ఓ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ పిలిచి మరీ వెక్కిరించాడు..చాలా బాధపడ్డా: ఐశ్వర్య లక్ష్మి | Aishwarya Lekshmi React On King Of Kotha Trolls | Sakshi
Sakshi News home page

ట్రోలింగ్‌ భయంతో దుల్కర్‌తో కలిసి నటించే చాన్స్‌ వదులుకున్నా: ఐశ్వర్య లక్ష్మి

Sep 9 2026 11:24 AM | Updated on Sep 9 2026 11:41 AM

Aishwarya Lekshmi React On King Of Kotha Trolls

సినీ తారలపై ట్రోల్స్‌ రావడం కామన్‌. అయితే కొన్ని సందర్భాల్లో ఆ ట్రోల్స్‌ వారి కెరీర్‌పై తీవ్ర ప్రభావం చూపిస్తాయి. అవకాశాలు చేజారేలా చేస్తాయి. నటి ఐశ్వర్య లక్ష్మి విషయంలోనూ ఇదే జరిగిందట. ‘కింగ్‌ ఆఫ్‌ కోథా’ సినిమా తర్వాత తనపై వచ్చిన ట్రోల్స్‌, విమర్శలు తనను ఎంతగానో ఇబ్బంది పెట్టాయని.. చివరకు కొన్ని అవకాశాలను కూడా వదులుకోవాల్సి వచ్చిందని ఆమె తాజాగా వెల్లడించారు.

దుల్కర్‌ సల్మాన్‌ హీరోగా నటించిన ‘కింగ్‌ ఆఫ్‌ కోథా’లో ఐశ్వర్య లక్ష్మి కీలక పాత్రలో కనిపించారు. అభిలాష్‌ జోషి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం 2023లో భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చి బాక్సాఫీస్‌ వద్ద ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయింది. సినిమాతో పాటు నటీనటులపై కూడా సోషల్‌ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోలింగ్‌ జరిగింది.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఐశ్వర్య లక్ష్మి మాట్లాడుతూ.. ‘కింగ్‌ ఆఫ్‌ కోథా’ పరాజయం తన కెరీర్‌పై తీవ్ర ప్రభావం చూపిందని తెలిపారు. సినిమా విడుదల తర్వాత మలయాళ చిత్రపరిశ్రమలో తనకు అవకాశాలు ఇవ్వడానికి కొందరు భయపడినట్లు అనిపించిందని చెప్పారు.

‘2023లో భారీ అంచనాల మధ్య ‘కింగ్‌ ఆఫ్‌ కోథా’ విడుదలైంది. కానీ సినిమా తర్వాత మలయాళ చిత్రపరిశ్రమ నాకు అవకాశాలు ఇవ్వడానికి భయపడినట్లు అనిపించింది. కేవలం నన్ను మాత్రమే కాదు.. దుల్కర్‌తో పాటు చిత్ర బృందం మొత్తాన్ని నెటిజన్లు తీవ్రంగా ట్రోల్‌ చేశారు. నా నటన, డైలాగ్‌ డెలివరీపై ఎన్నో విమర్శలు వచ్చాయి. కొన్నిసార్లు వారు చెప్పింది నిజమేనేమో అని నాకూ అనిపించేది.సినిమాలో తాను దుల్కర్‌ను ‘రాజువెట్టా’ అని పిలిచిన విధానాన్ని కూడా నెటిజన్లు ట్రోల్‌ చేశారని ఆమె గుర్తుచేసుకున్నారు. ‘హలో మమ్మీ’ సినిమా షూటింగ్‌ సమయంలో ఓ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ కూడా తనను పిలిచి ఆ విషయాన్ని వెక్కిరించారని, అప్పుడు చాలా బాధపడ్డానని చెప్పారు. అంతేకాదు.. ట్రోలింగ్‌ ప్రభావం తనకు వచ్చిన అవకాశాలపైనా పడిందని ఐశ్వర్య లక్ష్మి తెలిపారు. దుల్కర్‌ సల్మాన్‌తో కలిసి ఓ వాణిజ్య ప్రకటనలో నటించే అవకాశం వచ్చినప్పటికీ.. విమర్శలకు భయపడి ఆ ప్రాజెక్ట్‌ నుంచి తప్పుకున్నట్లు చెప్పారు.

‘‘దుల్కర్‌తో కలిసి ఓ కమర్షియల్‌ యాడ్‌లో నటించే అవకాశం వచ్చింది. కానీ ట్రోలింగ్‌ దెబ్బకు భయపడి ఆ అవకాశాన్ని వదులుకున్నాను. నేను నటిస్తే దారుణంగా విమర్శలు వస్తాయని.. అది చివరకు మీకే సమస్య కావచ్చని చెప్పి ఆ ప్రాజెక్ట్‌ను తిరస్కరించాను. ‘కింగ్‌ ఆఫ్‌ కోథా’ ట్రోల్స్‌ నన్ను అంతగా ప్రభావితం చేశాయి’ అని ఐశ్వర్య లక్ష్మి పేర్కొన్నారు.

సినిమా ఫలితం, తనపై వచ్చిన విమర్శలు తన మానసిక ధైర్యాన్ని కూడా దెబ్బతీశాయని ఆమె చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఐశ్వర్య లక్ష్మి సాయి దుర్గా తేజ్‌ హీరోగా నటిస్తున్న ‘సంబరాల ఏటి గట్టు’ చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement