మెప్పిస్తున్నాడు. కథలో కొత్తదనం, పాత్రలో వైవిధ్యం ఉంటేనే సినిమాకు ఓకే చెబుతున్న సుమంత్‌.. తాజాగా ‘మహేంద్రగిరి వారాహి’తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఐశ్వర్య రాజేష్‌, సిద్ధు జొన్నలగడ్డ, వెన్నెల కిషోర్‌, మీనాక్షి గోస్వామి, బ్రహ్మానందం, మంజు భార్గవి, వంశీ చాగంటి, కమల్‌ కామరాజు తదితరులు కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి సంతోష్‌ జాగర్లపూడి దర్శకత్వం వహించారు. వైవిధ్యమైన కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ‘మహేంద్రగిరి వారాహి’తో సుమంత్‌ ఈసారి ఎలాంటి అనుభూతిని అందించాడు? రివ్యూలో చూద్దాం.

కథేంటంటే.. 
మహేంద్రగిరి రాజవంశస్థులకు ఓ శాపం ఉంటుంది. ఆ వంశంలో పుట్టిన ప్రతి మగబిడ్డ 33వ పుట్టినరోజున మరణిస్తాడు. ఈ శాపం 200 ఏళ్లుగా కొనసాగుతూనే ఉంటుంది. అలా 1993లో ఆ వంశంలో పుట్టిన రాజేంద్ర వర్మ(సిద్దు జొన్నలగడ్డ)మరణిస్తాడు. ఇక ఈ సారి రాజేంద్రవర్మ అల్లుడు, ఆ రాజవంశానికి వారసుడు నరేంద్ర వర్మ(వంశీ చాగంటి) కూడా మరణిస్తాడని పూజారులు చెప్తారు. కథలో ఇదో భాగం.. మరోవైపు హైదరాబాద్‌కు చెందిన యూట్యూబర్‌ సిద్ధు అలియాస్‌ సిద్ధార్థ్‌(సుమంత్‌)..దెయ్యాలు, దేవుళ్ల పేరుతో కొంతమంది జనాలను మోసం చేస్తున్నారనేది ఆధారాలతో బయటపెడుతుంటాడు. అతని పెరెంట్స్‌తో పాటు అన్నయ్య రాజీవ్‌(కమల్‌ కామరాజు) కూడా దేవుడిని నమ్ముతాడు. 

పెళ్లి దోషం పోయేందుకు మహేంద్రగిరి వారాహి అమ్మవారి ఆలయంలో పూజలు చేయమని చెప్పడంతో, రాజీవ్‌ తన బర్త్‌డే రోజు ఫ్యామిలీతో కలిసి అక్కడికి వెళ్తాడు. అదే సమయంలో  నరేంద్ర వర్మ కూడా ఆలయానికి వస్తాడు. మొక్కులు చెల్లించుకుంటున్న సమయంలో గుడి ముందే ఉండే దున్నపోతు ఇద్దరినీ పొడిచి చంపేస్తుంది. సరిగ్గా 33వ పుట్టిన రోజు నాడే ఇది జరుగుతుంది. తన అన్న మరణం వెనుక ఉన్న రహస్యం ఏంటో తెలుసుకునేందుకు ప్రయత్నిస్తాడు సిద్ధు. ఈ క్రమంలో మహేంద్రగిరి రాజవంశం శాపం వెనుక ఉన్న అసలు విషయం తెలుస్తుంది. అదేంటి? రాజవంశస్తులకు శాపం ఉంటే.. రాజీవ్‌ ఎందుకు చనిపోవాల్సి వచ్చింది? అసలు 200 ఏళ్ల క్రితం ఆ శాపం ఎలా వచ్చింది? ఇప్పుడు జరుగుతున్న మరణాలకు నిజంగా అమ్మవారి శాపమే కారణమా లేదా దాని వెనుక ఎవరైనా ఉన్నారా? సిద్ధార్థ్‌ రీసెర్చ్‌లో తెలిసిన అసలు నిజాలు ఏంటి? అనేదే మిగతా కథ. 

ఎలా ఉందంటే.. 
 ఒక వంశానికి అమ్మవారి శాపం అనగానే తెలుగు ప్రేక్షకులకు గుర్తొచ్చే సినిమా ‘మురారి’. ఆ తర్వాత ఇలాంటి శాపాలు, దేవుడి కథతో చాలా సినిమాలే వచ్చాయి. `మహేంద్రగిరి వారాహి` కూడా అలాంటి కథే. రాజవంశానికి శాపం ఉండడంతో 33 ఏళ్లకే చనిపోవడం.. దీనికి వెనుక ఒక కారణం ఉండడం.. హీరో రీసెర్చ్‌ చేసి అసలు కారణం తెలుసుకోవడం..చివరకు శాప విమోచనం.. కథ సుఖాంతం.. ఇదే మహేంద్రగిరి వారాహి చిత్రం కథ. ఇలాంటి కథలను మంచి ట్విస్టులతో, తర్వాత ఏం జరుగుతుందనే ఉత్కంఠతో తెరపై చూపిస్తే ఆసక్తి కలుగుతుంది. మహేంద్రగిరి వారాహిలో అది మిస్‌ అయింది. 

దర్శకుడు ఎంచుకున్న పాయింట్‌ బాగున్నా..దాన్ని తెరపై ఆసక్తికరంగా చూపించడంలో మాత్రం కొంతవరకు మాత్రమే సఫలం అయ్యాడు. సినిమా ప్రారంభంలోనే శాపం బ్యాక్‌స్టోరీ చెబుతారు. అది కథపై ఆసక్తిని పెంచుతుంది. అయితే ఆ తర్వాత కథనం రొటీన్‌గానే సాగుతుంది. యూట్యూబర్‌గా హీరో పరిచయం.. దెయ్యాలు, దేవుడు లేడని చెబుతూ చేసే యూట్యూబ్‌ వీడియోలు.. ఇవన్నీ రొటీన్‌గానే సాగుతాయి. 

మహేంద్రగిరి రాజవంశస్తులు శాఫ విమోచనం కోసం చేసే ప్రయత్నాలు కొంతవరకు ఆసక్తికరంగా సాగుతాయి. హీరో ప్యామిలీ మహేంద్రగిరి ఆలయం వద్దకు వచ్చిన తర్వాత అసలు కథ ప్రారంభం అవుతుంది. ఇంటర్వెల్‌ ట్విస్ట్‌ బాగుంటుంది. చావుల వెనుక ఉన్న అసలు నిజాన్ని కనుక్కునేందుకు హీరో చేసే ఇన్వెస్టిగేషనే సెకండాఫ్‌ కథ. ఫస్టాఫ్‌తో పోలిస్తే ద్వితియార్థం కొంత ఆసక్తికరంగా సాగుతుంది. కొన్ని సీన్లు థ్రిల్లింగ్‌గా ఉంటాయి.  ట్విస్టులు ఆకట్టుకుంటాయి. అయితే చాలా వరకు కథనం ఊహకందేలా సాగుతుంది. అమ్మవారి సంబంధించిన సీన్లు బాగుంటాయి. అయితే  స్క్రీన్‌ప్లేని ఇంకాస్త బలంగా రాసుకొని ఉంటే ఫలితం మరోలా ఉండేది. 

ఎవరెలా చేశారంటే.. 
సిద్ధార్థ్‌ పాత్రకి సుమంత్‌ న్యాయం చేశాడు. ఫస్టాప్‌లో నార్మల్‌ యూట్యూబర​్‌గా కనిపించడంతో అతని పాత్ర అంత ఇంపాక్ట్‌ చూపదు. కానీ సెండాఫ్‌లో మాత్రం బాగా నటించాడు.అయితే ఇప్పటికే ఆయన ఈ తరహా పాత్రలు చేయడంతో కొత్తగా అనిపించదు. ఇక రాజేంద్ర వర్మగా సిద్ధు జొన్నలగడ్డ తెరపై  కాసేపు కనిపించి మెప్పించాడు. ఐశ్వర్య రాజేష్‌ పాత్ర కాసేపు సర్‌ప్రైజ్‌ చేస్తుంది. కమల్ కామరాజు పాత్ర నిడివి కూడా తక్కువే. పూజారి పాత్రకి బ్రహ్మానందం న్యాయం చేశాడు. ఆయన పాత్ర ఇచ్చే ట్విస్టు ఆకట్టుకుంటుంది. రాజీవ్‌ కనకాల  మంజు భార్గవి, మీనాక్షి గోస్వామితో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. సాంకేతికంగా సినిమా పర్వాలేదు. అనూప్‌ రూబెన్స్‌ పాటలు, నేపథ్య సంగీతం ఓకే.సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్‌ పర్వాలేదు. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి.  

Rating:
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement